
టీడీపీతో పొత్తు లేదు, ఒంటరి పోరే : జి.కిషన్‌రెడ్డి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి నినాదంతో ఒంటరిగానే ఎన్నికలకు వెళతామన్నారు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి నినాదంతో ఒంటరిగానే ఎన్నికలకు వెళతామన్నారు. పొత్తు కావాలని తామెన్నడూ టీడీపీని అడగనే లేదని, ఏ స్థాయిలోనూ చర్చలే జరగలేదని స్పష్టంచేశారు. పొత్తుకోసం టీడీపీ నేతలే తమ జాతీయ నాయకత్వం చుట్టూ చెప్పులరిగేలా తిరిగారని, ఆ విషయాన్ని మరచి ఇప్పుడు పొత్తు తమకు అవసరం లేదనడాన్ని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని సీట్లకూ అభ్యర్థుల్ని ఖరారు చేయమని తమ నాయకత్వం ఆదేశించిందన్నారు.
తెలంగాణ సహా దేశాభివృద్ధి తమతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో అభివృద్ధే తమ నినాదమని చెప్పారు. పార్టీ నేతలు దత్తాత్రేయ, లక్ష్మణ్, యెండల, ప్రేమేందర్‌రెడ్డి, రామచంద్రరావు, మల్లారెడ్డి తదితరులతో కలసి ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రకు బీజేపీ మోసం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణపై మండిపడ్డారు. మాట మీద నిలబడడమే మోసం చేయడమా? అని నిలదీశారు. టీడీపీ మాదిరి రెండు మాటలు చెప్పడం తమ విధానం కాదన్నారు. మోసం చంద్రబాబు నైజమని నిప్పులు చెరిగారు. చివరి నిమిషం వరకు బిల్లును ఆపేందుకు ప్రయత్నించిన టీడీపీ... బిల్లు పాసయిన తర్వాత సుష్మాస్వరాజ్ సైతాన్, దెయ్యమంటూ దిష్టిబొమ్మలు దహనం చేయడాన్ని తప్పుబట్టారు.
పార్లమెంటు ఆమోదించిన రాష్ట్ర విభజన బిల్లుపై రాష్ట్రపతి సంతకం ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏ బేరసారాల కోసం ఆ ఫైలును రాష్ట్రపతి వద్దకు పంపడం లేదని నిలదీశారు. ప్రజల ఆకాంక్ష మేరకు కాకుండా రాహుల్‌ను ప్రధాని చేసేందుకో, రాజకీయ లబ్ధి కోసమో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని దుయ్యబట్టారు. మోడి ప్రభంజనం పేరిట రూపొందిన పుస్తకాన్ని ఆయన శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.