కొండచరియ కింద ఊరు సమాధి | Sakshi
Sakshi News home page

కొండచరియ కింద ఊరు సమాధి

Published Thu, Jul 31 2014 12:45 AM

కొండచరియ కింద ఊరు సమాధి

20 మంది మృతి; శిథిలాల్లో కూరుకుపోయిన 160 మంది    పుణే జిల్లాలో విషాదం
 

పుణే: నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు భారీ కొండ చరియ విరిగి.. కిందనున్న గ్రామంపై పడడంతో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రలోని పుణే జిల్లాలో బుధవారం ఉదయం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పుణేకు 120 కి.మీ.ల దూరంలో ఉన్న మాలిన్ గ్రామం ఈ ఘటనలో తుడిచిపెట్టుకుపోయింది. పెద్దపెద్ద రాళ్లు, బురద ఒక్కసారిగా వరదలా మీద పడడంతో ఆ చిన్న గ్రామంలోని 50 గృహాల్లో.. 44 ధ్వంసమయ్యాయి. గ్రామస్తులు చాలా మంది ఆ రాతిచరియల మధ్య బురదలో కూరుకుపోయారు. స్థానికుల సహకారంతో బుధవారం సాయంత్రానికి సహాయ దళాలు 20 మృతదేహాలను, ఆరుగురు క్షతగాత్రులను వెలికితీశాయి. 160 మందికి పైగా శిథిలాల్లో చిక్కుకుపోయి ఉండొచ్చని, మృతుల సంఖ్య పెరగొచ్చని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ప్రమాద స్థలికి వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించారు. సమాచారం తెలియగానే జాతీయ విపత్తు సహాయక దళానికి(ఎన్‌డీఆర్‌ఎఫ్)చెందిన 378 మంది ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు.  రాతిచరియలు, బురదలో కూరుకుపోయిన వారి ప్రాణాలకు హాని కలగకుండా.. జాగ్రత్తగా శిథిలాలను తొలగిస్తున్నారు. రెండు డ్రోన్‌లను కూడా సహాయ చర్యల్లో వినియోగిస్తున్నారు.  ప్రతికూల వాతావరణం,  వర్షాలు సహాయ చర్యలను ఆటంకపరుస్తున్నాయి.

ప్రధాని సంతాపం.. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లాల్సిందిగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆదేశించారు. దాంతో ఢిల్లీ నుంచి బయల్దేరిన రాజ్‌నాథ్ బుధవారం రాత్రికి పూణె చేరుకున్నారు. శిధిలాలను పెద్ద ఎత్తున తొలగించే భారీ యంత్రాలు, క్షతగాత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. శిథిలాల కింద ఒక గుడి, భారీగా పశుసంపద చిక్కుకుపోయాయని స్థానికులు తెలిపారు. ప్రమాదం బుధవారం తెల్లవారు జామున 5 గంటలకు జరిగిందని పోలీస్ అధికారి వినోద్ పవార్ వెల్లడించగా.. ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఉదయమే ఆ గ్రామానికి రోజూ వచ్చే బస్సు డ్రైవర్‌కు ఆ గ్రామ ఆనవాళ్లే కనిపించలేదని ఆయన తెలిపారు. మరోవైపు, ముంబై, గోవా హైవే పైనా, సెంట్రల్ రైల్వేకు చెందిన ట్రాక్స్‌పైనా కొండచరియలు విరిగిపడిన ఘటనలు కూడా బుధవారం చోటుచేసుకున్నాయి.
 
 

Advertisement
Advertisement