‘దేశం’లో ధనస్వామ్యం  | Sakshi
Sakshi News home page

‘దేశం’లో ధనస్వామ్యం 

Published Sun, Jan 7 2024 5:29 AM

Chandrababu importance for NRI and industrialists - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పేదల కోసమే పుట్టిందంటూ తరచూ చెప్పే చంద్రబాబు ఎన్నికల్లో సీట్లు మాత్రం పెత్తందారులకే కట్టబెడుతున్నారు. ఇందుకోసం మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసి ఆ జెండానే నమ్ముకున్న వారిని పూచికపుల్లలా తీసిపారేస్తున్నారు. ధనబలం ఉన్న వారికే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇస్తామని, ఇందులో మరో ఆలోచనకే తావులేదని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న సమావేశాల్లో ఆయన ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్‌ నేత ఇటీవల చంద్రబాబును కలిసి పార్టీని నిలబెట్టేందుకు తాను ఎంతలా కష్టపడ్డానో చెప్పి ఈసారి పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరినప్పుడు ఎవరికి పడితే వారికి సీట్లు ఇవ్వడం సాధ్యంకాదని ఆయన తెగేసి చెప్పారు. పోటీ చేసేవాళ్లు బయట వాళ్లా, పార్టీ వాళ్లా అనేది ముఖ్యం కాదని డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్లకే సీట్లు ఇస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. పార్టీ వ్యూహ రచన సమావేశాల్లోనూ చంద్రబాబు, ముఖ్య నేతలు ఇదే సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అభ్యర్థుల అన్వేషణ, ఎంపికలోనూ దీన్నే పాటిస్తున్నారు.

ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చాలాచోట్ల కొత్త పెత్తందారుల ముఖాలే కనిపిస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు చంద్రబాబు గేట్లు బార్లా తెరిచేశారు. పార్టీ ఫండ్‌ ఇవ్వండి, సీట్లు తీసుకోండని టీడీపీ సీనియర్లు బడాబాబులకు ఓపెన్‌ ఆఫర్‌ ఇస్తున్నారు. వలలో పడిన వారిని చంద్రబాబు వద్దకు తీసుకెళ్తున్నారు. బాబు చేసే ఈ ధన యజ్ఞంలో పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న నేతలూ కొట్టుకుపోయే పరిస్థితి దాపురించిందని పార్టీనే నమ్ముకున్న సీనియర్లు వాపోతున్నారు.   

డబ్బులేదని నానికి ఝలక్‌.. తమ్ముడికి ఛాన్స్‌.. 
ఇక విజయవాడ సిట్టింగ్‌ ఎంపీ కేశినేని ప్రస్తుతం డబ్బు ఖర్చుచేసే పరిస్థితి లేదని తెలియడంతో చంద్రబాబు ఆయన్ను అవమానకర రీతిలో పక్కన పెట్టేశారు. ఎంపీగా ఉన్నా ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు పిలవడంలేదు. చోటామోటా నేతలతో ఆయన్ను తిట్టిస్తున్నారు. పొమ్మనకుండా పొగబెట్టి పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి సృష్టించారు.

నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ సీటు ఇస్తానని చంద్రబాబు ఇటీవల స్పష్టంచేశారు. రూ.100 కోట్లకుపైగా డబ్బును ఖర్చుపెట్టేందుకు ఆయన సిద్ధపడడంతో చిన్నికి అవకాశమిచ్చారు. రియల్‌ ఎస్టేట్‌లో బాగా డబ్బు సంపాదించి, సొంత అన్నతోనే విభేదించిన చిన్ని చివరికి ఆయనకే వెన్నుపోటు పొడిచి సీటు తెచ్చుకున్నారనే ప్రచారం టీడీపీలోనే విస్తృతంగా జరుగుతోంది.  
 
గుంటూరు బరిలో విద్యా సంస్థల అధినేత! 
గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానంలో పార్టీ కోసం ఇప్పటివరకూ పనిచేసిన నేతలను కాదని ఎన్‌ఆర్‌ఐ ఉయ్యూరు శ్రీనివాస్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఆయన చంద్రబాబు చేతులు మీదుగా ప్రజలకు పండుగ కానుకలు ఇస్తామని మభ్యపెట్టి తొక్కిసలాటలో ముగ్గురి మృతికి కారణమయ్యారు. అలాగే, గుంటూరు ఎంపీ స్థానం నుంచి భాష్యం విద్యా సంస్థల యజమాని రామకృష్ణను పోటీచేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతోపాటు మరికొందరు బడా బాబుల కోసం చంద్రబాబు గేలం వేస్తున్నారు. 

♦ కాకినాడ పార్లమెంట్‌ స్థానం కోసం మొదటి నుండి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు జెడ్పీ మాజీ చైర్మన్‌ నవీన్‌కుమార్‌ను కాదని వ్యాపారవేత్త సానా సతీష్ కు సీటు ఇవ్వాలని చూస్తున్నారు.  
♦ తుని అసెంబ్లీ స్థానంలో ఏళ్ల తరబడి టీడీపీ జెండా మోసిన కృష్ణుణ్ణి నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు సీటు కట్ట బెడుతున్నారు.  
♦రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ను తప్పించి ఆర్థికంగా స్థితిమంతుడైన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తనయుడు వెంకటరమణను ఇన్‌ఛార్జిని చేశారు.  
♦  అమలాపురం ఎస్సీ రిజర్వు స్థానంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును కాదని ఆర్థికంగా ధన బలం ఉన్న అయితాబత్తుల సత్యశ్రీకి సీటు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.  
♦ చివరికి పెద్దాపురం సిట్టింగ్‌ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను కూడా కాదని కమ్మ సామాజికవర్గానికి చెందిన ధనవంతుడు, కాంట్రాక్టర్‌ చంద్రమౌళికి సీటు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  

సొంత కుటుంబానికే ఓటు.. 
ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ పెత్తందారులకే సీట్లు కట్టబెట్టేందుకు చంద్రబాబు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో  గండి బాబ్జి స్థానంలో తన కుటుంబానికి చెందిన ‘గీతం’ భరత్‌ను రంగంలోకి దించేందుకు చంద్రబాబు రంగం సిద్ధంచేసినట్లు తెలుస్తోంది.  
 
తెరపైకి ఎన్‌ఆర్‌ఐలు  
♦ విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కోళ్ల అప్పలనాయుడు కుటుంబాన్ని కాదని ఎన్‌ఆర్‌ఐ కొంప కృష్ణను రంగంలోకి దించారు. తనదే సీటని చెప్పుకుంటూ ఆయన నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు.  
♦ నెల్లిమర్లలో మాజీమంత్రి పతివాడ నారాయణస్వామిని కాదని బంగార్రాజు అనే వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.  
♦పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నుంచి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కుటుంబాన్ని పక్కనపెట్టి ఎన్‌ఆర్‌ఐ గోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చారు. 
♦ కృష్ణాజిల్లా గుడివాడలో రావి వెంకటేశ్వరరావు కుటుంబం ఎన్టీఆర్‌ నాటి నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉంది. ఇప్పుడు డబ్బులేదనే కారణంతోనే రావిని పక్కకు నెట్టి ఎన్‌ఆర్‌ఐ వెనిగళ్ల రాముని ఇన్‌ఛార్జిగా ప్రకటించారు. రాముకున్న అర్హత కేవలం ధన బలం మాత్రమేనని, డబ్బు లేకపోవడంవల్లే తనను దూరం పెట్టారని రావి వెంకటేశ్వరరావు వాపోతున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement