ఉగ్రదాడి అనుమానం.. దేశవ్యాప్త అలర్ట్..! | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడి అనుమానం.. దేశవ్యాప్త అలర్ట్..!

Published Fri, Sep 30 2016 9:21 PM

ఉగ్రదాడి అనుమానం.. దేశవ్యాప్త అలర్ట్..!

న్యూఢిల్లీః నియంత్రణ రేఖ వెంబడి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిన నేపథ్యంలో పాకిస్థానీ టెర్రరిస్టులు విరుచుకు పడే అవకాశం ఉందని భారత్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తం అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఎల్వోసీ వెంబడి ఉన్న రాష్ట్రాలన్నీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లు, ఆధ్యాత్మిక క్షేత్రాలతోపాటు  సున్నిత ప్రాంతాల్లో అధిక బలగాలను మొహరించి రాష్ట్రాలన్నీ అప్రమత్తం కావాలని కేంద్ర హోం శాఖ అధికారిక వర్గాలు హెచ్చరించాయి.

పాకిస్థాన్ ను ఆనుకొని ఉన్న జమ్ము కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇండియన్ ఆర్మీ బుధవారం రాత్రి పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ పై జరిపిన దాడుల నేపథ్యంలో పాకిస్థానీ ఉగ్రవాదులు ఏ సమయంలోనైనా దాడులకు దిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. పాకిస్థానీ ఏజెన్సీలు ట్రెర్రర్ గ్రూపుల సహకారంతో భారత్ పై దాడికి దిగి పగతీర్చుకొనే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశాయి.

ఎల్వోసీ వెంబడి ఉన్న ఏడు ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపి 30 మంది టెర్రరిస్టులతోపాటు వారికి మద్దతునిస్తున్న ఇద్దరు సైనికులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ పరిస్థితుల్లో పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని ఎల్వోసీ సమీప గ్రామాలపై ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని,  ఆయా గ్రామాల ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా బుధవారంనాటి సర్జికల్ స్ట్రైక్స్ పై పాకిస్థాన్ పగతీర్చుకుంటుందంటూ ముంబైలో జరిగిన 26/11 దాడుల ప్రధాన సూత్రధారి.. నిషేధిత జమాత్‌ ఉద్‌ దవా గ్రూప్‌ అధినేత.. హపీజ్‌ సయీద్‌ హెచ్చరించడంతో కేంద్రం ఈ హెచ్చరికలను జారీ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement