గ‌ర్బ‌వ‌తుల‌కు మైగ్రేన్ వ‌స్తే.. | Sakshi
Sakshi News home page

గ‌ర్బ‌వ‌తుల‌కు మైగ్రేన్ వ‌స్తే..

Published Sun, Oct 1 2023 10:30 AM

Migraine Headaches During Pregnancy - Sakshi

నాకు మైగ్రేన్‌ ఉంది. తరచుగా వస్తుంటుంది. ఎన్ని మందులు వాడినా పూర్తిగా తగ్గలేదు. ఇప్పుడు నాకు మూడో నెల. ఎలాంటి మందులు వేసుకోవాలి? ఈ టైమ్‌లో మైగ్రేన్‌ బాధించకుండా ఏం చేయాలి?
– టి. స్రవంతి, నాగ్‌పూర్‌

మైగ్రేన్‌ సర్వసాధారణమైన తలనొప్పి. మైగ్రేన్‌ నొప్పి మొదలవడానికి ముందు కొంతమందికి వాంతులు, వికారం, తల తిప్పినట్టవడం వంటివి ఉంటాయి. మీకు అలాంటి లక్షణాలు ఉంటాయా? ఉండవా? మీ మైగ్రేన్‌ లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది ముందు మీరు మీ గైనకాలజిస్ట్‌తో చర్చించండి. దాదాపుగా సగం మందిలో ప్రెగ్నెన్సీలో సమయంలో మైగ్రేన్‌ తగ్గుతుంది. మందుల అవసరం కూడా తగ్గుతుంది. కానీ ఆల్‌రెడీ మైగ్రేన్‌ ఉన్న కొందరిలో హై బీపీ, Pre  eclampsia చాన్సెస్‌ పెరుగుతాయి. ప్రెగ్నెన్సీలో తగినంత విశ్రాంతి, లిక్విడ్స్‌ ఎక్కువగా తీసుకోవడం, టైమ్‌కి తినడం, యోగా, ధ్యానం లాంటివాటితో తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పుడైనా తలనొప్పి మరీ ఎక్కువగా ఉంటే పారసిటమాల్‌ మాత్రను వేసుకోవచ్చు. రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ అయిన మైండ్‌ఫుల్‌నెస్‌ లాంటివీ తలనొప్పి తగ్గేందుకు దోహదపడతాయి. ప్రెగ్నెన్సీ తొలినాళ్లలో క్రమం తప్పకుండా మెడిటేషన్‌ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ముందుగా.. మీకు దేనివల్ల మైగ్రేన్‌ పెరుగుతుందో చెక్‌ చేసుకోండి. ఆ ట్రిగర్‌ని మేనేజ్‌ చేస్తే ఎపిసోడ్స్‌ తగ్గుతాయి. కంటి నిండా నిద్ర చాలా అవసరం. ఎండలో తిరగటం, చీజ్, చాకోలేట్స్‌ మొదలైనవి కొందరిలో మైగ్రేన్‌ను ట్రిగర్‌ చేస్తాయి. మైగ్రేన్‌ ఎక్కువసార్లు వస్తూంటే ఒకసారి న్యూరాలజిస్ట్‌ ఒపీనియన్‌ తీసుకోవాలి. సురక్షితమైన మందుబిళ్లలను అదీ తక్కువ మోతాదులో అదీ తక్కువసార్లు మాత్రమే తీసుకోమని సజెస్ట్‌ చేస్తారు.

కొన్ని మందులు గర్భంలోని శిశువు ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే స్పెషలైజ్డ్‌ కేర్‌ టీమ్‌ పర్యవేక్షణలో ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో Ergotamine, Ibuprofen లాంటివి అస్సలు  ప్రిస్క్రైబ్‌ చేయరు. తెలియకుండా మందులు వాడకూడదు. హైరిస్క్‌ కేర్‌ టీమ్‌ని సంప్రదించాలి. కొన్ని మందుల వల్ల బిడ్డకు పుట్టుకతో లోపాలు ఏర్పడవచ్చు. కొంతమంది ప్రెగ్నెన్సీ కంటే ముందే అధిక మోతాదులో కొన్ని మందులను తీసుకుంటూ ఉండి ఉంటే గర్భం నిర్ధారణ అయిన తర్వాత వాటిని మారుస్తారు. 
డాక్టర్‌ భావన కాసు, గైనకాలజిస్ట్‌ ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌ 

(చ‌ద‌వండి: పంపాతీరంలో హ‌నుమంతునిచే త్రిశూల‌రోముడి హ‌తం.. మునుల‌కు ప్ర‌శాంత‌త‌)
  

Advertisement
Advertisement