నేరెళ్ల ఘటనపై కేసీఆర్‌ నోరువిప్పాలి | Sakshi
Sakshi News home page

నేరెళ్ల ఘటనపై కేసీఆర్‌ నోరువిప్పాలి

Published Fri, Jul 28 2017 3:34 AM

నేరెళ్ల ఘటనపై కేసీఆర్‌ నోరువిప్పాలి - Sakshi

- దాడులకు నిరసనగా 31న ‘చలో సిరిసిల్ల’ సభ
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌
 
వరంగల్‌: సిరిసిల్లలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలపై థర్డ్‌ డిగ్రీ ఘటనను హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. హన్మకొండలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సిరిసిల్లలో ఇంత దారుణం జరుగుతున్నా.. సీఎం కేసీఆర్‌ ఎందుకు నోరు విప్పడం లేదని, ఈ సంఘటనపై ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం పేషీలో అజమాయిషీ చెలాయిస్తున్న సంతోశ్‌రావు రాష్ట్రంలో ఇసుక మాఫియాను నడిపిస్తున్నారని ఆరోపించారు. ఆయన నేతృత్వంలో ‘గోల్డ్‌ మైన్స్‌ మినరల్స్‌ లిమిటెడ్‌’ పేరుతో ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నారని, ఈ క్వారీ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నడుస్తోందన్నారు.

హైకోర్టు జడ్జితో విచారణ జరిపించి దళిత, గిరిజనులను అమానుషంగా చిత్రహింసల పాలు జేసిన పోలీసు అధికారులు, సంస్థ యజమానిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసును పార్టీ సీరియస్‌గా తీసుకుందన్నారు. విలేకరుల సమావేశంలో గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస రావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజనాల శ్రీహరి, డీసీసీబీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, నాయకులు గుండె విజయరామారావు, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, పీసీసీ కార్యదర్ళులు బక్క జడ్సన్, నమిండ్ల శ్రీను, ఈవీ. శ్రీనివాసరావు, బట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 
 
31న నిరసన సభ..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో దళిత, గిరిజన, బలహీన వర్గాలపై చేయిస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ ఈనెల 31వ తేదీన సిరిసిల్లలో ‘చలో సిరిసిల్ల’ పేరిట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు.  

Advertisement
Advertisement