భారత్‌లో ఇంధనానికి భారీ డిమాండ్‌ | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఇంధనానికి భారీ డిమాండ్‌

Published Fri, Oct 28 2022 4:37 AM

India to see biggest jump in energy demand globally - Sakshi

న్యూఢిల్లీ: ఈ దశాబ్దంలో భారత్‌లో ఇంధన వినియోగం గణనీయంగా పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఏఈఏ) అంచనావేసింది. ‘‘భారత్‌ 2025 నాటికి అత్యధిక జనాభా దేశంగా ఉంటుంది. పట్టణీకరణకుతోడు, పారిశ్రామికీకరణ వల్ల ఏటా ఇంధన డిమాండ్‌ 3 శాతం చొప్పున పెరుగుతుంది’’అని తెలిపింది. పప్రంచ ఇంధన వినియోగంపై అంచనాలతో ఓ నివేదికను గురువారం విడుదల చేసింది.

పునరుత్పాదక ఇంధనానికి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు, సమర్థవంతమైన విధానాల వల్ల 2030 నాటికి పెరగనున్న విద్యుత్‌ డిమాండ్‌లో 60 శాతాన్ని పర్యావరణ అనుకూల ఇంధనాలే తీరుస్తాయని వివరించింది. అదే సమయంలో బొగ్గు ఆధారిత విద్యుత్‌ మొత్తం ఇంధన డిమాండ్‌లో మూడింట ఒకటో వంతు ఉంటుందని అంచనా వేసింది. ఒకటో వంతు అవసరాలు చమురు ద్వారా తీరతాయని పేర్కొంది.

శిలాజ ఇంధనాల దిగుమతుల బిల్లు వచ్చే రెండు దశాబ్దాల కాలంలో రెట్టింపు అవుతుందని అంచనా వ్యక్తీకరించింది. ఇది ఇంధన భద్రతకు రిస్క్‌గా అభివర్ణించింది. ప్రపంచం మొదటి అంతర్జాతీయ ఇంధన సంక్షోభం మధ్యస్థ దశలో ఉన్నట్టు వివరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి దీనికి ప్రేరణనిచ్చిందని తెలిపింది. ‘‘రష్యా ప్రపంచంలో శిలాజ ఇంధనాల ఎగుమతుల్లో పెద్ద దేశంగా ఉంది. అయితే, యూరప్‌కు సహజ వాయువు సరఫరాను రష్యా తగ్గించేయడం, అదే సమయంలో రష్యా చమురు, బొగ్గు ఎగుమతులపై యూరప్‌ ఆంక్షలు విధించడం ప్రపంచ ఇంధన వాణిజ్యానికి ప్రధాన అవరోధాలు’’అని ఈ నివేదిక ప్రస్తావించింది.  

ఇంధనాల వారీగా డిమాండ్‌..
► భారత్‌లో 2030 నాటికి బొగ్గు డిమాండ్‌ గరిష్ట స్థాయిలో రోజువారీగా 770 మిలియన్‌ టన్ను లకు చేరుతుంది. 2021 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్‌ సామర్థ్యం 240 గిగావాట్లుగా ఉంటే, 2030 నాటికి 275 గిగావాట్లకు పెరుగుతుంది.  
► చమురుకి డిమాండ్‌ 2021కి రోజువారీగా 4.7 మిలియన్‌ బ్యారెళ్లు ఉంటే, 2030 నాటికి 6.7 మిలియన్‌ బ్యారెళ్లకు పెరుగుతుంది. 2040 నాటికి 7.4 మిలియన్‌ బ్యారెళ్లకు చేరుతుంది.
► 2030 నాటికి అదనంగా పెరిగే విద్యుత్‌ అవసరాల్లో 60 శాతాన్ని పునరుత్పాదక వనరులు తీరుస్తాయి. అప్పటికి మొత్తం విద్యుత్‌ అవసరాల్లో పునరుత్పాదక ఇంధనాల వాటా 35 శాతం మేర ఉంటుంది. ఇందులో సోలార్‌ పీవీ ప్లాంట్ల ద్వారానే 15 శాతం అవసరాలు తీరతాయి.  
► సహజ వాయువు డిమాండ్‌ 2030 నాటికి 115 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లకు చేరుతుంది. 2021 నాటికి ఇది 66 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లుగా ఉంది. మొత్తం మీద పెరిగే ఇంధన అవసరాల్లో గ్యాస్‌ వాటా 5 శాతంగానే ఉంటుంది.
► తక్కువ ఉద్గారాలు విడుదల చేసే ప్రత్యామ్నా య ఇంధన వనరుల్లో వేగవంతమైన పురోగతి కోసం భారత్‌ తీసుకుంటున్న చర్యలు.. 2070 నాటికి నెట్‌ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి.  

 

Advertisement
Advertisement