సాంఘికశాస్త్రంలో భారీ మార్పులు | Sakshi
Sakshi News home page

సాంఘికశాస్త్రంలో భారీ మార్పులు

Published Wed, Oct 8 2014 3:02 AM

Huge changes to be made in Social studies over Telangana state

తెలంగాణ చరిత్ర, సాయుధ, ప్రత్యేక ఉద్యమానికి ప్రాధాన్యం
1 నుంచి పదో తరగతిలో మార్పులు

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకున్న సాంఘిక శాస్త్రం, తెలుగు పాఠ్య పుస్తకాల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందుకు విద్యాశాఖతోపాటు ప్రభుత్వం నియమించిన కమిటీలు కసరత్తు ప్రారంభించనున్నాయి. బుధవారం నుంచే ఈ కమిటీలు సమావేశం కాబోతున్నాయి. పాఠ్య పుస్తకాల్లో తీసుకు రావాల్సిన మార్పులపై ఈ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా పదో తరగతి వరకున్న సాంఘిక శాస్త్రం పుస్తకాల్లో పెద్దఎత్తున మార్పులు అవసరమౌతాయని విద్యాశాఖ భావిస్తోంది.
 
 ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర పటాలు, చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, సహజ సంపద, రాజకీయ పార్టీలు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నిజాం పాలన, ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రం, రాజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, పోరాటాలు, విద్యార్థుల బలిదానాల నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు పాఠ్యాంశాలను పొందుపరిచే కసరత్తు జరుగుతోంది. ఇక తెలుగు భాషా పుస్తకాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు- వాటి విశేషాలు, తెలంగాణ కవులు, రచయితల చరిత్రకు స్థానం కల్పించనున్నారు. ఈ మేరకు కమిటీలు పాఠ్య పుస్తకాల్లో చేయాల్సిన మార్పులపై ప్రణాళికలు రూపొందించుకున్నాయి. బుధవారం నుంచి మూడ్రోజుల పాటు జరిగే సమావేశాల్లో వీటిపై చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్ర గేయంపైనా చర్చించనున్నారు. అయితే రాష్ట్ర గేయంపై తుది నిర్ణయం ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగాకే ప్రకటించనున్నారు.
 
 ప్రధాన మార్పులు ఇవీ..
 రాష్ట్ర పటాలు: వివిధ తరగతుల్లో ఆంధ్రప్రదేశ్ చిత్ర పటాలు ఉన్న చోట తెలంగాణ చిత్రం పటాలు పొందుపరచడం. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర ఉన్న చోట తెలంగాణ సమగ్ర చరిత్రను వివరించడం. భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్‌ను, తెలంగాణను వేరుగా చూపడం.
 భౌగోళిక పరిస్థితులు: తెలంగాణ భౌగోళిక పరిస్థితులు ఏంటి? పొరుగున ఏయే రాష్ట్రాలున్నాయి, వాటితో సంబంధాలపైనా పాఠ్యాంశాలను పొందుపరచనున్నారు.
 నీటి వనరులు: ఏమేం నీటి వనరులున్నాయి.. నదులు, ఉపనదులు, చెరువులు, పంటలకు ప్రధాన సాగునీటి వనరులు ఏంటి? ఒకప్పటి చెరువుల స్థితిగతులు తదితర అంశాలపై పాఠ్యాంశాలను పొందుపరిచే అవకాశం ఉంది.
 నేలలు, పంటలు: రాష్ట్రంలోని నేలలు, వాటి రకాలు, ఎక్కువ గా పండించే పంటలు. వర్షాల స్థితిగతులపై పాఠ్యాంశాలను చేర్చుతారు.
 అడవులు, సహజ సంపద: తెలంగాణలో అడవుల విస్తీర్ణం, లభించే ఖనిజాలు, వాటి ప్రత్యేకతలు, ముఖ్యంగా బొగ్గు నిల్వలు-దాని ఉపయోగాలపై పాఠ్యాంశాలు.
 జీవన స్థితి గతులు: తెలంగాణలో ప్రజల జీవన స్థితిగతులు, జీవన విధానాలపైనా పాఠాలు.
 తెలంగాణ వైతాళికులు: ప్రొఫెసర్ జయశంకర్, చాకలి ఐలమ్మ, కొమురం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితచరిత్రలు, తెలంగాణ కోసం వారి కృషిపైనా పాఠాలు పొందుపరచనున్నారు.
 తెలంగాణ ఉద్యమం.. తీరు తెన్నులు: తెలంగాణ సమగ్ర చరిత్రపై ప్రత్యేకంగా పాఠాలు ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీల పాత్ర, అవి అనుసరించిన వైఖరులు, ఏ ప్రభుత్వాల కాలంలో ఏం జరిగింది.
 
 ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయా పార్టీల విధానాలపైనా పాఠాలుంటాయి. ఉద్యమ నేపథ్యంలో అన్ని పార్టీలతోపాటు తెలంగాణ సాధించిన టీఆర్‌ఎస్ వరకు అన్నింటినీ పొందుపరచనున్నారు. 1969 నాటి ఉద్యమం, విద్యార్థుల బలిదానాలపై ప్రత్యేకంగా పాఠ్యాంశాలను చేర్చనున్నారు.
 తెలంగాణ రచయితలు, కవులు: తెలంగాణ కవులు, కళాకారులు, వారి రచనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నన్నయ, తిక్కన వంటి వారు రచించిన పాఠాలు అలాగే ఉంచే అవకాశం ఉంది. వారిని ప్రాంతాలతో ముడిపెట్టే అవకాశం లేదు. అయితే తెలంగాణలోని రచయితలకు అధిక ప్రాధాన్యం కల్పించనున్నారు. ఇన్నాళ్లు తెలంగాణలో మాండలికాలు, యాస, పండుగలు, సంస్కృతీ సంప్రదాయాలపై సమైక్య రాష్ట్రంలో జరిగిన సాంస్కృతిక దాడిని ప్రస్తావించనున్నారు. తెలంగాణ పండుగలకు ప్రాధాన్యం ఇచ్చి ఆ మేరకు మార్పులు చేయనున్నారు. ముఖ్యంగా బతుకమ్మ, దసరా వంటి పండుగల ప్రాధాన్యం, విశిష్టతలపై పాఠాలుంటాయి.

Advertisement
Advertisement