రియాలిటీ చెక్... ఏక్ అకేలా ఇస్ షెహర్ మే... | Sakshi
Sakshi News home page

రియాలిటీ చెక్... ఏక్ అకేలా ఇస్ షెహర్ మే...

Published Sat, Jan 25 2014 2:49 AM

రియాలిటీ చెక్...  ఏక్ అకేలా ఇస్ షెహర్ మే... - Sakshi

రియాలిటీ చెక్: పూడూరి రాజిరెడ్డి
 తెనాలి ప్రచురణలు
 హార్డ్‌బౌండ్ ఎడిషన్
 వెల: రూ. 250
 ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు
 వివరాలకు: 9550930789

 
 మంచి పుస్తకం: కలం భుజాన వేసుకొని బయల్దేరడం కష్టమే అందరికీ. ఎవరు వెళ్తారు చెప్పండి. ఒకనాడు ఒక శ్మశానానికి, ఒకనాడు ఒక శవాల గదికి, ఒకనాడు పొగలు చిమ్మే కిక్కిరిసిన సిటీబస్సు తొడతొక్కిడిలోకి, ఒకనాడు ఒక వేసవి ఎండ వడగాడ్పులోకి, ఒకనాడు ఒక సెక్స్‌వర్కర్ ఎదుట కూచుని ఆమె చెప్పే ఒకరాత్రి 17 సార్ల మృగరతి అనుభవంలోకి. ధైర్యం కావాలి. ధైర్యమేనా? ప్రేమ కావాలి. చేతులు సాచి కావలించుకునే గుణం. ఎవరూ చూడకుండా కన్నీరు కార్చుకునే కరుణ. అయ్యో... అయ్యో... అని గుండెలు బాదుకునే స్పందన. దానిని వ్యాఖ్యానించగల తాత్త్వికత. పూడూరి రాజిరెడ్డి ఇవన్నీ తాను పడి తన వాక్యం వల్ల, తన కలానికి ఉన్న లెన్సుల వల్ల, ఆ లెన్సు మాత్రమే చిత్రిక పట్టే దృశ్యాల వల్ల మనకు చూపించాడు ‘రియాలిటీ చెక్’లో. సాక్షి ఫన్ డేలో సూపర్ హిట్ కాలమ్ ఇది. వారం వారం వచ్చింది.
 
  ప్రతి వారం రాజిరెడ్డి ఏదో ఒక పరిచిత, అపరిచిత ప్రాంతానికి వెళ్లి మనకు పరిచితమైన సంగతిలోని అపరిచితమైన విశేషాన్ని అపరిచితమైన విశేషంలో అతి పరిచితమైన మానవ సహజ స్వభావాలను చూపి అబ్బుర పరుస్తాడు. ఇదంతా పిచ్చిలా ఉంది- పాతరోజుల్లో జర్నలిజమే ఒక వెర్రి అనుకునే జర్నలిస్టులు ఇలా చేశారు- ఇవాళ ఎవరు చేస్తున్నారు అనంటే? అప్పుడూ నదులు పారాయి. రేపూ పారుతాయి. కొత్తతరం వచ్చి కొత్తగా గోపురాలెక్కి అరచి అరచి చూపిస్తుంది లోకాన్ని- ఇటు చూడండి అని. యాభైకి మించిన వారాలు హైదరాబాద్‌లోని యాభైకి మించిన తావుల్లో రాజిరెడ్డి కూలబడి కూచుని ఏం చూశాడో చెప్పాడు ఇందులో. ఇది వర్తమానమా. ఇలాగే గతం లేదూ? ఇలాగే భవిష్యత్తు ఉండదూ? మరి దీనిని ఎందుకు చదవాలి.
 
  మనల్ని మనం చూసుకొని మనం మాత్రమే ఇలా కాదు అందరూ ఇలాగే ఉన్నారు అనుకొని ఊరట చెందడానికి. బాధ పడేవాళ్లను చూసి బాధ పడ్డానికి, ధైర్యంగా ఉన్నవారిని చూసి ధైర్యం తెచ్చుకోవాడానికి. ఇది ఒక వైద్యం. లేదా సుఖమయమనుకునే దొంగ గంతలు కట్టుకున్నవారిని ఈడ్చుకెళ్లి తప్పనిసరిగా ఎక్కించాల్సిన రోగం. మన చుట్టూ ఎలా ఉందో తెలుసుకోకపోతే ఎలా? వార్తల చాటున దాగిన కథలు ఇవి. రచయితలకు పట్టని సజీవ చిత్రాలు. మంచి వచనానికి ముఖం వాచినవాళ్లు దీనిని చదివి పాయసం చేసుకొని తిని అమ్మయ్య అనుకోరూ. తెలుగును ఎవరూ కాపాడనక్కర్లేదు. అదే ఎవడిదో ఒకడి కడుపులో దూరి తనను తాను కాపాడుకుంటుంది. అందుకొక సాక్ష్యం కూడా ఈ పుస్తకం. దీనిని చాలా అందంగా ఖర్చుతో తెనాలి ప్రచురణల వాళ్లు పుస్తకంగా తెచ్చారు. మంచితో మిలాఖత్ అయ్యేవాళ్లు ఎక్కడైనా ఉంటారు. వయసొచ్చిన పిల్లలందరి చేత దీనిని చదివిస్తే ఎలా ఉంటుందంటారు? పోనీ పి.జి కుర్రాళ్లందరినీ బెత్తంతో కొట్టి చదివిస్తే? మన సమాజపు రియాలిటీ తెలిసి దారిలో పడరూ?
 
