జూన్ 1 నుంచి బెజవాడ నుంచే పాలన | Sakshi
Sakshi News home page

జూన్ 1 నుంచి బెజవాడ నుంచే పాలన

Published Tue, Dec 1 2015 8:41 PM

జూన్ 1 నుంచి బెజవాడ నుంచే పాలన - Sakshi

హైదరాబాద్ : వచ్చే ఏడాది (2016) జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని కార్యకలాపాలు, విధులు నూతన రాజధాని నుంచే  చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం కార్యదర్శులు, శాఖాధిపతులు అందరూ  కొత్త రాజధాని ప్రాంతం నుంచే తమ విధులను  నిర్వహిస్తారని ఆయన తెలిపారు. తమ తమ శాఖలలోని అధికారులకు, ఉద్యోగులకు ఈ మేరకు తగిన సూచనలు ఇవ్వాలని కోరారు.  

రాజధానిలో పని చేసేందేకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేసుకోవాలంటూ ప్రభుత్వ శాఖ విభాగాల అధిపతులు అందరికీ  ఐవైఆర్ కృష్ణారావు సర్క్యులర్ మెమో జారీ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ తప్పనిసరిగా వచ్చే సంవత్సరం జూన్ 2వ తేదీ నాటికి విజయవాడకు తరలిరావాల్సిందేనని ఏపీ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే.  జూన్ రెండో తేదీ నాటికి రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో అప్పటికల్లా పూర్తిస్థాయిలో సెక్రటేరియట్‌ను కూడా తరలించాల్సిందేనని కేబినెట్ నిర్ణయించింది.

Advertisement
Advertisement