ప్రపంచంలోనే అతి పొడవైన రైలు సొరంగం | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అతి పొడవైన రైలు సొరంగం

Published Fri, Aug 28 2015 8:14 AM

ప్రపంచంలోనే అతి పొడవైన రైలు సొరంగం

బెర్న్: ప్రపంచంలోనే అత్యంత పొడవైన, భూ ఉపరితలానికి అత్యంత దిగువన స్విడ్జర్లాండ్ రైల్వే చేపట్టిన ప్రతిష్టాత్మక రైల్వే టన్నెల్ నిర్మాణం పూర్తయింది. జూరిచ్, మిలాన్ నగరాల మధ్యన, 57 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే సొరంగాన్ని భూమి ఉపరితలానికి ఎనిమిదివేల అడుగుల లోతున నిర్మించారు. నీట్ గొథర్డ్ బేస్ టన్నెల్‌గా పిలిచే దీని నిర్మాణం పనులను 1996లో చేపట్టారు. కఠిన శిలలుగల పర్వత ప్రాంతాల్లో నిర్మించడం వల్ల నిర్మాణం పూర్తవడానికి దాదాపు 20 ఏళ్లు పట్టడమే కాకుండా దాదాపు 62 వేల కోట్ల రూపాయలు ఖర్చయింది.

రోజుకు రెండువేల మంది కార్మికులు సొరంగం నిర్మాణంలో పాల్గొన్నారు. సొరంగం తవ్వడం వల్ల వెలువడిన దాదాపు 20 లక్షల భారీ ట్రక్కుల లోడ్ మట్టిని బయటకు తరలించారు. అన్ని సాంకేతిక పనులు కూడా పూర్తయ్యాయని, ఈ అక్టోబర్ ఒకటవ తేదీ  నుంచి ట్రయల్ రన్స్ నిర్వహిస్తామని, 2016, జనవరి నెలలో వెయ్యిమంది ఎంపిక చేసిన ప్రయాణికులను తీసుకొని తొలి రైలు ప్రయాణిస్తుందని, ఆ తర్వాత జూన్‌లో సొరంగాన్ని ప్రారంభిస్తామని స్విస్ రైల్వే వర్గాలు తెలిపాయి.

జూరిచ్ నుంచి మిలాన్ నగరానికి వెళ్లడానికి దాదాపు పది నిమిషాలు తక్కువ మూడు గంటల సమయం పడుతుందని, 240 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణిస్తాయని ఆ వర్గాలు తెలిపాయి. ఇతర మార్గాల్లో ప్రయాణించడానికన్నా ఈ మార్గంలో ప్రయాణిస్తే గంట సమయం కలిసొస్తుందని చెప్పాయి. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా పొడవైన రైలు మార్గం జపాన్‌లో ఉంది. సీకాన్ టన్నెల్‌గా పిలిచే దాని పొడవు 24 కిలోమీటర్లు. హోన్షు, హొక్కాయిడో నగరాలను కలుపుతూ ఆ టన్నెల్‌ను నిర్మించారు.

Advertisement
Advertisement