5 లక్షల ఎకరాల్లో ఎండుతున్న పంటలు | Sakshi
Sakshi News home page

5 లక్షల ఎకరాల్లో ఎండుతున్న పంటలు

Published Thu, Aug 25 2016 1:26 AM

5 లక్షల ఎకరాల్లో ఎండుతున్న పంటలు - Sakshi

- ఐదు జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరం
- రాష్ర్ట వ్యవసాయ శాఖ వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన వర్షాభావం కారణంగా రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 4.96 లక్షల ఎకరాల్లోని మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, వరి, పెసర, కంది, జొన్న పంటలు ఎండిపోతున్నాయంది.15 రోజులుగా వర్షాలు కనుమరుగు కావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీంతో జిల్లా వ్యవసాయాధికారుల నేతృత్వంలో కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే), తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, స్థానిక అధికారులతో కలసి సంయుక్త బృందాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించాలని సూచించింది. గడ్డు పరిస్థితుల్లో రైతులకు అవసరమైన సలహాలు ఇచ్చి పంటలను ఆదుకోవాలంది.

 జూన్‌లో మురిపించి... ఆగస్టులో ఏడిపించి..
 ఖరీఫ్ ప్రారంభమైన జూన్‌లో వర్షాలు మురిపించాయి. జూన్‌లో సాధారణ వర్షపాతం 127.6 మిల్లీమీటర్లు కాగా... 190.9 ఎంఎంలు కురిసింది. అయితే ఆగస్టులో ఇప్పటివరకు 171.4 ఎంఎంలు కురవాల్సి ఉండగా... కేవలం 58 మిల్లీమీటర్లే పడింది. మొత్తంగా ఈ మూడు నెలల కాలంలో మెదక్, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో లోటు, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

 52 శాతానికి మించని వరి నాట్లు...
 రాష్ట్రంలో 81 శాతం విస్తీర్ణంలో అన్ని రకాల పంటల సాగు జరిగింది. 1.07 కోట్ల ఎకరాల్లో సాధారణంగా పంటల సాగు జరగాల్సి ఉండగా... ఇప్పటివరకు 86.54 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో ఆహారధాన్యాల సాగు 48.11 లక్షల ఎకరాల్లో కావాల్సి ఉండగా... ఇప్పటివరకు 43.54 లక్షల ఎకరాల్లో (90%) సాగయ్యింది. అందులో వరి సాధారణ విస్తీర్ణం 24.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 12.62 లక్షల ఎకరాల్లో (52%) మాత్రమే నాట్లు పడ్డాయి. వర్షాలు లేకపోవడం.. భూగర్భ జలాలు పెరగకపోవడం, జలాశయాల్లోకి నీళ్లు రాకపోవడంతో నాట్లు పడడంలేదని తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు మాత్రమే నాట్లకు అనుకూలమని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో పప్పుధాన్యాలు, మొక్కజొన్న సహా కొన్ని పంటలు మాత్రమే సాధారణం కంటే అధికంగా సాగయ్యాయి.

Advertisement
Advertisement