Sakshi News home page

భళా.. బంగ్లా

Published Sat, Apr 18 2015 1:41 AM

భళా.. బంగ్లా

16 ఏళ్ల తర్వాత పాక్‌పై విజయం
 తమీమ్, ముష్ఫికర్ సెంచరీలు
 మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్‌కు 1-0 ఆధిక్యం

 
 మిర్పూర్: ఏదో అదృష్టవశాత్తు ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరలేదని, తమ దగ్గర పెద్ద జట్లను ఓడించే సత్తా ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మరోసారి నిరూపించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులతో ఘన విజయం సాధించింది. షేరేబంగ్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 329 పరుగుల భారీస్కోరు సాధించింది.
 
  వన్డే క్రికెట్ చరిత్రలో బంగ్లాకు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (135 బంతుల్లో 132; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. ముష్ఫికర్ రహీమ్ (77 బంతుల్లో 106; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడి శతకం సాధించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 178 పరుగులు జోడించడం విశేషం. వన్డేల్లో బంగ్లాకు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. షకీబ్ (31) రాణించాడు. వహబ్ రియాజ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.
 
 ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన అజ్మల్ 10 ఓవర్లలో 74 పరుగులు ఇచ్చాడు. పాకిస్తాన్ జట్టు 45.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటయింది. అజహర్ అలీ (72), హారిస్ సోహైల్ (51), రిజ్వాన్ (67) అర్ధసెంచరీలు సాధించినా ఫలితం లేకపోయింది. బంగ్లా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఏ దశలోనూ పాక్ లక్ష్యం దిశగా సాగలేదు. టాస్కిన్, అరాఫత్ సన్నీ మూడేసి వికెట్లు సాధించారు. బంగ్లాదేశ్ జట్టు పాక్‌పై ఏ ఫార్మాట్‌లోనైనా గెలవడం ఇది రెండోసారి. 1999 ప్రపంచకప్ తర్వాత మళ్లీ 16 ఏళ్లకు తమ ప్రియమైన శత్రువుపై బంగ్లాదేశ్ విజయం సాధించింది.
 

adsolute_video_ad

What’s your opinion

Advertisement
Advertisement