ధోని చేతికి హాకీ స్టిక్ | Sakshi
Sakshi News home page

ధోని చేతికి హాకీ స్టిక్

Published Sun, Oct 26 2014 12:52 AM

ధోని చేతికి హాకీ స్టిక్

రాంచీ జట్టును కొనుగోలు చేసిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్

 రాంచీ: భారత కెప్టెన్‌గా క్రికెట్‌లో అత్యున్నత స్థాయి విజయాలు అందుకున్న మహేంద్ర సింగ్ ధోని వరుసగా ఇతర క్రీడల్లో కూడా కీలక పాత్ర పోషించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. మహీమోటార్ రేసింగ్ టీమ్‌తో పాటు ఇటీవలే ఐఎస్‌ఎల్‌లో చెన్నైయిన్ ఫుట్‌బాల్ జట్టును కొనుగోలు చేసిన ధోని... ఇప్పుడు హాకీలో కూడా అడుగు పెట్టాడు. హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) జట్టు ‘రాంచీ రేస్’ను ధోని సొంతం చేసుకున్నాడు. సహారా అడ్వెంచర్ స్పోర్ట్స్ లిమిటెడ్ ఇందులో సహ భాగస్వామిగా ఉంటుంది.

2013లో జరిగిన తొలి హెచ్‌ఐఎల్‌లో టైటిల్ గెలుచుకున్న రాంచీ రైనోస్ టీమ్ ఈ ఏడాది మూడో స్థానంలో నిలిచింది. అయితే ఆ జట్టు యజమానుల మధ్య వచ్చిన విభేదాల కారణంగా హాకీ ఇండియా ఈ జట్టును రద్దు చేసింది. దాంతో ధోని, సహారా ఈ టీమ్‌ను కొని జట్టు పేరును ‘రాంచీ రేస్’గా మార్చారు. ఈ కార్యక్రమంలో టీమ్ లోగో, జెర్సీని ఆవిష్కరించారు.

 నగరంతో అనుబంధం వల్లే: భవిష్యత్తులో హాకీ క్రీడకు మరింత ప్రచారం కల్పించేందుకు తాను అన్ని విధాలా సహకరిస్తానని ధోని అన్నాడు. ‘హాకీతో అనుబంధం ఏర్పరచుకున్న ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం.  నేను ఇక్కడే పుట్టి పెరిగినవాడిని. గత రెండేళ్లుగా రాంచీ టీమ్ చాలా బాగా ఆడుతోంది. కాబట్టి ఈ అవకాశం వచ్చినపుడు మరో ఆలోచన లేకుండా ఇందులో అడుగు పెట్టాను. ఈ ప్రాంతంలో ప్రతిభను ప్రోత్సహించి హాకీని అభివృద్ధి చేయాలనేదే నా ప్రధాన ఉద్దేశం. అందుకోసం రేస్ జట్టు తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’ అని ఈ సందర్భంగా ధోని వ్యాఖ్యానించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement