అల్లర్లకు పాల్పడ్డవారిపై కేసులేవీ? | Sakshi
Sakshi News home page

అల్లర్లకు పాల్పడ్డవారిపై కేసులేవీ?

Published Wed, May 22 2024 5:10 AM

Several TDP leaders were arrested in Narasa Raopet

పోలీసులపై ‘సిట్‌’ అసంతృప్తి

టీడీపీ నేత చదలవాడ ఆస్పత్రిలో మారణాయుధాలు

అయినా కేసు నమోదు చేయని పోలీసులు

ఈ విషయాన్ని నివేదికలో పేర్కొన్న ‘సిట్‌’

దీంతో స్పీడ్‌ పెంచిన పోలీసులు

నరసరావుపేటలో పలువురు టీడీపీ నేతల అరెస్ట్‌

సాక్షి, నరసరావుపేట: ఎన్నికల నేపథ్యంలో జరిగిన అల్లర్లపై విచారణకు ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) డీజీపీకి సోమవారం సమర్పించిన నివేదికతో పల్నాడులో హీట్‌ పెరిగింది. ఈ నివేదికలో ఏముందోనన్న భయం అటు పోలీసులు, ఇటు టీడీపీ నేతల్లో నెలకొంది. అల్లర్లకు కారణ­మైన వారిపై కేసుల నమోదు సరిగా జరగలే­దన్న అభిప్రాయానికి సిట్‌ వచ్చిందని సమాచా­రం.

 అప్పటి పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లో, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లో అల్లర్లకు కారణమైన వారిపై పూర్తిస్థాయిలో కేసులు నమోదు కాలేదు. మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీలు, ముప్పాళ్ల మండలం తొండపిలో ముస్లింలు.. టీడీపీ నాయ­కుల దాడులతో  గ్రామాలు వదలి వెళ్లారు. అయితే అక్కడ టీడీపీ నేతలపై కేసుల నమోదు పూర్తిస్థాయిలో జరగలేదు. 

పైగా గ్రామం నుంచి ప్రాణభయంతో పారిపోయిన బాధితులపైనే కేసులు పెట్టారు. వీటన్నింటిపైనా ఎన్నికల సంఘా­నికి సిట్‌ నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. పోలీసుల తీరుపై సిట్‌ అధికారులకు తగిన ఆధారాలతో మంత్రి అంబటి రాంబాబు ఫిర్యా­దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సిట్‌ నివేదికతో బాధ్యులైన పోలీసులపై చర్యలుంటాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

అరవింద్‌బాబుపై చర్యలేవి?
ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే భావించి అల్లర్లను సృష్టించేందుకు టీడీపీ నరసరావుపేట అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు ఇతర ప్రాంతాల నుంచి గూండాలు, బౌన్సర్లను తెప్పించి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై పోలింగ్‌ రోజున దాడికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న కార్లను పగలగొట్టి ఇంటిని ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన ఎమ్మెల్యే మామ కంజుల కోటిరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. 

ఈ ఘటనపై నరసరావుపేట టూటౌన్‌ పోలీ­సులు కేసు నమోదు చేసినప్పటికీ.. ఇంతవరకు చదలవాడను అరెస్ట్‌ చేయలేదు. ఎమ్మెల్యే ఇంటిపై దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను పరి­శీలించిన సిట్‌ బృందం హింసాత్మక ఘటనకు నాయకత్వం వహించింది అరవింద్‌బాబేనని గుర్తించినట్టు సమాచారం. కాగా పోలింగ్‌ మరుసటి రోజు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హౌజ్‌ అరెస్ట్‌ చేయడానికి అరవింద్‌­బాబు ఆస్పత్రికి పోలీసులు వెళ్లిన సమయంలో అక్కడ పెట్రోల్‌ బాంబులు, రాడ్లు, కర్రలు, గాజు సీసాలు వంటి మారణాయుధాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 

అయితే కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ లీగల్‌ విభాగం సభ్యులు సిట్‌ బృందానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎందుకు చదలవాడపై కేసు నమోదు చేయలేదని సిట్‌ బృందం టూటౌన్‌ పోలీసు­లను ప్రశ్నించి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సిట్‌ నివేదికలో ఈ విషయంపై ప్రస్తావన ఉండవచ్చని పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

కొనసాగుతున్న అరెస్టులు
సిట్‌ బృందం.. కేసుల నమోదుతోపాటు అరెస్ట్‌­ల­­లో స్థానిక పోలీసుల నిర్లక్ష్యంపై గట్టిగా స్పందించినట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాలో అరెస్టు­లపై పోలీసులు దృష్టిసారించారు. నరస­రావు­పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై దాడి కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులు బెంగ­ళూరు నుంచి శ్రీశైలం వెళ్తుండగా వారి సెల్‌­ఫోన్ల సిగ్నల్స్‌ ఆధారంగా సిట్‌ బృందం అదుపులోకి తీసుకుంది. 

పమిడిపా­డుకు చెందిన టీడీపీ నేత లాం కోటేశ్వరరావు­తోపాటు మరో నలుగురిని నరసరావుపేట టూటౌన్‌ పోలీసులకు అప్పగించారు. ఇవే కాకుండా పల్నాడు జిల్లాలో మరిన్ని అరెస్టులు ఉంటాయన్న సమాచారంతో కేసుల్లో ఉన్న టీడీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలింగ్‌ రోజు, తరువాత జరిగిన అల్లర్లలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా మొత్తం 146 కేసులు నమోదు చేయగా, అందులో సుమారు 1,500 మంది నిందితుల పేర్లు ఉన్నట్టు సమాచారం. 

సిట్‌ బృందం ఆదేశాల మేరకు మరికొన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. గొడ­వలకు సంబంధించిన వీడియోలను కూడా పోలీసులు పరిశీలిస్తు­న్నారు. వీటి ఆధారంగా మరికొంతమందిని గుర్తించి అరెస్ట్‌ చేయడానికి ప్రత్యేక బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement