ఏమార్చి... బ్యాగులు మార్చి! | Sakshi
Sakshi News home page

ఏమార్చి... బ్యాగులు మార్చి!

Published Sat, Nov 1 2014 12:32 AM

... Bags to change often!

  • నాలుగు ల్యాప్‌టాప్‌ల అపహరణ
  •  ప్రయాణికులే లక్ష్యంగా దొంగల హల్‌చల్
  • లంగర్‌హౌస్: నగరంలో హైటెక్ దొంగలు హల్‌చల్ చేశారు. పన్నెండు గంటల పాటు బస్సుల్లో ప్రయాణికులే లక్ష్యంగా చెలరేగారు. చైన్‌లింక్ పద్ధతిలో నాలుగు ల్యాప్‌టాప్‌లు, భారీ ఎత్తున నగదును చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరారు. తోటి ప్రయాణికుల్లా బస్సెక్కి దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ ఘటనలు గురువారం చోటుచేసుకున్నాయి. బాధితులంతా గగ్గోలు పెడుతూ శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. సినీ ఫక్కీలో జరిగిన చోరీల వివరాలు ఇవీ...
     
    సీన్1: గురువారం ఉదయం పది గంటలు... జూబ్లీ బస్ స్టేషన్‌లో వెంకటసాయి అనే వ్యక్తి మేడ్చల్ వైపు వెళ్లే బస్సు ఎక్కాడు.  అదే బస్సులో తోటి ప్రయాణికుడిలా ఎక్కాడో దుండగుడు. వెంకటసాయి ఆదరమచి ఉన్న సమయంలో ల్యాప్‌టాప్ బ్యాగును అపహరించాడు. అనుమానం రాకుండా ఖాళీ బ్యాగును ఉంచి, దర్జాగా బస్సుదిగి వెళ్లిపోయాడు. సాయి బస్సుదిగే సమయంలో ల్యాప్‌టాప్ చోరీకి గురైందని గుర్తించాడు. బ్యాగులో 3వేల నగదు కూడా ఉన్నట్టు పోలీసులకు తెలిపాడు.
     
    సీన్ 2: సాయంత్రం ఆరుగంటలు. జూబ్లీ బస్ స్టేషన్‌లో సుబ్రహ్మణ్యేశ్వర్ కరీంనగర్ వెళ్లే బస్సు ఎక్కాడు. అదే బస్సులోకి ల్యాప్‌టాప్ బ్యాగుతో ఎక్కాడో వ్యక్తి. అనుమానం రాకుండా సుబ్రహ్మణ్యేశ్వర్ బ్యాగును తస్కరించి మాయమ్యాడు. ఉదయం చోరీచేసిన వెంకటసాయి బ్యాగును ఇక్కడ ఉంచాడు.
     
    సీన్ 3: లంగర్‌హౌస్ సాలార్జంగ్ కాలనీకి చెందిన అజీమ్(25) ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగానికి పిలుపు రావడంతో గురువారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బెంగళూరుకు బయల్దేరాడు. గుడిమల్కాపూర్ వద్ద ఉన్న లక్ష్మీనగర్ చౌరస్తా పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెంబర్ 52 వద్ద బస్సు ఎక్కాడు. అదే బస్సులో దుండగులు ప్రయాణికుల్లా ఎక్కారు.   అజీమ్ తన టికెట్‌ను డ్రైవర్‌కి చూపించి వచ్చేలోగా అతని బ్యాగును దొంగిలించారు. ఆ స్థానంలో సుబ్రహ్మణ్యేశ్వర్ బ్యాగును ఉంచారు. ల్యాప్‌టాప్ కోసం పైనుంచి బ్యాగ్ తీయగా...ఖాళీగా కనిపించింది. దీంతో అవాక్కయిన అజీమ్ శుక్రవారం ఉదయం లంగర్‌హౌస్ పోలీసులను ఆశ్రయించాడు.
     
    సీన్ 4: రాత్రి పది గంటలు... ఎంజీబీఎస్‌లో శ్రీనాథ్‌రెడ్డి అనే ప్రయాణిడు విజయవాడ వెళ్లే బస్సు ఎక్కాడు. అతని ల్యాప్‌టాప్ బ్యాగు అపహరణకు గురైంది. విజయవాడ వెళ్లాక చూసుకుంటే ఖాళీ బ్యాగు కనిపించింది. అందులో అజీమ్‌కు సంబంధించిన వివరాలు ఉన్నాయి. బ్యాగులు తారుమారయ్యాయనుకుని శుక్రవారం ఉదయం అజీమ్‌కు ఫోన్ చేశాడు. ఇద్దరూ మాట్లాడుకున్నాక విషయం అర్థమైంది. తమ ల్యాప్‌టాప్‌లను ఒకే ముఠా చోరీ చేసిందని వారు గుర్తించారు. ఫోన్ వచ్చే సమయంలో అజీమ్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నాడు.
     
    బ్యాగులన్నీ డెల్ కంపెనీవి కావడంతో బాధితులు సకాలంలో పసిగట్టలేకపోయారు. అజీమ్ ఫిర్యాదు మేరకు లంగర్‌హౌస్ ఇన్‌స్పెక్టర్ ఎంఏ జావెద్ విచారణ చేపట్టగా... చైన్‌లింక్ దోపిడీ వ్యవహారం వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement