పురపాలికల్లో తృణమూల్‌ హవా | Sakshi
Sakshi News home page

పురపాలికల్లో తృణమూల్‌ హవా

Published Fri, Aug 18 2017 1:14 AM

పురపాలికల్లో తృణమూల్‌ హవా - Sakshi

రెండో స్థానంలో బీజేపీ
కోల్‌కతా:
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పురపాలక సంఘ ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఘన విజయం సాధించింది. ఎన్నికలు నిర్వహించిన మొత్తం ఏడు పురపాలక సంఘాలనూ టీఎంసీ కైవసం చేసుకుంది. ఏడు మున్సిపాలిటీల్లోనూ కలిపి మొత్తం 148 వార్డులకు ఆగస్టు 13న పోలింగ్‌ జరిగింది. గురువారం ఫలితాలు వెలువడగా టీఎంసీ 140 వార్డుల్లో గెలుపొందింది. వామపక్షాలను కాదని ఈసారి బీజేపీ ఆరు స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలవడం గమనా ర్హం. సీపీఎం, కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి.

వామపక్ష కూటమిలోని ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి ఒక వార్డులో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాలోని హల్దియా, పశ్చిమ బుర్ద్వాన్‌ జిల్లాలోని దుర్గాపూర్, కూపర్స్‌ క్యాంప్‌లలో అన్ని వార్డుల్లోనూ టీఎంసీ అభ్యర్థులే గెలుపొందారు. నాలుగు పురపాలక సంఘాల్లో బీజేపీ అసలు ఖాతానే తెరవలేకపోయింది. కాగా ఎన్నికల్లో టీఎంసీ తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. టీఎంసీ ప్రజలను బెదిరించి, భయపెట్టినా తాము రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నామని బీజేపీ నాయకుడొకరు అన్నారు. ఎన్నికలు నియంతృత్వంగా సాగాయనీ, పోలింగ్‌ జరిగిన రోజునే ఎన్నికలను రద్దు చేయాల్సిందిగా తాము కోరామనీ, ఇది నిజమైన ప్రజాతీర్పు కాదని కాంగ్రెస్‌ పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement