అబ్బురపరిచే ఆవిష్కరణలు!

అబ్బురపరిచే  ఆవిష్కరణలు!


పంటల సాగులో విపరీతంగా రసాయనాల వినియోగం వల్ల భూసారం, పర్యావరణం నాశనమవుతోంది. సాగు వ్యయం నానాటికీ పెచ్చుమీరి, దిగుబడులు దిగజారుతున్నాయి. ఈ తరుణంలో.. వ్యవసాయ పద్ధతులను ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవడమే తెలివైన పని. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో సత్ఫలితాలనిచ్చే, ప్రకృతికి హానిచేయని సాంకేతికతలు, యంత్ర పరికరాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఇటువంటి ఆవిష్కరణలను అందించే శాస్త్రవేత్తలకు, రైతు శాస్త్రవేత్తలకు దేశంలో కొదవ లేదు. అయితే, వీటిల్లో చాలా వరకు రైతులకు చేరకుండానే మరుగున పడిపోతున్నాయి. ఈ సమస్యపై దృష్టిపెట్టిన హైదరాబాద్‌లోని జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ (ఎన్.ఐ.పి. హెచ్.ఎం.) ఈ నెల 4-6 తేదీల్లో జాతీయ స్థాయి ప్రదర్శన, వర్క్‌షాప్‌లను నిర్వహించింది. రైతులను ఆకట్టుకున్న కొన్ని ముఖ్య ఆవిష్కరణల వివరాలను క్లుప్తంగా  ‘సాగుబడి’ పాఠకుల కోసం  అందిస్తోంది సాక్షి’.

 

 ఏ పంటనైనా  విత్తగల  డ్రమ్‌సీడర్!

 

 

 

 

 - వరితోపాటు మొక్కజొన్న, అపరాల సాగుకూ ఉపయోగకరం

 - విత్తనంతోపాటే గడ్డి మందు, ఎరువులూ వేయగలదు

 - ఎన్‌ఐపీహెచ్‌ఎం ప్రదర్శనలో రైతులు, శాస్త్రవేత్తలందరి కళ్లూ దీనిపైనే!



సాధారణ డ్రమ్ సీడర్ వరి విత్తనం వేయడానికి మాత్రమే పనికొస్తుంది.  కానీ బహుళ ప్రయోజనకారి అయిన ఈ డ్రమ్‌సీడర్ వరితోపాటు అనేక ఇతర పంటల విత్తనాలను కూడా విత్తుకోవడానికి ఎంచక్కా పనికొస్తుంది. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన రైతు శాస్త్రవేత్త ధమరశింగి బాబూరావు ఈ వినూత్న డ్రమ్ సీడర్‌ను రూపొందించారు. వ్యవసాయదారుడైన బాబూరావు వెల్డింగ్ వర్క్‌షాపును కూడా నిర్వహిస్తున్నారు. 8 అడుగుల వెడల్పున 3 చక్రాలతో కూడి ఉండే ఈ ఇనుప డ్రమ్‌సీడర్ బరువు 48 కిలోలు. ధర రూ. 32 వేలు. దీనితో మొక్కజొన్న(4 సాళ్లు), వరి, వేరుశనగ, అపరాల విత్తనాల(7 సాళ్లు)తోపాటు గడ్డి మందు కూడా వేయొచ్చు. స్వల్ప మార్పులతో ఘన / ద్రవరూప ఎరువులను కూడా విత్తనాలతోపాటే వేసుకోవచ్చు. చక్రాల దగ్గర అటొకరు, ఇటొకరు నిలబడి దీన్ని లాగాల్సి ఉంటుంది. కావాలనుకుంటే ఎద్దును కట్టి లాగించొచ్చు లేదా 3 హెచ్‌పీ కిరోసిన్ ఇంజిన్‌ను బిగించి నడిపించొచ్చు. దీనితో రెండున్నర గంటల్లో ఎకరం పొలంలో విత్తనాలు వేయొచ్చని బాబూరావు తెలిపారు.



వరితోపాటు ఇన్ని రకాల పంటలు విత్తటానికి, ఎరువు, కలుపు మందు చల్లడానికి పనికొచ్చేదీ.. మనుషులు సులువుగా లాక్కెళ్లే వీలుండే ఇంత మెరుగైన డ్రమ్‌సీడర్ దేశంలోనే మరెక్కడా లేదని ఎన్‌ఐపీహెచ్‌ఎం శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది. అందువల్లే ఎగ్జిబిషన్‌ను సందర్శించిన వివిధ రాష్ట్రాల రైతులను ఇది అమితంగా ఆకట్టుకుంది. ‘కూలీల కొరత రైతులను వేధిస్తోంది. రైతు కష్టాలను తగ్గించడం, సాగు ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా గత కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రయోగాలు చేస్తున్నా. దీని విడిభాగాలుగా విప్పి దాచి పెట్టుకొని.. అవసరమైనప్పుడు తిరిగి సులువుగా బిగించుకోవచ్చు. ఇనుముతో తయారు చేస్తున్నందు వల్ల దీన్ని బరువు 48 కిలోలైంది. స్టీల్‌ను ఉపయోగించి దీని బరువును 20 కిలోలకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నా. అప్పుడు దీన్ని భుజానేసుకొని తీసుకెళ్లొచ్చు. రైతులు, శాస్త్రవేత్తలు మెచ్చుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది’ అన్నారు బాబూరావు

 (94409 40025).

 

అగ్గిపుల్లే అణ్వస్త్రం!



ఆహార ధాన్యాల నిల్వలో పురుగుల బెడదకు సులువుగా చెక్   బియ్యం/మొక్కజొన్నలు ఇతర ఆహార ధాన్యాల నిల్వలో పురుగులు, ఎలుకల బెడద ఎక్కువ. రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు ఇది తెలిసిందే. ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించడానికి కొందరు రసాయనిక బిళ్లలను, పొడులను వాడుతుంటారు. బియ్యం వండుకు తినే ముందు కడిగినా ఈ రసాయనాల దుష్ర్పభావం వినియోగదారుల ఆరోగ్యంపై పడక మానదు.  ఒంటి పట్టు లేదా ముడి బియ్యానికైతే తెల్లబియ్యం కన్నా తొందరగా పురుగు పడుతుంటుంది. ఈ జటిల సమస్యకు బీహార్ రైతులు చక్కని పరిష్కారాన్ని కనుగొన్నారు. సాధారణ అగ్గిపెట్టెలోని పుల్లలను ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలలో కలిపి.. బస్తాల్లో నిల్వ చేస్తే పురుగులు, ఎలుకల బెడద ఉండటం లేదంటున్నారు. క్వింటాలుకు ఒక అగ్గిపెట్టెలోని పుల్లలు కలిపితే చాలట. ముడి బియ్యంలో రెట్టింపు అగ్గిపుల్లలు కలపాల్సి రావచ్చు. బియ్యం వాడుకునేటప్పుడు అగ్గిపుల్లలను సులువుగా ఏరేయవచ్చు. బీహార్ రైతులు అనేక సంవత్సరాలుగా ఈ పద్ధతిని ఉపయోగిస్తూ కలుషితం కాని ఆహారం తింటున్నారని మహారాష్ట్రకు చెందిన కీటక శాస్త్ర నిపుణుడు, స్వతంత్ర శాస్త్రవేత్త డా. అవినాశ్ సోలంకి(094222 35816) ‘సాక్షి’తో చెప్పారు.  అగ్గిపుల్ల మందులో పొటాషియం క్లోరేట్, రెడ్ ఫాస్ఫరస్ క్రిమిసంహారకాలుంటాయి. ఇవి పురుగులను దరిచేరనీయవని ఆయన అన్నారు.

 

మందు బిళ్లతో పండీగకు చెక్!