 సినిమా పుస్తకం: దాసరి కంఠంలో గజమాల....
 పాలకొల్లు నుంచి మద్రాసు ప్రయాణం... పులులు సింహాల మధ్య- పాములు మొసళ్ల మధ్య- ఏ అండా దండా లేకుండా పైకి రావడం- సినిమా ఒక శక్తిమంతమైన మీడియా అనుకుంటే దానితో ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటో తెలుసుకొని కొద్దో గొప్పో సంస్కరణల కోసం దానిని ఉపయోగించడం- ఇవన్నీ చేసి సాధించినవారు దాసరి నారాయణరావు. 150 సినిమాలకు దర్శకత్వం వహించడం అంటే ఇక ఎప్పటికీ ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు అది. పని పట్ల ఒక రకమైన వెర్రి, ఉన్మాదం ఉంటే తప్ప సాధ్యం కాదు. అందుకనే ఆయన అన్ని సినిమాలు తీయగలిగారు.
 
 దాసరి తీసిన 150 సినిమాల గురించి వాటి తెర వెనుక కథ గురించి అవి చూపిన ప్రభావం గురించి ఈ పుస్తకం- ‘విశ్వవిజేత విజయగాథ’లో వివరించారు జర్నలిస్టు వినాయకరావు. తాత-మనవడు, స్వర్గం-నరకం, చిల్లరకొట్టు చిట్టెమ్మ, శివరంజని, సర్దార్ పాపారాయుడు, ప్రేమాభిషేకం... వీటి వెనుక కథలు ఆసక్తి రేపుతాయి. దాసరి అన్ని చిత్రాలు ఒకెత్తు... ‘అద్దాల మేడ’ ఒకెత్తు. సినిమా వాళ్ల మీదే తీసిన ఈ సినిమా- ఇండస్ట్రీ ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మరొక ఆశ్చర్యం ఏమిటంటే ఇవాళ మనం చాలా పెద్ద పెద్దవి అనుకుంటున్న చాలా సినిమాలని ఆయన కేవలం 20 రోజుల్లో 28 రోజుల్లో తీసి సూపర్ హిట్ చేయడం. నిర్మాత, ఇండస్ట్రీ మేలును ఆకాక్షించే దర్శకుడు చేయాల్సిన పని అదే. కాని ఇవాళ ఏం జరుగుతోంది? ఎన్ని కోట్లు... ఎన్ని వర్కింగ్ డేస్... అలాగని హిట్ కొట్టగలుగుతున్నారా? అందరు దర్శకులకూ దర్శకులు కావాలనుకునేవారికి పాఠం ఈ పుస్తకం. దాసరి ఒక సినిమా లైబ్రరీ. ఆ లైబ్రరీ నుంచి అందిన మరో మంచి పుస్తకం ‘విశ్వవిజేత విజయగాథ’. సినిమా పట్ల ఆసక్తి ఉన్నవారందరూ చదవదగ్గ పుస్తకం ఇది.
 హార్డ్ బౌండ్ ఎడిషన్: రూ.400; ప్రతులకు - 9985411019
 
 సాహిత్య డైరీ: రన్నింగ్ కామెంటరీ....
 తెలుగు పత్రికా రంగంలో వినూత్న ప్రయోగంగా వాసికెక్కిన  దేవిప్రియ - రన్నింగ్ కామెంటరీ- మూడు సంపుటాల ఆవిష్కరణ సభ జనవరి 29, బుధవారం సాయంత్రం. వేదిక: ఫ్యాప్సీ భవన్,  రెడ్‌హిల్స్. దాసరి నారాయణరావు, వేదకుమార్, హరగోపాల్, కె.రామచంద్రమూర్తి, గోరటి వెంకన్న తదితరులు పాల్గొంటారు.
 
 తెలుగు కథ- ప్రాంతీయ అస్తిత్వం
 కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో జనవరి 28 నుంచి 29 వరకు తెలుగు కథ- ప్రాంతీయ అస్తిత్వం అనే అంశంపై రెండు రోజుల పాటు సదస్సు జరుగుతుంది. డా.ఎస్.అబ్దుల్ ఖాదర్, డా.సంగిశెట్టి శ్రీనివాస్, డా.నందిని సిధారెడ్డి, డా.వి,త్రివేణి, డా.సంగెనేని రవీంధ్ర, డా. పసునూరి రవీందర్,  డా. సామాన్య, డా.మాడభూషి సంపత్ కుమార్ తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 98669 77741
 
 కొత్త పుస్తకాలు ఊహాచిత్రం...
 దారి ఏర్పడనంత వరకూ నడిచే నడక కూడా వృథా పోదు. ఎక్కడికి పోవాలి... ఎందుకుపోవాలి తెలియకుండా కొంత దూరం నడవడం ఏం వృథా? కాలు సాగి... సుదూర లక్ష్యం ఏర్పరుచుకోవడానికి వీలవుతుంది. అరిపిరాల సత్యప్రసాద్ ఏ విధమైన రచయిత? ఏ భావజాలపు రచయిత? ఎందుకు రాస్తున్న రచయిత? ప్రస్తుతానికి జవాబులు లేవు. కాని అతడి కథాసంపుటి ‘ఊహాచిత్రం’ చదివితే అతనొక మంచి రచయిత కాదగ్గ రచయిత అనిపిస్తుంది.
 
  కథ కట్టడం తెలుసు. కథకు అవసరమైన భాష తెలుసు. లాలిత్యమైన కథనం, సుతిమెత్తనైన వరుస, చెప్పాల్సింది ముఖం మీద బాదినట్టుగా కాకుండా మెల్లగానే అలాగని స్పష్టంగా చెప్పే గుణం.... ఇవన్నీ ఊహాచిత్రంలో కనపడతాయి. మధ్యతరగతిలో ఉండే దొంతరల మధ్య ఊపిరాడక చిక్కుబడిన గాలిని విడుదల చేయజూసిన కథలు ఇవి. తప్పించుకోవాల్సినవి తెలియజేయడం, సర్దుకుపోవాల్సినవాటితో సర్దుకుపోవడం నేర్పిస్తాయివి. చిన్న సెంటిమెంట్‌ను తట్టి లేపడం కూడా ఒక సుగుణమే. ‘స్వప్న శేషం’, ‘ఊహాచిత్రం’, ‘ఐదు వందల రూపాయల నోటు’, ‘చినుకులా రాలి’... రచయిత సామర్థ్యాన్ని చూపుతాయి. అనవసర కపటత్వాలను వదిలి మనిషి తన నిజమైన ఆనందాన్ని వెతుక్కోవడానికి దోవ చూపే కథలు ఇవి. చదవతగ్గవి.
 వెల: రూ.120/- ప్రతులకు: 9966907771
 
ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు....
 లాటిన్ అమెరికా చుట్టూ ఉండే మార్మిక ఆకర్షణ మరో భూభాగానికి లేదు. అక్కడి వీరులు ప్రపంచాన్ని అలాగే ఆకర్షించారు. అక్కడ భాష, భావజాలం, ఉద్యమాల ఊపు కూడా. సాహిత్యం ఏం తక్కువని. మార్కెజ్ (మార్క్వెజ్ అనకూడదట) తన కలంతో మేజిక్ రియలిజాన్ని సృష్టించి ప్రపంచానికి ఎక్కించాడు. బోర్హెస్ ఇక్కడి నుంచే తన కథలతో ప్రపంచమంతా వ్యాపించాడు. గద్దలకు ఏమీ తోచకపోతే వాలే ఈ నేల మీద నిలబడి అక్కడి ప్రజలు నిత్యం పహారా కాస్తూ గద్దల రాకను హెచ్చరించే కథలెన్నింటినో రాస్తూనే ఉన్నారు. అలాంటి 20 కథలను నిజాయితీగా అనువాదం చేసి అందించారు ‘ఎలనాగ’. సాధారణంగా భారతీయ కథలో కనిపించని ఎక్స్‌ప్రెషన్, దృశ్యాలని కత్తిరించి తిరగేసి చెప్పడం ఇక్కడి రచయితలు చేశారు. అసలు ఈ కథల్లోకి సంచరించడమే పూర్తిగా కొత్త.  కథాభిమానులకు ఇది మంచి కానుక.
 వెల: రూ.150 ప్రతులకు: 9866945424

Advertisement
Advertisement