కారెక్కిన తమ్ముళ్లు | Sakshi
Sakshi News home page

కారెక్కిన తమ్ముళ్లు

Published Fri, Oct 10 2014 1:26 AM

కారెక్కిన తమ్ముళ్లు - Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ
 టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటన
 తెలంగాణకు కరెంటు రాకుండా బాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డ తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి
 బాబు దిద్దుబాటు చర్యలు.. ఎమ్మెల్యేలతో చర్చలు, తాయిలాలు
 ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, ధర్మారెడ్డి వెనక్కు?
 టీడీపీ శిబిరం పూర్తిగా ఖాళీ చేయించాలనే లక్ష్యంతో గులాబీ నేతల ఎత్తుగడలు
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలు గులాబీ గూటికి చేరుతున్నారు. ఒకేరోజు నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. దీంతో కేసీఆర్‌ను కలిసొచ్చినవారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు తాము టీఆర్‌ఎస్‌లో చేరబోవడం లేదని ప్రకటించారు. కానీ ఆ ఇద్దరి వలస తథ్యమనే టీఆర్‌ఎస్, టీడీపీ వర్గాల సమాచారం. దీనికితోడు మరికొందరు ఎమ్మెల్యేలతోనూ టీఆర్‌ఎస్ నేతలు సంప్రదింపుల్లో ఉన్నారు. త్వరలోనే భారీ స్థాయిలో ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని, ఫలితంగా తెలంగాణలో టీడీపీ బలం గణనీయంగా తగ్గిపోతుందని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ శిబిరం పూర్తిగా ఖాళీ కావాలనే లక్ష్యంతో కేసీఆర్ పావులు కదుపుతున్నారని, త్వరలోనే మరికొందరు టీడీపీ సీనియర్లు కూడా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని చెబుతున్నారు.
 
 సీఎంతో గంటకుపైగా చర్చలు: టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, బి.ప్రకాశ్‌గౌడ్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్.. సీఎం కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో గురువారం ఉదయం కలసి గంటకు పైగా చర్చించారు. అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, వి.గంగాధర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ వీలైనంత త్వరలోనే బహిరంగ సభ ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో సమర్థులైన నాయకులే లేనట్టుగా లోకేష్‌బాబుకు తెలంగాణ పార్టీ బాధ్యతలను అప్పగించారని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి బస్సు యాత్రలు చేయాలని చంద్రబాబు చెప్పడం తమకు నచ్చలేదన్నారు. తెలంగాణకు కరెంటు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. కృష్ణపట్నంలో కరెంటు ఉత్పత్తిని 15 రోజుల కిందటే ప్రారంభించాల్సి ఉన్నా... ఎందుకు మొదలుపెట్టలేదని ప్రశ్నిం చారు. ఒక విజన్‌తో పనిచేస్తున్న కేసీఆర్‌కు అండగా ఉండటం తెలంగాణ బిడ్డలుగా తమ బాధ్యత అని టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టుగా తీగల కృష్ణారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, ప్రకాశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడలేదు.
 
 గ్రేటర్‌లో పెద్ద దెబ్బే
 
 తలసాని, కృష్ణారెడ్డి పార్టీ విడిచిపెట్టడం టీడీపీకి గ్రేటర్ పరిధిలో పెద్ద దెబ్బేనని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. వీరి వెంట పార్టీ శ్రేణులు భారీగా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికితోడు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తలసాని, తీగల బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవల తీగల కృష్ణారెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌తో ఓ హోటల్‌లో రహస్యంగా సమావేశమైన టీడీపీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), కృష్ణారావు (కూకట్‌పల్లి), అరికపూడి గాంధీ (శేరిలింగంపల్లి) గురువారం కేసీఆర్‌ను కలవకపోయినా, వీరు కూడా పార్టీని వీడేందుకే సిద్ధమైనట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్న కేసీఆర్ అన్ని వర్గాల, ప్రాంతాల ఓట్లు కొల్లగొట్టే వ్యూహంతో వీరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అరికెపూడి గాంధీ ద్వారా సెటిలర్లు కూడా టీఆర్‌ఎస్ వెంట ఉన్నారన్న సమాచారాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు తుమ్మల నాగేశ్వర్‌రావు ద్వారా చక్రం తిప్పినట్లు సమాచారం.
 
 ఆపరేషన్ వాష్‌అవుట్!
 
 టీడీపీని క్షేత్రస్థాయి నుంచి బలహీనపరచడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలపై దృష్టి సారించారు. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో టీడీపీకి ఇప్పటికే ప్రాతినిథ్యం లేదు. వరంగల్‌లో ఎర్రబెల్లి దయాకర్ రావు, ధర్మారెడ్డి మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరిద్దరినీ టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవాలని భావించినా... ఎర్రబెల్లి విషయంలో జిల్లా నేతలు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ధర్మారెడ్డిని తీసుకోవాలని యోచించారు. చంద్రబాబు వ్యూహంతో ధర్మారెడ్డి వెనక్కు తగ్గినా... అది తాత్కాలికమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మంలో టీడీపీ 80 శాతం ఖాళీ కాగా, నల్లగొండలో కూడా ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. మహబూబ్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి (కొడంగల్) టీడీపీకి అండగా నిలవగా, రాజేందర్‌రెడ్డి (నారాయణపేట)ని టీఆర్‌ఎస్‌లో చేర్చే యత్నాలు సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా(రూరల్)లో ఇప్పటికే టీడీపీ ఉనికి కోల్పో గా, అర్బన్ పరిధిలో ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయం కాగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నపై కూడా టీఆర్‌ఎస్ ఆశ పెట్టుకుంది.
 
 ఆ ఇద్దరు ఎందుకు తగ్గారు..?
 
 కేసీఆర్‌ను కలిసిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల్లో సాయంత్రానికల్లా ఇద్దరు వెనక్కు తగ్గడం వెనుక కారణాలపై రెండు పార్టీల్లోనూ చర్చ మొదలైంది. టీఆర్‌ఎస్‌లో చేరడం వల్ల ఒనగూరే ప్రయోజనాల విషయంలో స్పష్టత లేకపోవడం... భవిష్యత్తుపై చంద్రబాబు ఇచ్చిన హామీలతో టీడీపీలో కొనసాగాలని తాత్కాలికంగా భావించినట్లు తెలుస్తోంది. తనను కలిసినప్పుడు తలసాని, తీగల కృష్ణారెడ్డిలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని హామీలు ఇచ్చినట్లు సమాచారం. తలసాని కుమారుడిని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా ముందుకు తీసుకురావడం, తీగలకు హెచ్‌ఎండీఏ చైర్మన్ పదవితో పాటు మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి సహకరించడం వంటి హామీలు ఇచ్చినట్లు తెలిసింది.  
 
 కానీ ప్రకాశ్‌గౌడ్, ధర్మారెడ్డి పార్టీ మారితే భవిష్యత్తు ఉంటుందన్న హామీ తప్ప, ఇప్పటికిప్పుడు ఒనగూరే ప్రయోజనాలపై ఎలాంటి మాటామంతీ జరగలేదని సమాచారం. ప్రకాశ్‌గౌడ్‌ను చంద్రబాబు తన వద్దకు పిలిపించుకొని తాను పూర్తి అండగా ఉంటానని చెప్పినట్లు సమాచారం. టీటీడీ బోర్డులో తెలంగాణ నుంచి కనీసం ఇద్దరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్న దృష్ట్యా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతోపాటు ప్రకాశ్‌గౌడ్‌కు కూడా అవకాశం కల్పిం చేందుకు ప్రయత్నిస్తానని చెప్పిన ట్లు తెలిసింది. అలాగే ధర్మారెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ప్రాధాన్యత గల హోదా కల్పించేందుకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇతర ఎమ్మెల్యేలను కూడా కాపాడుకునేందుకు పార్టీలో కీలకమైన రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్‌రావు, సుజనా చౌదరి, సీఎం రమేష్, తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ మంత్రి కె.విజయ రామారావులను రంగంలోకి దింపినట్లు సమాచారం. పార్టీ మారతారని భావిస్తున్న ఎమ్మెల్యేలను పార్టీ మారొద్దని ఒప్పించే ప్రయత్నంలో వీరున్నారు. ఆర్థికపరమైన అంశాలను సుజనా చౌదరి, సీఎం రమేష్‌లకు అప్పగించినట్లు తెలిసింది.
 
 తెలంగాణలో టీడీపీ మాయం ఖాయం: తీగల
 
 త్వరలోనే తెలంగాణలో టీడీపీ మాయ మవడం ఖాయమని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చెప్పారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్రవిభజనకు ముందు, తర్వా త తెలంగాణ పట్ల చంద్రబాబు ప్రదర్శిస్తున్న వివక్షకు నిరసనగానే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామన్నారు. 54 శాతం విద్యుత్ తెలంగాణకు ఇవ్వాలని విభజన చట్టం లో ఉన్నా.. చంద్రబాబు దాన్ని అడ్డుకుని తెలంగాణ రైతుల ఉసురు పోసుకుంటున్నాడని విమర్శించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement