తీర్పు మేరకే కేంద్రానికి అధికారాలు | Sakshi
Sakshi News home page

తీర్పు మేరకే కేంద్రానికి అధికారాలు

Published Sat, Aug 20 2016 1:19 AM

తీర్పు మేరకే కేంద్రానికి అధికారాలు - Sakshi

న్యాయ నియామకాలపై సుప్రీం తీర్పు ప్రకారం అధికారం తీసుకున్నాం
* విధివిధానాల ముసాయిదాపై న్యాయశాఖ ఉద్ఘాటన

న్యూఢిల్లీ: ఉన్నత స్థాయి న్యాయ నియామకాలకు సంబంధించిన విధివిధానాలు, అధికార పరిధులపై కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియంల మధ్య భిన్నాభిప్రాయాల నేపథ్యంలో.. న్యాయనియామకాలపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తాను అధికారాన్ని తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. న్యాయమూర్తుల నియామక వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం 2015 డిసెంబర్‌లో ఇచ్చిన తీర్పులో ఉద్ఘాటించిందని న్యాయశాఖలోని ఉన్నతస్థాయి వర్గాలు శుక్రవారం ఉటంకించాయి.

కొలీజియం వ్యవస్థను మెరుగుపరిచే మార్గాలపై ఇచ్చిన ఆ తీర్పులో.. ధర్మాసనానికి నియమించబోయే అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవటానికి మరింత విస్తృత పరిధి ఉండాలని కూడా పేర్కొందని గుర్తుచేశాయి. ఆ తీర్పు ఆధారంగానే న్యాయ నియామకాలపై సవరించిన విధివిధానాల పత్రం ముసాయిదాను రూపొందించటం జరిగిందని చెప్పాయి. ఆమేరకు.. అభ్యర్థుల పేర్లు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు అందరి నుంచీ రావాలన్నది ప్రభుత్వ వైఖరిగా చెప్పాయి. ‘ఒక హైకోర్టు కొలీజియానికి పేర్లను సూచించే స్వేచ్ఛ సదరు హైకోర్టు న్యాయమూర్తులు అందరికీ ఉండాలి.

ఆ కొలీజియం ఆ పేర్లను పరిశీలించి నియామకాలకు ఎవరిని సిఫారసు చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటుంది. సుప్రీంకోర్టుకు కూడా ఇదే విధానం వర్తింపజేయాలి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇదే సూత్రాన్ని పాటిస్తోంది’ అని ఆ వర్గాలు వివరించాయి. అలాగే.. ముఖ్యమంత్రులకు, అడ్వొకేట్ జనరళ్లకు కూడా తమ రాష్ట్ర హైకోర్టు కొలీజియంలకు అభ్యర్థులను సూచించే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాయి. సుప్రీంకోర్టుకు అభ్యర్థులను సూచించే అవకాశం అటార్నీ జనరల్‌కు ఇవ్వాలన్నాయి. న్యాయనియామకాలకు సంబంధించి మార్గదర్శకాల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధివిధానాల పత్రం ముసాయిదాలో పలు మార్పులు చేయాలని చెప్తూ సుప్రీంకోర్టు కొలీజియం గతంలో కేంద్రానికి తిప్పిపంపిన విషయం తెలిసిందే.

ఇందులో కొలీజియం డిమాండ్లు కొన్నిటికి అంగీకరిస్తూ సవరించిన ముసాయిదాను కేంద్రం ఈ నెల 3వ తేదీన కొలీజియానికి పంపించింది. అభ్యర్థుల ఎంపికకు ప్రతిభ - సీనియారిటీ ప్రాతిపదికగా ఉండాలన్న మార్గదర్శకాన్ని.. సీనియారిటీ-ప్రతిభ ప్రాతిపదికగా మార్చటానికి కేంద్రం ఆంగీకరించింది. అయితే సీనియారిటీని కాదనటానికి.. ఒక హైకోర్టు నుంచి ఎక్కువ మంది న్యాయమూర్తులు, ఎస్‌సీలు, ఎస్‌టీలు, మహిళలకు చోటు ఇవ్వటం, ఒక న్యాయమూర్తి అత్యద్భుత పనితీరు, ఒక ప్రధాన న్యాయమూర్తి పనితీరు బాగోలేకపోవటం వంటి కారణాలను వినియోగించుకోవచ్చునని పేర్కొంది.

న్యాయమూర్తి అయ్యేందుకు అవసరమైన కనీస వయసును నిర్ణయించే అంశాన్ని న్యాయవ్యవస్థకే వదిలిపెట్టింది. అయితే.. ఒకసారి నిర్ణయించిన వయసును సడలించటానికి వీలు ఉండకూడదని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల స్థాయి లో.. అభ్యర్థుల పనితీరు అంచనా, మదింపుల కమిటీలు ఉండాలన్న నిబంధనను భారత ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించినప్పటికీ.. సర్కారు దానిపై మళ్లీ పట్టుపట్టింది.

Advertisement
Advertisement