జనం రాటుదేలిపోయారు | Sakshi
Sakshi News home page

జనం రాటుదేలిపోయారు

Published Tue, Oct 6 2015 8:41 AM

జనం రాటుదేలిపోయారు - Sakshi

ప్రత్యేక హోదాపై దీక్ష విజయవంతమై దాని ఆసరాగా చంద్రబాబు కూడా కేంద్రంపై తగురీతిలో ఒత్తిడి తేగలిగితే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకుంటున్న తమ పార్టీకే కాక, మొత్తం యావదాంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది కదా! చంద్రబాబుకు, తెలుగుదేశం ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవడం ఇష్టం లేదా? వారు నిజంగా రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తును కోరుకునేటట్లయితే జగన్ దీక్షకు ఆటంకం కలిగించకూడదు కదా?!
 
 వైఎస్సార్‌సీపీని, దాని అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అంతగా భయపడుతున్నది? ‘భయమా? మాకెందుకు?’ అని తెలుగుదేశం నేతలు దబాయింపవచ్చుగానీ ఎంత భయం లేకుంటే గుంటూరులో జగన్ తలపెట్టిన నిరాహారదీక్ష జరపకుండా ఉండేందుకు పోలీసులను ముసుగుగా వాడుకొని నానాతంటాలు పడతారు? అని ఏ పాఠకునికైనా సహజంగా సందేహం కలుగుతుంది. ఇటీవలి కాలంలో తెలుగుదేశం నేతల కంగారు.. పసలేకుండా, ప్రతిపక్షనేతపై వ్యక్తిగత నిందారోపణలే తప్ప సహేతుకమైన సమాచారం, సమాధానం ఇవ్వలేని వారి ఉక్రోషం చూస్తే రాష్ట్ర ప్రజల సందేహానికి బలం కలుగుతుంది.
 
 చంద్రబాబు ప్రభుత్వం ప్రచారార్భాటంతో పాలన సాగించాలని, ‘కాశీపట్నం చూడర బాబు’ అంటూ ప్రజలకు పాత రోజులలో గ్రామాలలో బయోస్కోపు చూపించినట్లు అభూతకల్పనా శిల్పంతో ప్రజలను పగటి కలల్లో భ్రమల్లో తేలియాడింపజేయగలమన్న భరోసాతో నడుస్తున్నది. ఇది వాస్తవం. స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అన్నట్లు వెంకయ్య నాయుడు, చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు అందరం చూస్తున్నదే. స్వీయ ప్రమోషన్‌తో ఎడ్వర్‌టైజ్‌మెంట్ కళ ద్వారా ఉల్లిపాయంతటి కార్యాన్ని తాటికాయంతటిదిగా చూపించుకుని తమంత వారు తామేనన్నట్లు ప్రజలలో పేరు ప్రఖ్యాతులు సంతరించుకోవచ్చునన్న టెక్నిక్ తప్ప ఇందులో మరేమీ లేదు.
 
 జనం రాటుదేలిపోయారు
 శతాబ్దానికి ముందే చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు  ‘మాటకున్న వేగము గాలికెక్కడిది? మాటకున్న శక్తి పర్వతమునకెక్కడిది? కోతిమార్కు నల్ల పళ్లపొడి మీ దంతములను పాల వలె తెల్లగా శుభ్రపరుచును అన్న ప్రకటన పత్రికలో చూసినంతనే మరునాడుదయం వరకూ దంతములుం డునో లేదో యన్నట్లు పరుగున పోయి కొని తెచ్చుకుంటాము’ అని ఈ ప్రచార వ్యవహారం గూర్చి వ్యంగ్యంగా అన్నారు. ఇప్పటి జనం ఈ పిట్టల దొర వ్యవహారాలన్నీ చూసి రాటు దేలారు. ఎవరికైనా అనుమానం ఉంటే తాజాగా మలయాళ నటుడు మమ్ముట్టి పాపం ఒక సబ్బును గురించి అలాంటి ప్రకటన ఒకటిచ్చి కోర్టు పాలైన సంగతి గమనించెదరుగాక!
 
 ఈ సంవత్సరం జూన్ నెల 14వ తేదీ పన్నెండేళ్లకొసారి యథావిధిగా వచ్చే గోదావరి పుష్కరాల సంగతే చూడండి. ప్రభుత్వం తరఫున ఎంత ప్రచారం జరిగింది? ఆ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఎన్ని ప్రకటనలు గుప్పించారు? ఆ పుష్కర ప్రాశస్త్యంపై, పాలకుల ఏర్పాట్లపై ప్రశంసలతో కూడిన అనర్గళ ప్రవచనాలెన్ని? ప్రముఖ సినిమా దర్శకుని ద్వారా ప్రచార చిత్ర నిర్మాణం లేజర్‌షోలు (రికార్డింగ్ డ్యాన్స్‌లు లేవు. ఏ మాటకామాట చెప్పాలి)... ఒకే ఒక్కమాటలో చెప్పాలంటే అసలు చంద్రబాబు అధికారం లోకి రాకుంటే గోదావరికి పుష్కరాలు వచ్చేవి కావేమోనన్నట్లు అనిపించే హడావుడే అట్టహాసం! తీరా ఈ ఆర్భాటాన్ని సృష్టించే ప్రయత్నంలో ముఖ్యమంత్రివర్యుల భక్తి భావ ప్రచార కాంక్ష వలన దాదాపు 30 మంది ప్రాణాలు గోదావరిలో కలిసిపోయాయి. క్షంతవ్యం కాని ప్రచార ఖండూతే ఈ దుర్ఘటనకు కారణం అని ప్రతిపక్షాలు సోదాహరణంగా నిరూపిస్తే,  పుష్కరాల సందర్భంగా పుణ్యాత్ముల మృతిని రాజకీయం చేయవచ్చునా? అని చంద్రబాబు అంతేవాసులు కుంటి సవాళ్లు విసరడం గుర్తుంది కదా! ఏమాటకామాటే చెప్పుకోవాలి! మన ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రాణాలకు పరిహారం చెల్లించింది. ఆ పరిహారంతో, పాప ప్రక్షాళన జరిగిపోవాలనీ, జనం పాలకుల దుర్నీతిని మర్చిపోవాలనీ వారి తాపత్రయం.!
 
 జన్మ చరితార్థమైందా?

 ‘పట్టిసీమ’ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం, దానిని జాతికి అంకితం చేసిన ప్రహసనం, మన పాలకులు ముఖ్యంగా మన చంద్రబాబుగారి సెల్ఫ్ ప్రమోషన్ ప్రక్రియలో ప్రావీణ్య ప్రదర్శనకు నిదర్శనం. ఇందులో కృష్ణా గోదావరి ప్రాంత చంద్రబాబు తమ్ముళ్ల భక్తి నటనా కౌశలం ప్రశంసనీయం! ఇంత రికార్డు సమయంలో పట్టిసీమ వంటి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడంలో దేశంలోనే ప్రప్రథమం! గోదావరి, కృష్ణా నదులను పట్టిసీమ ద్వారా అనుసంధానం చేయడం ద్వారా అభినవ కాటన్ దొర లాగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు మా నాయకుడు చంద్రబాబు అంటూ.. కృష్ణతో సంగమానికై పరుగెడుతున్న పవిత్ర జలాల్లో (నిజానికి అది తమ్మిలేరు, బుడమేరు వర్షపు నీరు సంగమం) పవిత్ర స్థానాలాచరించి, ఫొటోలు తీయించుకుని, పత్రికలకిచ్చి నానా హంగామా చేశారు. పట్టిసీమ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పంపును ప్రారంభించే కార్యక్రమాన్ని, అక్కడ అప్పటికి ఒక్క మోటారు కూడా సిద్ధమవకపోవడంతో వాయిదా వేసుకున్న చంద్రబాబు, ఆ తర్వాత ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణలో భారీ వర్షాల వల్ల కొన్ని నీళ్లు కలుస్తుంటే తన జన్మచరితార్థమయిందని చెప్పి మరీ వ్యవహారం ముగించారు. ఈ విషయమై హిందూ పత్రిక వివరంగా వ్యాసాలు ప్రచురించి వాస్తవాలు చెప్పింది. సాక్షి పత్రిక కూడా తన వంతుగా నిజాలు వెల్లడించింది..
 
 పట్టిసీమతో సీమకు నీళ్లా!
 అప్పటికీ వైఎస్సార్‌సీపీ.. పోలవరం నిర్మాణంతో పట్టిసీమ పనికిమాలినదే అవుతుందనీ, 1,500 కోట్ల రూపాయలు గోదావరిలో కలపడంలో దాంతోపాటు అవినీతి జరిగిందనీ చెబుతూనే ఉన్నది. ఈ అనుసంధానం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుని తమ ముఖ్యమంత్రి సామర్థ్యాన్ని చిలవలు పలవలు చేసి చెప్పవచ్చని తమ్ముళ్లు ఆశల సౌధాలలో భావిస్తుంటే చివరికి మొదటికే మోసం వచ్చింది. ఈ ప్రహసనంలో, పోలవరం ప్రధాన కాలువకు పడిన గండి వలన ప్రభుత్వ ప్రతిష్టకే తీవ్ర విఘాతం కలిగింది. అంతేకాదు ఈ సంఘటనతో కృష్ణా డెల్టా రైతులకు, రాయలసీమ రైతులకు మధ్య వివాదం చెలరేగే ఆస్కారం ఏర్పడింది. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరందిస్తామని ప్రభుత్వం చెప్పింది ఒట్టి మాటేనని, నిజానికి పనికిరాని తాత్కాలిక పట్టిసీమ కోసం 1,500 కోట్లు వృథా చేశారనీ, అదే సొమ్ము దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సుజల స్రవంతిలకు ఖర్చు పెట్టినట్లయితే రాయలసీమకు మేలు జరిగి ఉండేదని రాయలసీమ ప్రజలు సహజంగానే సహేతుకంగానే భావిస్తున్నారు. ఆ నదిలో నీరు ఈ నదిలోకి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెంబుడు కూడా రాకుండానే ప్రాజెక్టు జాతికి అంకితమైంది. ఆవిధంగా చంద్రబాబు అపర భగీరథుడు, కాటన్ దొర అయ్యారు. ఆయన జన్మ చరితార్థమైంది.
 
 ప్రత్యేక హోదాతో ప్రజా ఉద్యమం
 ఇక ప్రత్యేక హోదా విషయమై జగన్‌మోహన్‌రెడ్డి వివిధ సందర్భాలలో ప్రత్యేకించి, ఇటీవలి అసెంబ్లీ సమావేశాలలో గణాంకాలతో సహా వివరించారు. అసెంబ్లీలో జగన్ ఆ అంశంపై ప్రసంగిస్తుంటే అనూహ్యంగా ప్రభుత్వ పక్ష సభ్యులు సైతం ఆర్ద్రంగా వింటున్నారు. ఇది చంద్రబాబుకి సహజంగానే ఇబ్బంది అయింది. తన వాళ్లెవరూ జగన్  ప్రసంగానికి అడ్డదిడ్డంగా అడ్డుపడకపోయేసరికి తానే జోక్యం చేసుకుని, ‘ప్రతిపక్ష నేత చెప్పేవన్నీ అనధికార రికార్డుల నుండి’ అని ఎగతాళి చేయబోయారు కానీ, జగన్ ఇచ్చిన సహేతుకమైన సమాధానంతో అపహాస్యం పాలయ్యారు. అప్పుడు ఆక్రోశం పట్టలేక చంద్రబాబు గారి ఆస్థాన అడ్డగోలు వాదులు క్షణక్షణం అడ్డుపడ్డారు.
 
 ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ తన మిత్ర పక్షమైన బీజేపీతో కలసి వేస్తున్న కుప్పిగంతులు, ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు తెలుగుదేశం కన్నంలో దొరికిపోవడం, అందువల్ల తన పద వికి గండం రాకుండా ఉండేందుకు ప్రధాని మోదీ, కేంద్ర బీజేపీ నేతల ముందు మనబాబు గారు నోరెత్తకపోవడం, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విసిరిన సవాళ్లు - దానిపై స్పందించలేని పాలక పక్షనేతలు - ఇవన్నీ ధర్నా సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ ఇతర నేతల ప్రసంగాలలో వస్తున్నాయి కదా! వైఎస్సార్‌సీపీ శ్రేణులే కాదు, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఇతర రాజకీయేతర శక్తులు - అందరూ జగన్ దీక్ష వలన అప్రమత్తమై ఈ ప్రత్యేక హోదా కోసం ఐక్యమై, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు లాంటి ప్రజా ఉద్యమమవుతోందని టీడీపీ, చంద్రబాబు గుండె గుభేల్ మంటూ ఉండి ఉండవచ్చు! అందుకే జగన్ దీక్షను అడ్డుకునే యత్నం వారు చేస్తున్నారు!
 
లేకుంటే ఈ దీక్ష విజయవంతమై దాని ఆసరాగా చంద్రబాబు కూడా కేంద్రంపై తగు రీతిలో ఒత్తిడి తేగలిగితే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకుంటున్న తమ పార్టీకే కాక, మొత్తం యావదాంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది కదా! చంద్ర బాబుకు, తెలుగుదేశం ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవడం ఇష్టం లేదా? వారు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉజ్వల భవిష్యత్తును కోరుకునేట్లయితే జగన్ దీక్షకు ఆటంకం కలిగించకూడదు కదా?!
 వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు
 ఫోన్: 98480 69720
 - డా॥ఏపీ విఠల్

Advertisement

తప్పక చదవండి

Advertisement