వెలుగుచూస్తున్న నందినీ చౌదరి లీలలు

వెలుగుచూస్తున్న నందినీ చౌదరి లీలలు


హైదరాబాద్: బ్యూటీ స్పా ముసుగులో కస్టమర్లను మోసపుచ్చిన నందినీ చౌదరి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-72లోని బ్లష్ స్పా అండ్ లగ్జరీ సెలూన్ నిర్వాహకురాలు యలమంచిలి నందిని చౌదరి చేతిలో మోసపోయినవారు రోజుకొకరు బయటపడుతున్నారు. ఆభరణాల వ్యాపారం పేరుతో ఓ వ్యాపారిని నిండాముంచి అరెస్టు అయి జైలులో ఊచలు లెక్కిస్తున్న నందిని చౌదరిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోనే కాకుండా పంజగుట్ట, నాంపల్లి, సీసీఎస్‌లో కూడా కేసులు నమోదవుతున్నాయి.



నందినీ చౌదరీ తమ వద్ద నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. తన స్పా అండ్ సెలూన్‌కు వచ్చే కస్టమర్లను మభ్యపెట్టి వారి నుంచి లక్షలాది రూపాయల విలువ చేసే ఆభరణాలతో పాటు అప్పు పేరుతో డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. నాలుగు రోజుల క్రితం చందనబ్రదర్స్ నిర్వాహకులు తమను రూ. 20 లక్షల మేర మోసం చేసినట్లు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఎస్‌లో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా మరోకేసు నమోదైంది. రూ.20 లక్షల మేర తమను మోసం చేసిందంటూ ఇద్దరు వ్యాపారులు ఫిర్యాదులిచ్చారు. ఇటీవల ఆమెను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించగా చాలా విషయాలు చెప్పకుండా దాటవేసినట్లు తేలింది.



మరోమారు కస్టడీకి తీసుకోవాలని ఓ వైపు నాంపల్లి పోలీసులు, ఇంకో వైపు సీసీఎస్ పోలీసులు పిటిషన్లు దాఖలు చేయాలని తలపెట్టారు. ఇదిలా ఉండగా హైఫై మహిళలను లక్ష్యంగా చేసుకొని వారికి కొందరు యువకులతో పరిచయాలు చేయించి మేల్ ఎస్కార్ట్స్‌ను పంపిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని సమాచారం. ఇలా పాతికమంది మహిళలకు మేల్ ఎస్కార్ట్స్‌ను సరఫరా చేసి వారినుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు కూడా తెలుస్తోంది. వీరంతా పరువు పోతుందనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని భావిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top