మా పార్టీ విలీనం కాలేదు: కొండా | Sakshi
Sakshi News home page

మా పార్టీ విలీనం కాలేదు: కొండా

Published Thu, May 5 2016 4:07 PM

మా పార్టీ విలీనం కాలేదు: కొండా

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి - ఫారంపై గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యేలు తక్షణం రాజీనామా చేయాలని ఆ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీ వేరే ఏ పార్టీలోనూ విలీనం కాలేదని ఆయన స్పష్టం చేశారు. టి - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం గురువారం హైదరాబాద్లో సమావేశమై.. ఆరు తీర్మానాలను ఆమోదించింది. ఆ సమావేశం ముగిశాక ఆ తీర్మానాలను టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి విలేకర్ల సమావేశంలో వివరించారు. టీ - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం రద్దు అయినట్లు ఆయన ప్రకటించారు.

నూతన అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డికి అప్పగించినట్లు తెలిపారు. పార్టీ ఫిరాయించిన వారిపై పార్లమెంట్, అసెంబ్లీలో స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తెలంగాణలో అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.

అలాగే మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేయాలని మరో తీర్మానం చేసినట్లుచెప్పారు. పాలేరు ఉపఎన్నికలో రాంరెడ్డి సుచరితారెడ్డికి మద్దతు ఇవ్వాలని మరో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. టీ - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనమైందంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ ఇంకో తీర్మానం చేసినట్లు కొండా రాఘవరెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement