Sakshi News home page

పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ వదల్లేక పోతున్నారా? అయితే ఇలా చేయండి

Published Sat, Dec 2 2023 3:34 PM

How To Keep Your Child Away From Smart Phones - Sakshi

ప్రస్తుత కాలంలో ఎవరింట చూసినా పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ఐపాడ్లు ఉండవలసిందే! స్మార్ట్‌ఫోన్లు అధికంగా వాడుతున్న పిల్లలు కదలకుండా ఒకేచోట కూర్చొని ఉంటారు. దీనివల్ల వారు చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది.

అంతేకాదు ఫోన్‌ లేదా టీవీ చూస్తూ ఉంటే కాస్త ఎక్కువే తినేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం, కీళ్ల సమస్యలు, గుండె జబ్బులు వంటి  వాటి బారిన పడే ప్రమాదం పెరిగిపోతుంది. వీటన్నింటి నుంచి రక్షించాలంటే పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ వాడకుండా చేయాలి. అదెలాగో చూద్దాం. 

  • పిల్లల మనసు అద్దం లాంటిది. తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న ఇతర పెద్దలు ఏం చేస్తున్నారో చూసి అదే అలవాటు చేసుకుంటారు.  కాబట్టి ఇంట్లో ఉన్న సమయంలో తల్లిదండ్రులు, ఇతర పెద్దలూ స్మార్ట్‌ఫోన్, లాప్‌టాప్‌ వంటివి చూడకూడదని గుర్తుంచుకోండి.
  • పిల్లలకు ఫోన్‌ చూస్తూ తినే అలవాటు ఉంటే, వాళ్లకు ఆకలిగా ఉన్నప్పుడే అన్నం పెట్టండి. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు అల్లరి చేయరు. మొబైల్‌ గురించి ఆలోచించరు. తిండిపైనే ధ్యాస పెడతారు.
  •  మొబైల్‌ లేకుండా ఐదు నిమిషాల పాటు వారికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. పేచీ పెట్టకుండా సరిగ్గా తింటే, ఈ సమయాన్ని పెంచవచ్చు.
  • పిల్లలకు తినిపించేటప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఉండండి. వంటకాలు ఎలా ఉన్నాయో అడగండి. నవ్వుతూ... కబుర్లు చెబుతూ, జోకులేస్తూ, సరదాగా గడిపితే మొబైల్‌ ఫోన్‌ చూపించి తిండి పెట్టాల్సిన అవసరం ఉండదు.
  • చిన్నప్పటినుంచి పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. ముందు బొమ్మల పుస్తకాలతో మొదలు పెట్టండి. ఆ తర్వాత పజిల్స్‌ పూర్తి చేయడం, కథల పుస్తకాలు, వార్తా పత్రికలలో పిల్లలకోసం కేటాయించే కథనాలను చదవడం అలవాటు చేయడం వల్ల వారి దృష్టి స్మార్ట్‌ఫోన్‌ పైకి మళ్లదు.
  • పిల్లలకు బాల్యం నుంచి చుట్టుపక్కల పిల్లలతో ఆటలు ఆడటం అలవాటు చేయాలి. వారి వయసు పిల్లలు లేకపోతే మీరే వారితో ఆడుకోండి. కాసేపు ఔట్‌డోర్‌ ఆటలు, కాసేపు చెస్, క్యారమ్స్‌ వంటివి ఆడటం అలవాటు చేస్తే స్మార్ట్‌ఫోన్‌ బారిన పడకుండా స్మార్ట్‌గా తయారవుతారు. 

Advertisement
Advertisement