అభివృద్ధే లక్ష్యంగా.. | Sakshi
Sakshi News home page

అభివృద్ధే లక్ష్యంగా..

Published Tue, Jan 27 2015 1:27 AM

Telangana state development goal

 నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని..బంగారు తెలంగాణకు బాటలు వేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. 66వ గణతంత్ర దిన వేడుకలు జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రంలో అభ్యుదయం వైపు పయినిస్తామని..అభివృద్ధి సాధిస్తామని అన్ని రకాలుగా బాగుపడుతామని తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో పురోగమింపచేయడానికి అవసరమయ్యే పథకాలను, ప్రణాళికలను రూపొందించి అమలు చేయడం జరుగుతోందని వివరించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఈ సందర్భంగా జోహార్లు అర్పించారు.  సందర్భంగా సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు.
 
 వ్యవసాయం
 పంట రుణాల మాఫీ పథకం కింద జిల్లాకు రూ.634 కోట్లు విడుదల చేయగా ఇప్పటి వరకు 4 లక్షల 74వేల రైతుల ఖాతాలకు రూ.561 కోట్లు జమ చేశారని తెలిపారు. 2009 నుంచి 2014 వరకు వడగండ్ల వాన, అతివృష్టి, అనావృష్టి, కరువు, తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.65 కోట్లు లక్షా 53వేలు వారివారి ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ చెప్పారు. ఖరీఫ్, రబీ సీజనల్లో పంట రుణాల కింద రైతులకు రూ.1752 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.1995 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఖరీఫ్‌లో 60 వేల 495 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.85 కోట్లతో కొనుగోలు చేసి రైతులకు ఆమొత్తాన్ని చెల్లించి మద్ధతు ధర కల్పించామని చెప్పారు.
 
 మిషన్ కాకతీయ
 రాష్ట్ర ప్రభుత్వం చెరువులు సంరక్షణ, పునరుద్ధర ణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది 952 చెరువులనను మరమ్మతు చేయనున్నారని వివరించారు. ఇప్పటి వరకు 472 చెరువులకు రూ.275 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు తయారు చేసి పరిపాలనా ఆమోదానికి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
 
 వాటర్‌గ్రిడ్
 వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.25 వేల కోట్లతో తెలంగాణలోని ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వాటర్ గ్రిడ్ పథకాన్ని రాష్ట్రంలో మన జిల్లాలోని చౌటుప్పుల్ గ్రామంలో త్వరలో సీఎం కేసీఆర్  చేతుల మీదు గా పైలాన్ ఆవిష్కరణ చేయనున్నట్లు పేర్కొన్నారు.
 
 నక్కల గండి
 జిల్లా ప్రజల దాహార్తి తీర్చడంతోపాటు, ఫ్లోరైడ్ నివారణకు 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.6,500 కోట్లతో నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణం అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.
 
 విద్యుత్
 రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు తీర్చడమేగాక, మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు గతేడాది డిసెంబర్ 23 తేదీన ఏరియల్ సర్వే నిర్వహించి 6,800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు రూపకల్పన చేశారని తెలిపారు. ఇప్పటికే 10,700 ఎకరాల్లో భూ సేకరణ సర్వే పూర్తి చేసుకుని అటవీ భూములను అటవీయేతర భూములుగా మార్చేందుకు గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు.
 
 నిమ్స్‌కు బదులు ఎయిమ్స్
 బీబీనగర్ మండలం రంగాపురంలో నిర్మాణ దశలో ఉన్న ని మ్స్‌ను సీఎం కేసీఆర్ ఇటీవల సందర్శించారని, రాష్ట్రానికే తలమానికంగా నిలిచే విధ ంగా ఎయిమ్స్‌గా మార్చుటకు, హెల్త్ హబ్ ఏర్పాటు చేయాలనే కీలక నిర్ణయాన్ని ప్రకటించినందుకు జిల్లా ప్రజల తరపున సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
 
 మరో తిరుపతిగా.. యాదగిరిగుట్ట
 యాదగిరిగుట్టను ఆధ్యాత్మిక కేంద్రంగా అన్ని హంగులతో అభివృద్ధి పర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, దీనిలో భాగంగా రూ.750 కో ట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇప్పటికే మంజూరు చేసిన రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
 
  అదే విధంగా తెలంగాణకు హరితహారం, ఉద్యానవనశాఖ, ఆసరా పింఛన్లు, ఎస్సీ మహిళలకు 3 ఎకరాల భూ పంపిణీ, ఆహార భద్రత కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం, రోడ్ల మరమ్మతులు, తదితర పథకాల అమలును వివరించారు. రాచకొండతోపాటు జిల్లా గ్రామీణాభివృద్ధి, పురపాలన పురోగతి, ఇతర సంక్షేమ పథకాల అమలకు కృషి చేస్తున్న అధికారులను ఆయన అభినందించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎల్లవేళలా కృషి చేస్తూ, జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలలో పోలీస్ యంత్రాంగం సహాయ, సహకారాలందించడంతోపాటు, వాటిల్లో పాలుపంచుకుంటున్న వారందరికి కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్, ఎస్పీ టి.ప్రభాకర్‌రావు, నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ, జేసీ సత్యనారాయణ, ఏజేసీ వెంకట్రావు, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డీఆర్వో నిరంజన్, డీఆర్‌డీఏ పీడీ చిర్రా సుధాకర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement