రాజ్యసభకు మళ్లీ వద్దిరాజు | Sakshi
Sakshi News home page

రాజ్యసభకు మళ్లీ వద్దిరాజు

Published Thu, Feb 15 2024 1:09 AM

Sitting MP Vaviraju Ravichandra is BRS Rajya Sabha candidate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేరును పార్టీ అధి నేత కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి మూడు స్థానాలకు జరిగే ఎన్నికకు సంబంధించి గురువారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు ఇతర సీనియర్‌ నేతలతో చర్చించి వద్దిరాజు అభ్యర్థిత్వంపై కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా అసెంబ్లీలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో వద్దిరాజు గురువారం నామినేషన్‌ దాఖలు చేస్తారు. కేటీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి హాజరవుతారు.

కాంగ్రెస్‌కు రెండు.. బీఆర్‌ఎస్‌కు ఒకటి
రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తుండగా అందరూ బీఆర్‌ఎస్‌కు చెందిన వారే కావడం గమనార్హం. వీరిలో జె.సంతోష్‌ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 2న తమ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. వద్దిరాజు రవిచంద్ర తన రెండేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. ఖాళీ అవుతున్న మూడు స్థానాల్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా కాంగ్రెస్‌కు రెండు, బీఆర్‌ఎస్‌కు ఒక స్థానం చొప్పున లభించనుంది. కాంగ్రెస్‌ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్లు ఇప్పటికే ఖరారు కాగా, బీఆర్‌ఎస్‌ తరపున వద్దిరాజు పేరు ఖరారు కావడంతో ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. 

వరుసగా రెండోసారి..
వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓడిపోయిన వద్దిరాజు ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. 2022 మేలో బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ బండా ప్రకాశ్‌ రాజీనామా చేయడంతో అదే నెల 23న వద్దిరాజును బీఆర్‌ఎస్‌ రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలో వద్దిరాజుకు రెండోమారు బీఆర్‌ఎస్‌ నుంచి అవకాశం దక్కింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement