షాకింగ్‌:హైదరాబాద్‌ మార్కెట్లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు | Sakshi
Sakshi News home page

షాకింగ్‌:హైదరాబాద్‌ మార్కెట్లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు

Published Thu, Jun 15 2023 6:39 AM

Housing prices rise 8percent YoY in Q1 2023 - Sakshi

న్యూఢిల్లీ: హైదాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఇళ్ల ధరలు ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 13 శాతం పెరిగాయి. చదరపు అడుగు రూ.10,410గా ఉంది. ఈ వివరాలను క్రెడాయ్, కొలియర్స్, లైసెస్‌ ఫొరాస్‌ సంయుక్తంగా విడుదల చేసిన ‘హౌసింగ్‌ ప్రైస్‌ ట్రాకర్‌ రిపోర్ట్‌ క్యూ1 2023’ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు సగటున 8 శాతం మేర క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు పెరిగాయి.  

అత్యధికంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో ఇళ్ల ధరలు జనవరి-మార్చి కాలంలో 16 శాతం పెరగ్గా, కోల్‌కతాలో 15 శాతం, బెంగళూరులో 14 శాతం చొప్పున వృద్ధి చెందాయి.  
ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఇళ్ల ధరలు పెరగడం వరుసగా 11వ త్రైమాసికంలోనూ నమోదైంది. చదరపు అడుగు ధర 16 శాతం వృద్ధి చెంది రూ.8,432కు చేరుకుంది.
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇళ్ల ధరలు 59 శాతం మేర పెరిగాయి. గురుగ్రామ్‌లోని గోల్ఫ్‌కోర్స్‌ రోడ్డులో 42 శాతం పెరిగాయి.
► ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఇళ్ల ధరలు అత్యధికంగా ఇక్కడే ఉన్నాయి.
అహ్మదాబాద్‌ ప్రాంతంలో 11 శాతం వృద్ధి కనిపించింది. చదరపు అడుగు ధర రూ.6,324గా ఉంది. 
బెంగళూరులో చదరపు అడుగు ధర 14 శాతం పెరిగి రూ.8,748కి చేరుకుంది.  చెన్నైలో చదరపు అడుగు ధర 4 శాతం వృద్ధితో రూ.7,395కు చేరింది.
కోల్‌కతాలో 15 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.7,211గా ఉంది.  
పుణెలో 11 శాతం పెరిగి రూ.8,352గా నమోదైంది.
ముంబై మెట్రో పాలిటన్‌ రీజియన్‌లో మాత్రం 2 శాతం తగ్గి చదరపు అడుగు ధర రూ.19,219గా నమోదైంది.

(యూట్యూబర్లకు గుడ్‌ న్యూస్‌, 500 చాలట!)

వృద్ధి కొనసాగుతుంది..  
రానున్న రోజుల్లో ధరల పెరుగుదల మోస్తరుగా ఉండొచ్చని లైసెస్‌ ఫొరాస్‌ ఎండీ పంకజ్‌ కపూర్‌ అభిప్రాయపడ్డారు. ‘‘ఇళ్ల నిర్మాణంలో వినియోగించే మెటీరియల్‌ ధరల ఫలితంగా ఇళ్ల ధరలు కూడా పెరిగాయి. అయినా కానీ, స్థిరమైన డిమాండ్‌ నెలకొంది. ఈ బలమైన ధోరణి కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. కొత్త ఇల్లు కొనుగోలు పట్ల వినియోగదారులు స్పష్టమైన ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద ఇళ్లు, మెరుగైన సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ బొమన్‌ ఇరానీ పేర్కొన్నారు. అంతర్జాతీయ అనిశ్చితులు, వడ్డీ రేట్ల రూపంలో ఎదురైన సవాళ్ల మధ్య హౌసింగ్‌ రంగం బలంగా నిలబడినట్టు కొలియర్స్‌ సర్వీసెస్‌ కు చెందిన అక్యుపయర్‌ సర్వీసెస్‌ ఎండీ పీయూష్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. సొంతిల్లు కలిగి ఉండేందుకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో అందుబాటు ధరలు, నాణ్యతో కూడిన ప్రాజెక్టులు ఈ రంగం వృద్ధికి తోడ్పడతాయన్నారు. (కేటీఎం తొలి ఎలక్ట్రిక్​ స్కూటర్‌ వచ్చేస్తోంది: ఫీచర్లు ఎలా ఉంటాయంటే!)

Advertisement
Advertisement