‘సాగర్’ శోకం


* వర్షాభావ పరిస్థితులతో అడుగంటిన నాగార్జునసాగర్ జలాశయం

* కనీస మట్టానికి ఎగువన ఉన్నది ఒక టీఎంసీ మాత్రమే


* ఈ నీటితో హైదరాబాద్‌కు నీరందేది 24 రోజులే

* ఆ తర్వాత శ్రీశైలం నీరే దిక్కు


 

నిండుగా నీటితో కళకళలాడాల్సిన నాగార్జునసాగర్ జలాశయం.. ఈ ఏడాది వరుణుడు ముఖం చాటేయడంతో వట్టిపోయి కనిపిస్తోంది. నీటిమట్టం బాగా తగ్గిపోయి ‘సాగర్’ గర్భం పైకి కనిపిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని కోటి జనాభాకు తాగునీటిని అందించే సాగర్ ఇలా రాళ్లురప్పలు తేలి కనిపిస్తుండటం కలవరానికి గురిచేస్తోంది. సాగర్‌లో కనీస నీటిమట్టానికి ఎగువన కేవలం ఒక టీఎంసీ నీరు మాత్రమే అందుబాటులో ఉండటం, అది కూడా 24 రోజులకు మాత్రమే సరిపోతుందనే అంచనా ఆందోళనను మరింత పెంచుతోంది.    

 - సాక్షి, హైదరాబాద్

 



సాగర్ నుంచి ప్రతి నెలా 1.25 టీఎంసీల నీటిని హైదరాబాద్ జలమండలికి సరఫరా చేయాల్సి ఉంది. సాగర్ పూర్తిస్థాయి మట్టం 590 అడుగులకుగాను.. ప్రస్తుత నిల్వ 510.5 అడుగులకు పడిపోగా, నీటి లభ్యత 132.52 టీఎంసీలకు తగ్గింది. ఇందులో కనీస నీటిమట్టమైన 510 అడుగులపైన లభ్యమయ్యే జలాలు కేవలం ఒక టీఎంసీ మాత్రమే. ఈ నీటితో సుమారు 24 రోజుల పాటు జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేయవచ్చు. సాగర్‌లో గతేడాది ఇదే సమయంలో 515.8 అడుగుల నీటిమట్టంతో 141.73 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దానితో పోలిస్తే ఈసారి 9.21టీఎంసీల లోటు కనబడుతోంది. ఈ నెల అవసరాలకు సాగర్‌లోని ప్రస్తుత లభ్యత నీరు సరిపోయినా.. వచ్చే నెల నుంచి నీటి ఎద్దడి తప్పదు.

 

ఈ నేపథ్యంలో ఆ తర్వాత జంట నగరాలకు శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీశైలం నుంచి 8టీఎంసీల మేర నీటిని సాగర్‌కు విడుదల చేసినా అందులో 4 టీఎంసీల మేర కృష్ణాడెల్టాకే ఇవ్వాలి. మరో 4 టీఎంసీల్లో నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండల తాగునీటికి 2 టీఎంసీలు కేటాయిస్తే మిగిలేవి మరో రెండు టీఎంసీలు. ఈ నీటితోపాటు సాగర్‌లో లభ్యతగా ఉన్న నీటితో సెప్టెంబర్ వరకు హైదరాబాద్ తాగు అవసరాలను తీర్చవచ్చు. ఆ తర్వాత కూడా వర్షాలు లేక ప్రాజెక్టులోకి నీరు చేరకుంటే కష్టమే. అయితే ప్రత్యామ్నాయ చర్యలేవీ కూడా అంత సులభమైనవి కాకపోవడంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందనేదానిపై చర్చ జరుగుతోంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top