సంతోషానికి అదొక్కటే కారణం కాదు | Sakshi
Sakshi News home page

సంతోషానికి అదొక్కటే కారణం కాదు

Published Tue, Feb 28 2017 3:27 AM

సంతోషానికి అదొక్కటే కారణం కాదు - Sakshi

కష్టసుఖాల సమ్మేళనమే జీవితం. దీనికి అతీతం అంటూ ఎవరూ ఉండరు. జీవిత పయనం చాలా నేర్పుతుంది. నటి సమంత ఇదే విషయాన్ని వల్లించారు. ఈ చెన్నై చిన్నదాని సినీ పయనం ఏడేళ్లను అధిగమించింది. కోలీవుడ్‌లో తన నట జీవితం అంత ఆశాజనకంగా లేకపోయినా, టాలీవుడ్‌లో మాత్రం తొలి చిత్రమే ఈ అమ్మడిని అందలం ఎక్కించింది. ఏం మాయ చేశావే చిత్రం తరువాత సమంతకు కేరీర్‌ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం కలగలేదు. త్వరలో ప్రేమించిన ప్రియుడి చేయి పట్టనున్న సమంత తన ఏడేళ్ల సినీ జీవితాన్ని క్లుప్తంగా తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

అదేమిటో చూద్దాం ‘నేను చిత్ర రంగప్రవేశం చేసి ఏడేళ్లయ్యింది. ప్రస్తుతం దాని గురించి చెప్పగలిగే పరిణితి చెందాను. చాలా కఠినవైున జీవితం నుంచి ఉన్నతస్థాయి వరకూ పలు రకాల పరిస్థితులను ఎదుర్కొన్నాను. అందులో అపజయాలు, రక్షణ లేని పరిస్థితులు, నిరాకరణ, వేదన, బాధ, విజయం, ధనం, కీర్తి ఇలా చాలా అనుభవించాను. అయితే విజయాలతోనే నేను సంతోషంగా ఉన్నానని చెప్పను. సంతోషం అన్నది తానుగానే కలుగుతుంది. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొని సహజంగా జీవించడం ఎలా అన్నది అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నాకు ఏడేళ్లు పట్టింది. ఏడాదిలో కొన్ని రోజులు షూటింగ్‌లు లేకుంటే దాన్ని నేను ఓడిపోయినట్లు భావించను.

సామాజిక మాధ్యమాల్లో కొందరు నన్ను తీవ్రంగా విమర్శించారు. వాటి గురించి పట్టించుకోవడానికి ఎకు్కవ సమయం కేటాయించను. వాటి కారణంగా నా గుండె ఆగిపోనూలేదు. అందుకు ప్రతి క్షణం నరకయాతన పడిన సందర్భాలు లేవు. ప్రతి వారికి ఒక సందర్భం వస్తుందని నమ్ముతాను. మరో విషయం ఏమిటంటే ప్రతి వారి విజయానికి ఇతరుల భాగస్వామ్యం ఉండాలన్నది నా భావన. సినిమా నాకు ధనం, పేరు, ప్రఖ్యాతులను అందించింది. అదే సమయంలో కొందరు మంచి వ్యక్తులను పరిచయం చేసింది. వారు నన్ను చాలా ఆకట్టుకున్నారు. వారు చూపిన ప్రేమాభిమానాలే క్లిష్ట పరిస్థితుల నుంచి నన్ను బయట పడేలా చేశాయి. వారిని నేను జీవితాంతం మరచిపోను.

Advertisement
Advertisement