‘పొత్తు’ కడుపులో కత్తులు!.. 68 సీట్ల జాబితాతో పవన్‌ ప్రతిపాదన | Sakshi
Sakshi News home page

‘పొత్తు’ కడుపులో కత్తులు!

Published Thu, Jan 25 2024 4:39 AM

Pawan Kalyan proposal with Janasena list with 68 seats to Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: పొత్తులో భాగంగా జన­సేనకు కేటాయించే స్థానాలపై పవన్‌కళ్యాణ్‌ తెలుగుదేశం పార్టీ ముందుంచిన ప్రతిపాదిత అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా ఇటీవల బయటకు పొక్కడంతో క్షేత్రస్థాయిలో ఇరు­పార్టీల నాయకుల మధ్య విభేదాలు తార­స్థాయికి చేరాయి. తమ సీటు ఎలా అడుగుతా­రంటూ టీడీపీ నేతలు స్థానిక జనసేన నాయ­­కులపై తీవ్రస్థాయిలో విరుచుకు పడు­తు­­న్నారు. రెండు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటున్నారు. ఈ విషయమై జనసేన పార్టీ నాయకులు ఆ పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం. 

ఒత్తిళ్లకు తలొగ్గే పవన్‌ ప్రతిపాదనలు 
పార్టీ నాయకులు, కొన్ని కుల సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ కొద్ది రోజుల క్రితం చంద్రబాబును కలిసినప్పుడు తమ పార్టీ కోరే సీట్ల జాబితాను అందజేశారు.  జనసేన పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. సీట్ల కేటాయింపు తెలుగుదేశం పార్టీ బాగా బలంగా ఉన్న స్థానాలనూ జనసేనకు కేటాయించారన్న అభిప్రాయం కలిగించేలా ఉండాలని బాబుకు పవన్‌ స్పష్టం చేశారని తెలుస్తోంది. దీంతోపాటు మరో రెండు కీలక ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. 68 అసెంబ్లీ  స్థానాల జాబితాను ఇచ్చి వాటిలో 45 సీట్లకు తగ్గకుండా కేటాయించాలని, 2019లో టీడీపీ గెలిచిన 23 అసెంబ్లీ స్థానాల్లో కనీసం రెండైనా తప్పనిసరిగా ఇవ్వాలని పవన్‌ ప్రతిపాదించారని సమాచారం.

2009లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన లేదా అత్యధిక ఓట్లు సాధించిన స్థానాలతోపాటు 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీకి కలిపి ఎక్కువ ఓట్లు వచ్చిన స్థానాలను గుర్తించి జాబితాను టీడీపీ ముందుంచినట్టు తెలుస్తోంది. దీనికి తోడు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండేవే జనసేనకు కేటాయించాలని పవన్‌ కోరినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలు క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య చిచ్చురేపుతున్నాయి.  

బీజేపీ పేరు చెప్పి వేచి చూద్దామన్న బాబు 
పొత్తులో భాగంగా బీజేపీని కూడా కలుపుకోవాలని తొలి నుంచి యోచిస్తున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు వేచి చూద్దామని చంద్రబాబు పవన్‌కు సూచించినట్టు తెలుస్తోంది. మరో పది పదిహేను రోజుల్లో బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తుపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని, అప్పటిదాకా రెండు పార్టీల మధ్య రాష్ట్ర స్థాయిలోనూ, నియోజకవర్గాల స్థాయిలోనూ సీట్ల అంశంలో ఎలాంటి ప్రకటనలు, విభేదాలు లేకుండా చూద్దామని చెప్పినట్టు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో సీట్ల పంపకాలపై ప్రస్తుతానికి ప్రతిష్టంభన కొనసాగుతోంది. 

పలుచోట్ల రచ్చకెక్కిన విభేదాలు 
► రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అసలు ఈ నియోజకవర్గాన్ని జనసేన ఎలా అడుగుతుందని అక్కడి జనసేన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జనసేన నేతలు తమ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 
► పెందుర్తి నియోజకవర్గంలో అక్కడి టీడీపీ నాయకుడు బండారు సత్యానందరావు, స్థానిక జనసేన నేత పంచకర్ల రమేష్‌ల మధ్య యుద్ధం జరుగుతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 
► కాకినాడ రూరల్, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో టికెట్‌ రేసులో ఉన్న టీడీపీ నాయకులు తమ స్థానాలను జనసేనకు కేటాయిస్తే తమ దారి తాము చూసుకుంటామని బహిరంగంగానే హెచ్చరికలు చేస్తున్నారు. 
► పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ – జనసేన నాయకుల మధ్య సమన్వయ కమిటీ సమావేశం జరిగిన సమయంలో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ తరహా అసంతృప్తులను కట్టడి చేసేందుకు బీజేపీని బూచిగా చూపి జనసేనను శాంతపరుస్తున్నారని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. 

జనసేనకు కేటాయించాలని కోరుతూ పవన్‌కళ్యాణ్‌ ప్రతిపాదించిన నియోజకవర్గాల జాబితా ఇదీ..
► ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాస
► ఉమ్మడి విజయనగరం జిల్లా: విజయనగరం, నెల్లిమర్ల.
► ఉమ్మడి విశాఖ పట్నం జిల్లా: పెందుర్తి, యలమంచిలి, చోడవరం, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, భీమిలి, అనకాపల్లి, గాజువాక
► ఉమ్మడి తూర్పు గోదావరి:  పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు,  పి.గన్నవరం
► ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు,  ఏలూరు,  గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట
► ఉమ్మడి కష్ణా, గుంటూరు జిల్లాలో..: విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్,  విజయవాడ తూర్పు, అవనిగడ్డ,  పెడన, నూజివీడు, మచిలీపట్నం, కైకలూరు, పెనమలూరు, తెనాలి, గుంటూరు వెస్ట్,  పెదకూరపాడు,  తాడికొండ, పొన్నూరు, వేమూరు, గుంటూరు తూర్పు
► ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో: దర్శి, గిద్దలూరు, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు,  నగరి, ఆళ్లగడ్డ, నంద్యాల,   గుంతకల్లు, బద్వేలు, రైల్వే కోడూరు,  రాజంపేట, పుట్టపర్తి, ధర్మవరం  

Advertisement
Advertisement