ఆ రాష్ట్రాలకు పౌరసత్వ సవరణ చట్టం నుంచి మినహాయింపు? | Sakshi
Sakshi News home page

CAA: ఆ రాష్ట్రాలకు పౌరసత్వ సవరణ చట్టం నుంచి మినహాయింపు?

Published Tue, Mar 12 2024 7:24 AM

CAA Will Not Implement in Northeast States - Sakshi

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ  సవరణ చట్టం (సీఏఏ)నోటిఫికేషన్‌ను  జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులతో సహా  ముస్లిమేతర వలసదారులకు ఈ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని ఇవ్వనుంది. అయితే కొన్ని రాష్ట్రాలను ఈ చట్టం పరిధి నుంచి తప్పించారు. ఆ రాష్ట్రాలు ఏవి? ఎందుకు మినహాయింపునిచ్చారు?

మీడియా దగ్గరున్న సమాచారం ‍ప్రకారం ఈశాన్య రాష్ట్రాల్లోని పలు గిరిజన ప్రాంతాల్లో  పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయరు. వీటిలో రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక హోదా మంజూరైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రయాణానికి ‘ఇన్నర్ లైన్ పర్మిట్’ (ఐఎల్‌పీ) అవసరమయ్యే అన్ని ఈశాన్య రాష్ట్రాలలో సీఏఏ చట్టం అమలు చేయరు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్‌లకు ఐఎల్‌పీ వర్తిస్తుంది. 

రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో స్వయంప్రతిపత్తి గల కౌన్సిళ్లుగా ఏర్పడిన గిరిజన ప్రాంతాలను కూడా సీఏఏ పరిధి నుంచి తప్పించారు. అసోం, మేఘాలయ, త్రిపురలలో ఇటువంటి స్వయం ప్రతిపత్తి కౌన్సిళ్లు ఉన్నాయి. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందూయేతరులు తొలుత తాము ఈ మూడు దేశాలలో  ఎక్కడైనా నివాసితులుగా నిరూపించుకోవాలి. అప్పుడే వారికి భారత పౌరసత్వం వర్తిస్తుంది. ఇందుకోసం వారు వారి పాస్‌పోర్ట్, జనన ధృవీకరణ పత్రం, విద్యా ధృవీకరణ పత్రం, అక్కడ ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా సర్టిఫికేట్ లేదా లైసెన్స్, భూమి పత్రాలను సంబంధిత అధికారులకు చూపించవలసి ఉంటుంది. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement