Telangana Crime News: వాట్సాప్‌లో తన బాధనంతా చెప్పుకుని.. యువకుడు తీవ్ర నిర్ణయం​!
Sakshi News home page

వాట్సాప్‌లో తన బాధనంతా చెప్పుకుని.. యువకుడు తీవ్ర నిర్ణయం​!

Published Sun, Oct 8 2023 12:40 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో ఉంటున్న సతీష్‌ (24) శనివారం సాయంత్రం కాలనీసమీపంలోని రైల్వేట్రాక్‌పై రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ, జూదానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు స్నేహితుడు గణేష్‌కు మెసేజ్‌ పెట్టాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా.. తూర్పు గోదావరి జిల్లా చిన్నవంగలపాడు చెందిన సతీష్‌ పోలేపల్లి ఫార్మా సెజ్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తూ పట్టణంలోని శ్రీనివాసనగర్‌ కాలనీలో మరో ముగ్గురితో కలసి అద్దెకు నివాసం ఉంటున్నాడు.

శనివారం సాయంత్రం 6గంటలు దాటాక తోటి స్నేహితుడికి వాట్సాప్‌ మెసేజ్‌పెట్టాడు. ‘తన మృతదేహం రైలుపట్టాలపై ఉంటుందని, తీసుకుని ఎలాగైనా ఇంటికి చేర్చాలని, డబ్బులు లేకుంటే ఏమి చేయలేమని, తనకు బ్యాంకులో కొంత అప్పు ఉందని, అదికాకుండా బయట రూ.40వేల అప్పు ఉందని మెసేజ్‌లో పొందుపర్చాడు. తాను జూదానికి బానిసైనట్లుగా అందులోనుంచి బయటకు రాలేకపోతున్నానని, అప్పులు తీర్చేమార్గం లేకుండా పోయిందని తెలిపాడు.

తాను ఏమి చేయలేనని, తల్లిదండ్రులకు అండగా ఉండి సోదరి పెళ్లి చేయాలనుకున్నా చేయలేదని, తనవల్ల ఎవరికీ లాభం లేదని, అమ్మానాన్నలతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతున్నానని, మన్నించమని వేడుకున్నాడు. సోదరి ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులిచ్చేదని, అయినా పెళ్లి చేసి అండగా ఉండాల్సిన వాడిని ఏం చేయలేకపోతున్నానని, తనకు మనోధైర్యం ఇచ్చేవారు లేరని తెలిపాడు.

తన చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొన్నాడు. మెసేజ్‌ చూసిన గణేష్‌తోపాటు ఇంటి యజమాని ప్రకాష్‌ మరికొందరు కలిసి రైలుపట్టాలపై వెతకగా మృతదేహం లభించింది. దీంతో విషయాన్ని అతడి బావ ప్రసాద్‌కు తెలియజేశారు. జడ్చర్లలోనే నివాసం ఉంటున్న అతడు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక రైల్వే స్టేషన్‌మాస్టర్‌కు సమాచారం అందించారు. హెడ్‌కానిస్టేబుల్‌ కృష్ణ అక్కడికి చేరుకుని పంచనామా నిర్వహించి రాత్రి మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

తప్పక చదవండి

Advertisement