ఉద్యాన పంటల్లో తీవ్ర సమస్యగా మారిన పండీగ(ఫ్రూట్ ఫ్లై)లను అరికట్టడంలో అగ్గిపెట్టె పరిమాణంలో ఉండే మందు బిళ్ల(ఫ్రూట్ ఫ్లై ల్యూర్ బ్లాక్) అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందంటున్నారు దీని రూపకర్త, మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్త డా. అవినాష్ సోలంకి. దీనిపై కవర్‌ను తొలగించి ఏదైనా డబ్బా లేదా ప్లాస్టిక్ గ్లాస్‌లో ఉంచి తోటలో ఒక చెట్టుకు వేలాడదీయాలి. మరు నిమిషం నుంచే మందు బిళ్లలోని మిథైల్ ఇవోజనల్ అనే రసాయనం వాసనకు పండీగలు మూగి చనిపోతాయని ఆయన చెప్పారు. ఎకరాకు ఒక మందుబిళ్ల  సరిపోతుంది. పెట్టిన దగ్గరి నుంచి 90 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుందని, వర్షానికీ కరగదని అన్నారు డా. సోలంకి. జామ, మామిడిలాంటి అన్ని ఉద్యాన పంటల్లోను దీన్ని వా డిన రైతులు సత్ఫలితాలు పొందారని..  దీన్ని రూ.25కే అందిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు రామస్వామి రాజీవ్(078426 41626 ఇంగ్లిష్ /హిందీ)ని సంప్రదించవచ్చు.

 

జీవన ఎరువుల  తయారీ సులభతరం




జీవన ఎరువుల వినియోగం ద్వారా భూసారాన్ని పెంపొందించుకోవచ్చు. జీవన శిలీంద్ర నాశకాల ద్వారా చీడపీడలను ప్రకృతికి హాని కలగని రీతిలో నివారించవచ్చు. అజోస్పిరిల్లం, ట్రైకోడెర్మా విరిడి వంటి వాటిని మార్కెట్లో కొనుగోలు చేసినప్పుడు స్వచ్ఛత, నాణ్యత కూడా ప్రశ్నార్థకంగా తయారవుతోంది. వీటిని రైతే స్వయంగా, స్వల్ప ఖర్చుతో ఇంటి వద్దే 72 గంటల్లో తయారు చేసుకునే పద్ధతులను, మిత్రపురుగులను పెంపొందించుకోవడాన్ని ఎన్‌ఐపీహెచ్‌ఎం సంస్థ ప్రోత్సహిస్తోంది(రైతుల బృందాలకు ఈ విజ్ఞానాన్ని అందించడానికి ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. 040 24013346). ఈ పద్ధతులను ఎగ్జిబిషన్ స్టాల్స్‌లో ఎన్‌ఐపీహెచ్‌ఎం అసిస్టెంట్ డెరైక్టర్ డా. గిరీష్(89787 78704 ఇంగ్లిష్) వివరించారు.



అయితే, జీవన ఎరువులు, జీవన శిలీంద్ర నాశకాలను తయారు చేసుకునే పద్ధతిని విశ్రాంత ఇక్రిశాట్ శాస్త్రవేత్త థామస్ నికోడెమస్(86861 10762 తెలుగు/ఇంగ్లిష్) సులభతరం చేస్తూ ఫెర్మెంటర్ల(విద్యుత్‌తో నడిచే యంత్రాల)ను రూపొందించారు. గ్రామీణ యువత, రైతులు సైతం సులువుగా ఉపయోగించగలిగేలా వీటిని రూపొందించడం విశేషం. 10 లీటర్ల ఫెర్మెంటర్ ధర రూ. 35 వేలు. 20 లీటర్ల ఫెర్మెంటర్ ధర రూ. 80 వేలు. రైతులు, రైతుల బృందాలే కాకుండా జీవన ఎరువులు, క్రిమిసంహారకాల తయారీని స్వయం ఉపాధి కోసం చేపట్టే వారికీ ఫెర్మెంటర్లు ఎంతగానో ఉపకరిస్తాయని థామస్ అంటున్నారు.

