ఉత్తమ్ రాజీనామా... | Sakshi
Sakshi News home page

ఉత్తమ్ రాజీనామా...

Published Sat, Feb 6 2016 6:02 PM

ఉత్తమ్ రాజీనామా... - Sakshi

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సారధిపై తీవ్ర ఒత్తిళ్లు పెరిగాయి. గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం తీవ్రంగా జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితం కావడంపై హైకమాండ్ విస్మయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ నాయకత్వం సమన్వయంతో పనిచేయకపోవడం కూడా అందుకు ఒక కారణంగా భావిస్తున్న పార్టీ హైకమాండ్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల సమాచారం.

ఈ క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ని టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొంత కాలం కిందట వరంగల్ లోక్ సభ ఉపఎన్నికల్లోనూ పార్టీ ఓటమి అంశం కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరును సమీక్షించడానికి ఆస్కారం కలిగిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా ఫలితాలపై పార్టీ హైకమాండ్ టీపీసీసీ నేతల నుంచి ఇప్పటికే ఒక నివేదికను కోరింది.

ఇలావుండగా, ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా తానే పదవి నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారని మరో వర్గం నేతలు చెబుతున్నారు. గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో ఉత్తమ్ పై మరింత ఒత్తిడి పెరిగిందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అయితే ఈ నెల 13 వ తేదీన నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఆ ఎన్నిక పూర్తయ్యే వరకు టీపీసీసీలో ఎలాంటి మార్పుచేర్పులు జరగబోవని తెలుస్తోంది. నారాయణఖేడ్ ఉప ఎన్నిక అనంతరం తెలంగాణ పీసీసీ మొత్తంగా పునర్వ్యవస్థీకరణ జరిగే ఆస్కారం ఉందని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.

Advertisement
Advertisement