తమ దగ్గర ఉన్నదే... | Sakshi
Sakshi News home page

తమ దగ్గర ఉన్నదే...

Published Mon, Mar 11 2024 12:01 AM

Feelings expressed in words reveal the mentality and personality of a person - Sakshi

మంచిమాట

మనసంతా అసూయతో నిండి ఉన్నవారు ఎవరిలోను గొప్పతనాన్ని అంగీకరించ లేరు. ఎవరి గురించి అయినా గొప్పవారు అని అనగానే వెంటనే ఏదో ఒక లోపం వారిలో వెతికి, ఆ ఒక్కదాని వల్ల వారు పనికిరాని వారు అని నిర్ధారించేస్తారు. మానవమాత్రులకి ఏదో ఒక చిన్న లోపం, దోషం కాకపోవచ్చు, ఉండే ఉంటుంది. సద్గుణాలని ఎన్ని ఉన్నా పక్కకి పెట్టి, ఆ చిన్న బలహీనతనే పతాక శీర్షికగా చేస్తారు.  

‘‘అయ్యా! మీనుండి సహాయం పొందిన వారే మిమ్మలని గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. మీరు వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడరేమి?’’ అని ప్రశ్నించిన వారికి ఒక మహానుభావుడు ఇట్లా సమాధానం చెప్పారు. ‘‘ఎవరైనా తమ దగ్గర ఉన్న దానిని మాత్రమే ఇవ్వగలరు కదా! నా దగ్గర ఉన్న దానిని నేను పంచుతున్నాను. వారి దగ్గర ఉన్న దానిని వారు వెలిగక్కుతున్నారు.’’

నిజమే కదా! తమ వద్ద లేని దానిని ఎవరైనా ఎట్లా ఇవ్వగలరు? గుండెల నిండా ప్రేమ, సానుభూతి, ఆప్యాయత, దయ మొదలైనవి ఉన్న వారు వాటినే వ్యక్తీకరించ గలుగుతారు. ద్వేషం, పగ, అసూయ ఉన్న వారు వాటినే ప్రకటించగలుగుతారు. మాటలలో వ్యక్తమయ్యే భావాలే మనిషి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియ చేస్తాయి. వాస్తవాన్ని గ్రహించటానికి అటువంటివారి మాటలని వడగట్టవలసి ఉంటుంది. వాటికి వెంటనే ప్రతిస్పందించకుండా ఉండాలి. వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

ఒక పాత్రలో దేనినైనా నింపుతూ ఉంటే నిండగానే అది పొంగి పొరలుతూ ఉంటుంది. అదేవిధంగా గుండె అనే పాత్రలో ఏది నిండితే అదే వెలుపలికి ఉబికి వస్తుంది. దానిని తట్టుకోగలగటం కష్టమైన పనే అని చెప్పవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రేమని కూడా తట్టుకోటం కష్టం. అవతలి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పాయసంలో పడ్డ ఈగ లాగా గిజగిజ లాడ వలసి వస్తుంది.

కొంచెం ఇబ్బందిగా మొహమాటంగా అనిపించినా ప్రమోదమే కాని, ప్రమాదం ఏమీ ఉండదు. అదే ద్వేషమైతే చెప్పనవసరం లేదు. వాతావరణాన్ని కలుషితం చేయటమే కాదు, కొన్నిమారులు ప్రమాదాలు కూడా తెచ్చి పెడుతుంది. ఇటువంటి వారు సమాజంలో కోకొల్లలుగా కనపడుతూనే ఉంటారు. ఎందుకు ఎదుటివారి మీద విషం కక్కుతారో తెలియదు. ఎవరు బాగున్నా వీరికి నిద్రపట్టదు. ఏదో ఒక వంకర మాట అనవలసినదే.

ఒకప్పుడు మాటలకే పరిమితం అయిన ఈ వ్యవహారం తరువాత అచ్చులో కనపడేది. ఇప్పుడు ఎలెక్ట్రానిక్‌ మీడియా వేదిక అయింది. ఇక వాట్సప్, ట్విటర్‌ వంటి వాటిలో విచ్చలవిడిగా విషబీజాలు వెదజల్లటం చూస్తున్నాం. అసలు బాధాకరమైన విషయం ఏమంటే వీటికే ఆదరణ ఎక్కువగా ఉంటోంది. దీనికి కారణం ఆకర్షణ ఒక్కటే కాదు, ఎందుకు ఆ విధంగా చెప్పారో తెలుసుకుందామనే కుతూహలం కూడా అని కొంతమంది విశ్లేషణ. స్పష్టంగా తెలుస్తూనే ఉందిగా – వారి మనస్సులన్నీ ప్రతికూల భావనలతో నిండి ఉన్నాయని!

ఎవరికైనా ఇవ్వాలనుకుంటే, తన దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా! ఉద్దేశం ఉంటే సరి పోదు. శక్తి ఉండాలి, సంపద కూడా ఉండాలి. అది కూడా ఎంత ఇచ్చినా తనకి తక్కువ కాదు అన్నంత నిండుగా ఉంటేనే సాధ్యం. అది ధనం కావచ్చు, విద్య కావచ్చు. వస్తుసంపద కావచ్చు, ప్రేమాభిమానాలు కావచ్చు. మంచివే పెంచుకుందాం. పంచుకుందాం.      
 

ఈ రోజు మనతో ఎవరి గురించి అయినా చెడుగా చెపుతున్నారు అంటే, రేపు మన గురించి ఎంతమందితో ఏం చెపుతారో! ఇది గుర్తించి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇట్లా చెప్పేవారికి కాస్త సృజనాత్మకత కూడా ఉంటుంది. ఎదుటివారు నమ్మే విధంగా చక్కని కల్పనలు చేయగలరు. బట్టతలకి మోకాలికి ముడి పెట్టగలరు.

– డా. ఎన్‌. అనంత లక్ష్మి

Advertisement
Advertisement