
తలసాని డుమ్మా.. అందుకేనా?
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 'కారు' ఎక్కేందుకు దాదాపు సిద్దమయినట్టు తెలుస్తోంది.
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 'కారు' ఎక్కేందుకు దాదాపు సిద్దమయినట్టు తెలుస్తోంది. గులాబీ కండువా కప్పుకునేందుకు ఆయన రెడీ అవుతున్నారు. సొంత పార్టీతో ఆయన అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. తెలంగాణ శాససభ టీడీపీ శాసనసభపక్ష నాయకుడి పదవి ఆశించి భంగపడిన ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
తాజాగా శనివారం జరిగిన టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ విస్తృతస్థాయి సమావేశానికి తలసాని డుమ్మా కొట్టారు. జీహెచ్ఎంజీ పరిధిలోని 24 నియోజకవర్గాలకు చెందిన నాయకులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరైన ఈ కీలక సమావేశానికి తలసాని మాత్రం రాలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అవలంభించిన వ్యూహాంపై చర్చిచేందుకు నిర్వహించిన ఈ సమావేశానికి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తలసాని హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
టీఆర్ఎస్ లో చేరడానికే టీడీపీకి ఆయన దూరం జరుగుతున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇటీవల జరిగిన పరిణామాలు ఈ ఊహాగానాలకు బలమిచ్చాయి. టీఆర్ఎస్ చేరడానికి మంచి ముహూర్తం కోసమే తలసాని చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే తలసాని గురించి తెలిసిన ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. గతంలోనూ పార్టీలో తన మాట నెగ్గనప్పుడు ఇలాంటి వ్యూహాన్నే తలసాని అమలు చేశారు. టీడీపీని వదిలిపెట్టేస్తున్నాంటూ సిగ్నల్ ఇచ్చారు. చివరకు తస్సుమనిపించారు. మరి ఇప్పుడేం చేస్తారో చూడాలి.