 

రసంపీల్చే పురుగులను  మట్టుబెట్టే ‘సోలార్ లైట్ ట్రాప్’




రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు సోలార్ లైట్ ట్రాప్ రైతులకు అందుబాటులోకి వచ్చింది. దీని రూపకర్త తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీ శాస్త్రవేత్త డా. అబ్దుల్ ఖాదిర్(094885 91915 తెలుగు, ఇంగ్లిష్). దీన్ని పొలంలో నిలబెట్టి.. దీని కింద అమర్చిన బేసిన్‌లో నీళ్లు పోసి.. అందులో ఏదైనా నూనె , షాంపూ లేదా కిరోసిన్‌లను తగు మోతాదులో వేయాలి. ఇందులో అమర్చిన మైక్రోచిప్ వల్ల సాయంత్రం చీకటి పడే వేళకు ఆటోమేటిక్‌గా లైట్ వెలుగుతుంది. రాత్రి పది గంటలు కాగానే దానంతట అదే ఆగిపోతుంది. ఎల్‌ఈడీ లైట్‌ను అమర్చటం వల్ల ఎక్కువ కాంతి వస్తుంది. దీనికి ఆకర్షితమై వచ్చిన శత్రు పురుగులు బేసిన్‌లో ఉన్న నూనె కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి. తద్వారా తక్కువ ఖర్చుతో పంటను కాపాడుకోవచ్చు. సౌరశక్తితో చార్జింగ్ అవుతుంది. అన్ని కూరగాయ, వాణిజ్య, ఉద్యాన పంటల్లోను వాడుకోవటానికివీలుగా దీన్ని తయారు చేశారు. నిర్వహణ కూడా సులభం. పర్యావరణ హితమైనది. ఎకరాకు ఒక లైట్ ట్రాప్ సరిపోతుంది. దీని ధర రూ. 2,500.

 

‘పొదుగువాపు’.. 2 రోజుల్లో పరారీ!




అనంతపురం జిల్లాకు చెందిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత, సంప్రదాయ పశువైద్యుడు బోయ పెద్దరాజన్న తయారు చేసిన పొదుగువాపు వ్యాధిని పారదోలే మూలికల పొడిని పల్లెసృజన సంస్థ   (040-27111959) ప్రదర్శనకు ఉంచింది. ఈ మందును వేడినీటిలో కలిపి రెండు రోజులు పొదుగుకు పట్టిస్తే పొదుగు వాపు పూర్తిగా తగ్గిపోతుందని చెబుతున్నారు. నరాల వ్యాధితో కాళ్లు చచ్చుబడిపోయే (కుందా) వ్యాధి మందు కూడా ఉంది. చిన్న రైతులకు ఉపయోగపడే సోలార్ స్ప్రేయర్ తదితర పరికరాలను సైతం ఈ సంస్థ ప్రదర్శనకు ఉంచింది.

 

మిత్రపురుగులే రైతు సైన్యం!



 రాజు యుద్ధంలో తుది అస్త్రంగా సైన్యాన్ని ప్రయోగిస్తాడు. వ్యవసాయంలో కూడా అంతే.. రైతు పంటను చీడపీడల నుంచి కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలేవీ ఫలించని స్థితిలో ఇక మిగిలింది ప్రకృతిసిద్ధమైన మిత్రపురుగుల సైన్యాన్ని ప్రయోగించడమే.  కొద్ది నెలల క్రితం ‘సాక్షి’ సాగుబడి పేజీలో మా సంస్థ గురించి రాస్తూ ‘మిత్రపురుగులే రైతు సైన్యం’ శీర్షిక నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అధికారులు, రైతులతో సమావేశమైన ప్రతిసారీ ఈ శీర్షికను ప్రస్తావిస్తున్నా.

 - డాక్టర్ కె.సత్యగోపాల్, డెరైక్టర్ జనరల్,

 జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌ఐపీహెచ్‌ఎం),

 రాజేంద్రనగర్, హైదరాబాద

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top