రూపాయి @ రూ.1.14 | Sakshi
Sakshi News home page

రూపాయి @ రూ.1.14

Published Fri, Jul 3 2015 2:15 AM

రూపాయి @ రూ.1.14 - Sakshi

న్యూఢిల్లీ: 20 ఏళ్లుగా మనకు కనిపించకుండాపోయిన రూపాయి నోటు మళ్లీ మన పర్సులోకి వచ్చింది. దీనిని ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఆ నోటు విలువ కంటే ఎక్కువే వ్యయమవుతుంది! రూపాయి నోటు ముద్రణకు అక్షరాలా రూపాయి 14 పైసలు ఖర్చవుతుంది. ఈ ఆసక్తికరమైన విషయం సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్, మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్పీఎంసీఐఎల్) ఈ విషయాన్ని వెల్లడించింది.

రూపాయి నోటు ముద్రణకు కాస్టింగ్ సూత్రం ప్రకారం రూ.1.14 ఖర్చవుతుందని ప్రాథమికంగా లెక్కగట్టామని, పూర్తిస్థాయిలో ఆడిటింగ్ జరిగితే కచ్చితమైన విలువ తెలుస్తుందని పేర్కొంది. 2014-15కు సంబంధించి ఇంకా ఆడిటింగ్ పనులు జరుగుతున్నాయంది. ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ దాఖలు చేసిన దరఖాస్తుకు ఎస్పీఎంసీఐఎల్ ఈమేరకు వెల్లడించింది. రూపాయి నోటు ముద్రణకు ఎక్కువ ఖర్చవుతోందని, అదీగాక ఇది ఎక్కువ కాలం మనుగడలో ఉండదనే కారణంతో దీని ముద్రణను 1994లో నిలిపేశారు.

ఈ కారణంతో రెండు, ఐదు రూపాయల నోట్ల ప్రింటింగ్‌ను కూడా ఆపేసి బిళ్లల రూపంలో తీసుకొచ్చారని అగర్వాల్ చెప్పారు. అయితే రూపాయి నోట్లను మళ్లీ  ప్రింట్ చేస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2014 డిసెంబర్ 16న గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. గత మార్చి 6న రాజస్తాన్‌లోని శ్రీనాథ్‌జీ ఆలయంలో ఈ నోటును విడుదల చేసింది. అన్ని కరెన్సీ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటే,రూపాయి నోటుపై మాత్రం ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉండటం దీని ప్రత్యేకత.

Advertisement
Advertisement