రూ.30వేల వరకు వెంటనే మాఫీ | Sakshi
Sakshi News home page

రూ.30వేల వరకు వెంటనే మాఫీ

Published Thu, Aug 28 2014 2:10 AM

రూ.30వేల వరకు వెంటనే మాఫీ - Sakshi

సాక్షి, హైదరాబాద్: రైతుల రుణ మాఫీపై తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ విషయంలో ఆర్‌బీఐ నుంచి అరకొర సాయమే అందుతున్న నేపథ్యంలో సర్దుబాట్లు చేసుకుంటూ రుణమాఫీని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అర్హులకే రుణ మాఫీ జరిగేలా చూసేందుకు ఒకవైపు సామాజిక తనిఖీలు చేపడుతూనే.. చిన్న మొత్తం రుణాలను వెంటనే పూర్తిగా చెల్లించాలని, పెద్ద రుణాల విషయంలో హామీ పత్రాలివ్వాలని సర్కారు భావిస్తోంది.

రుణమాఫీ చేసే మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని కూడా యోచిస్తోంది. ఒకవేళ రైతులకు చెక్కులిస్తే వాటిని వినియోగించుకుని బ్యాంకులకు చెల్లించకుండా ఉండే అవకాశముందని, అలాగైతే వారికి కొత్త రుణాలు మంజూరు కావని ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే మాఫీ మొత్తాన్ని  రైతుల ఖాతాలో జమచేస్తే ఆ నిధులను బ్యాంకు లు తీసుకుని కొత్త రుణాలిస్తాయిని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సరాసరి రూ. 58 వేలలోపు ఉన్నట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది.

దీంతో రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉన్న రుణాలను వెంటనే మాఫీ చేయడం వల్ల వాటిని తీసుకున్న చిన్న, సన్నకారు రైతులకు తక్షణ  ప్రయోజనం కలుగుతుందని విశ్లేషించుకుంది. వారికి కొత్త రుణాలు అందడం వల్ల ఈ ఏడాది పెట్టుబడికి ఇబ్బంది ఉండదని భావిస్తోంది. ఇక ఎక్కువ మొత్తం రుణాలున్న రైతులు ఆ రుణా న్ని బ్యాంకులకు చెల్లించి ఎన్‌వోసీ తీసుకుని వస్తే.. వారికి తిరిగి వడ్డీతో సహా చెల్లించేలా హామీ పత్రాన్నివ్వాలన్న ఆలోచన చేస్తోంది. రుణమాఫీకి చెల్లించే డబ్బును బడ్జెట్‌లోనూ పెట్టనుంది.

Advertisement
Advertisement