కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కానరాని ఐక్యత | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కానరాని ఐక్యత

Published Sat, Jul 26 2014 12:58 AM

కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కానరాని ఐక్యత - Sakshi

జిల్లా సమావేశంగా పేర్కొన్నా నియోజకవర్గానికే పరిమితం   
టీపీసీసీ చీఫ్ పొన్నాల పర్యటన తుస్

 
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్‌లో ఐక్యత ఏపాటిదో శుక్రవారం నాటి సమావేశంతో తేలిపోయింది. జిల్లాస్థాయిలో ముఖ్య కార్యకర్తల సమావేశమని ప్రకటించినా, అది చివరకు నియోజకవర్గానికే పరిమితమైంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీసీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇలా.. ముఖ్య నేతలంతా పాల్గొన్న ఈ సమావేశం కాంగ్రెస్ శ్రేణులను నిరాశ పరిచింది. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, చైర్‌పర్సన్లు, పార్టీకి సంబంధించి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇలా.. అంతా హాజరుకావాలని జిల్లా అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి ముందే ప్రకటిం చారు.
 
కాగా, జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న వీరెవరూ ఈ సమావేశానికి హాజ రుకాలేదు. కేవలం కోదాడ నియోజకవర్గానికి చెందిన వారే హాజరుకావడంతో వారికి సన్మానాలు చేసి సరిపుచ్చారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్, జిల్లాలో చెప్పుకోదగిన రీతిలోనే ఉనికిని చాటుకుంది. ఒక ఎంపీ సహా  ఐదు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటుకుంది. అయినా, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలువురు సీనియర్లు సైతం పార్టీని వీడి టీఆర్‌ఎస్ వైపు వెళ్లిపోయారు. ఇక, కిందిస్థాయిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు ఇప్పటికే కండువాలు మార్చేశారు. మరింత మంది పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ నాయకత్వమే చెబుతోంది.
 
ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంతో ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. అయినా, మెజారిటీ నాయకులు ఆ వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో వారి అనుచరగణం, వారివారి నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల పదవుల్లో ఉన్న వారెవరూ హాజరుకాలేదు. దీంతో కాంగ్రెస్ సమావేశం నిరాశపరిచింది. జిల్లా స్థాయిలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని అందరికీ సౌలభ్యంగా, అందుబాటులో ఉండే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయకుండా జిల్లా సరిహద్దులోని కోదాడలో ఏర్పాటు చేయడంతోనే తప్పుడు సంకేతాలు పంపారన్న అభిప్రాయం వ్యక్తమైంది.  సమావేశం కూడా కేవలం ఉత్తమ్ దంపతుల ఆధిపత్యాన్ని చూపెట్టుకునేందుకే కోదాడలో ఏర్పాటు చేశారని, ఇతర నేతలు  భావించడం వల్లే ఎవరూ హాజరు కాలేదని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వాపోయారు.
 
సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, నల్లగొండ ఇలా.. ఏ నియోజకవర్గం నుంచీ కార్యకర్తలు కానీ, నాయకులు గానీ వెళ్లలేదు. టీసీఎల్పీ నేత జానారెడ్డికి అనుచరులుగా ఉన్న జెడ్పీ చైర్మన్ బాలునాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్‌రావు, డీసీసీబీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి మాత్రమే బయటి నుంచి వెళ్లిన నాయకులు కావడం గమనార్హం. జిల్లా కాంగ్రెస్‌లో ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నాయని, పార్టీ ఏకతాటిపై లేదని చెప్పడానికి ఈ సమావేశం ఒక ఉదాహరణగా నిలుస్తుందని పార్టీలోని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
 
అధికారం కోల్పోయి, ప్రతిపక్షపాత్రకు పరిమితమైన ఈ తరుణంలో కూడా ఆధిపత్య రాజకీయాలనే నమ్ముకుంటే పార్టీ పరిస్థితి మరింతగా దిగ జారుతుందన్న అభిప్రాయాన్ని ఆ నేత వ్యక్తం చేశారు.  ఇక, ఎన్నికల్లో ఓటమి, పార్టీ పరిస్థితిపై ఏ మాత్రం సమీక్ష జరగలేదు. కేవలం కోదాడ ప్రాంతానికి చెందిన స్థానిక సంస్థల్లో నెగ్గిన ప్రజాప్రతినిధులకు సన్మానాలతో సమావేశాన్ని సరిపెట్టారన్న అభిప్రాయం బలంగా వ్యక్తమైంది.

Advertisement
Advertisement