కూర‘గారాలు’ | Sakshi
Sakshi News home page

కూర‘గారాలు’

Published Tue, Jan 7 2014 4:20 AM

కూర‘గారాలు’ - Sakshi

=దిగొచ్చిన ధరలు     
 =రా.. రమ్మంటున్న రైతుబజార్లు
 =ఇబ్బడిముబ్బడిగా కూరగాయల దిగుబడి
 =రూ.100లకే నిండుతోన్న చేతి సంచి

 
సాక్షి, సిటీబ్యూరో : నగరంలో చాలారోజుల తర్వాత సగటు కుటుంబం తృప్తిగా భోజనం చేసే పరిస్థితి ఏర్పడింది. ఇటీవలి వరకు ఠారెత్తించిన టమోట , పచ్చిమిర్చి వంటి కూరగాయల ధరలు దిగిరావడం సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఊరట  నిచ్చింది. రూ.100లు వెచ్చిస్తే చేతిసంచి నిండిపోతుండటంతో గృహిణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు టమోట అరకిలో, పావు కిలోతో సరిపెట్టుకొన్న వారు ఇప్పుడు ఏకంగా 4, 5 కిలోలు కొనుగోలు చేస్తున్నారు.

గ్రేటర్ చుట్టుపక్క ప్రాంతాల్లో కూరగాయల దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో సరకు రైతుబజార్లను ముంచెత్తుతోంది. బహిరంగ మార్కెట్లు సైతం అన్నిరకాల కూరగాయలతో కళకళలాడుతున్నాయి. ప్రత్యేకించి  కొత్త పంట దిగుబడి విపరీతంగా పెరగడంతో టమోట ధర సింగిల్ డిజిట్ కు దిగి వచ్చింది.  సీజన్ ఊపందుకోవడంతో చిక్కుడు, వంగ, క్యాబేజీ, కీర, దోస, వంటి కూరగాయల దిగుబడులు అధికమై వాటి ధర సింగిల్ డిజిట్‌కు పడిపోయింది.

సోమవారం హోల్‌సేల్ మార్కెట్లో టమోట ధర కేజీ రూ.4లకు దిగివచ్చింది. దీనికి మరో రూ.2 అదనంగా వేసి రైతుబజార్లలో టమోట ధర కేజీ రూ.6లుగా నిర్ణయించారు. అయితే రైతులు బోర్డుపై రాసిన ధరకంటే ఇంకా తగ్గించి మరీ అమ్ముతున్నారు. టమోట దిగుబడి ఎక్కువకావడంతో  ఏరోజు సరుకు ఆరోజే అమ్ముకొనేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే ఉదయం ఉన్న ధరను సాయంత్రానికల్లా తగ్గించి 2 కేజీల టమోట కేవలం రూ.10లకే విక్రయించి చేతులు దులుపుకొంటున్నారు.

అలాగే వంకాయ, చిక్కుడు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దోస వంటి కూరగాయలు కూడా రైతుబజార్‌లో బోర్డుపై రాసిన ధరల కంటే రూ.2లు తగ్గించి రైతులు విక్రయిస్తున్నారు. ఆకుకూరల ధరలు కూడా టమోట బాటలోనే కిందికి దిగివచ్చాయి. చిన్న కట్ట రూ.10లు ధర పలికిన కొత్తిమీర,  తోటకూర, పాలకూర, గంగవాయల్‌కూర, గోంగూర, బచ్చలకూర, చుక్కకూర వంటివి రూ.10లకే 10-12 కట్టలు లభిస్తున్నాయి.
 
దక్కిన కాడికే...:
 
టమోట నిల్వ ఉంచలేని పరిస్థితిలో చాలామంది  రైతులు హోల్‌సేల్ రేట్లకే అమ్మి సొమ్ము చేసుకొంటున్నారు. రైతుబ జార్‌లో కూరగాయల ధరలు  అనూహ్యంగా దిగివస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్లో చిల్లర వ్యాపారులు కూడా ధరలు తగ్గించి విక్రయిస్తున్నారు.  బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీనగర్, మీరాలంమండీ, మాదన్నపేట్ హోల్‌సేల్ మార్కెట్లకు  సోమవారం 324 లారీల టమోట దిగుమతైనట్లు మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. నగంలోని రైతుబజార్లు, హోల్‌సేల్ మార్కెట్లు, మాల్స్, రిటైల్ మార్కెట్‌కు అన్నింటికీ కలిపి మొత్తం 40వేల క్వింటాళ్లకు పైగా అన్నిరకాల కూరగాయలు సరఫరా అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement