శాకాహారం తప్పనిసరా? | Sakshi
Sakshi News home page

శాకాహారం తప్పనిసరా?

Published Sun, Jul 2 2017 2:20 AM

శాకాహారం తప్పనిసరా?

నాకు చిన్నప్పటి నుంచి నాన్‌వెజ్‌ మాత్రమే తినే అలవాటు ఉంది. నాన్‌వెజ్‌ మానేసి శాకాహారం తినడానికి ప్రయత్నించాను గానీ చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. ప్రెగ్నెన్సీ సమయంలో నాన్‌వెజ్‌ తినడం మంచిది కాదు అంటున్నారు. నేను తప్పనిసరిగా శాకాహారం తీసుకోవాలా?
– జీ.యం, విశాఖపట్నం

ప్రెగ్నెన్సీ సమయంలో శాకాహారంతో పాటు, నాన్‌వెజ్‌ కూడా తినవచ్చు. మొత్తంగా నాన్‌వెజ్‌ కాకుండా రెండూ కలిపి తీసుకోవాలి. నాన్‌వెజ్‌లో చికెన్, మటన్, రొయ్యలు, చేపలు, కొద్దికొద్దిగా బాగా ఉడకబెట్టుకుని మసాలా ఎక్కువ లేకుండా తీసుకోవచ్చు. నీ బరువు తక్కువగా ఉంటే రోజూ ఒక గుడ్డు ఉడక బెట్టుకుని తినవచ్చు. బరువు ఎక్కువగా ఉంటే గుడ్డులో పచ్చసొన కాకుండా తెల్లసొన రోజూ తీసుకోవచ్చు లేదా గుడ్డు వారానికి రెండుసార్లు తీసుకోవచ్చు. నాన్‌వెజ్‌లో ప్రొటీన్స్, ఐరన్, కాల్షియం, విటమిన్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి తల్లికి, బిడ్డకి ఇద్దరికీ ఎంతో ముఖ్యం. వీటివల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది. కాబట్టి ఎంతో కొంత నాన్‌వెజ్‌ ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవటం మంచిది. అంతేకాని అసలు తీసుకోకూడదు అని ఏమీలేదు. కాకపోతే ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, వారి అరుగుదలలో ఏమైనా సమస్యలు, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, డాక్టర్‌ సలహా మేరకు నాన్‌వెజ్‌ తీసుకోవటం మంచిది.

 ప్రెగ్నెన్సీ సమయంలో అదనంగా ఐరన్‌ అవసరం అని విన్నాను. ఈ సమయంలో ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి? ‘ప్రెగ్సెన్సీ డైట్‌’ అంటే ఏమిటి? దీని గురించి కాస్త వివరంగా చెప్పండి.
– ఆర్‌.డి, ఏలూరు

ప్రెగ్నెన్సీ సమయంలో, జరిగే మార్పులలో భాగంగా, రక్తం పల్చబడుతుంది. అలాగే తల్లి నుంచి రక్తప్రసరణ ద్వారా బిడ్డకి కావాల్సిన పోషకాహారం, గాలి, శ్వాస అన్నీ అందుతాయి. రక్తంలో ఉండే ఐరన్‌ శాతం బట్టి హిమోగ్లోబిన్‌ అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను అందిస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో తల్లికి, బిడ్డకి ఇద్దరికీ కూడా ఐరన్‌ ఎక్కువ అవసరమవు తుంది. ఐరన్‌ ఖనిజం ఆహారం ద్వారా రక్తంలోకి చేరుతుంది.

ఆహారంలో ఉన్న ఐరన్‌లో కేవలం 15–25% మటుకే రక్తంలోకి చేరుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో అదనంగా ఐరన్‌ అవసరమవుతుంది. అది కేవలం పోషకాహారం ఎక్కువగా తీసుకోవడంతో సరిపోదు. తాజా కూరగాయలు, పప్పులు, క్యారెట్, బీట్‌రూట్, బీన్స్, ఖర్జూరం, అంజీర, దానిమ్మ, బొప్పాయి పండ్లు, బెల్లం, వేరుశనగపప్పు వంటివి క్రమంగా తీసుకుంటూ ఉంటే ఐరన్‌ శాతం పెరుగుతుంది. అదే మాంసాహారులు అయితే, కీమా, మటన్, లివర్, ఎముకల సూప్‌ వంటివి తీసుకోవచ్చు. శాకాహారంలో కంటే మాంసాహారంలో ఉండే ఐరన్‌ ఎక్కువగా రక్తంలోకి చేరుతుంది.

ప్రెగ్నెన్సీలో తల్లికి, బిడ్డకి సరిపడే పౌష్టికాహారం ఒకేసారిగా ఎక్కువగా కాకుండా, కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి. ఈ సమయంలో పైన చెప్పిన ఆహారంతో పాటు పాలు, పెరుగు, మజ్జిగ, మంచినీళ్లు కనీసం 3 లీటర్లు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ డైట్‌ అనేది ఒక్కొక్కరి బరువును బట్టి, వారి తల్లిదండ్రులలో బీపీ, షుగర్‌ వంటివి ఉన్నాయా అనే అనేక అంశాలను బట్టి చెప్పటం జరుగుతుంది.


నాకు ఆటలంటే చాలా ఇష్టం. ఎక్సర్‌సైజ్‌లు కూడా ఎక్కువగా చేస్తుంటాను. అయితే నాకు ఈమధ్య ఒక విషయం తెలిసింది. ఆటలు, ఎక్సర్‌సైజ్‌ల వల్ల పీరియడ్స్‌పై ప్రభావం పడుతుందని. ఇది ఎంత వరకు నిజం?  hypothalamic amenorrhea అంటే ఏమిటి?
– జి.కె. నిజామాబాద్‌

రెగ్యులర్‌గా ఆడే ఆటలు, ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ, ఆహారం మితంగా తీసుకోవటం వల్ల పీరియడ్స్‌లో ఇబ్బందులు ఉండవు. విపరీతమైన ఎక్సర్‌సైజులు, అతిగా డైటింగ్, శరీరంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల పీరియడ్స్‌ క్రమం తప్పడం, తర్వాత తర్వాత పీరియడ్స్‌ మొత్తానికే ఆగిపోవడం జరుగుతుంది. అధిక శారీరక ఒత్తిడి, ఒంట్లో కొవ్వు లేకపోవటం వల్ల, కార్టిసాల్‌ అనే స్ట్రెస్‌ హార్మోన్‌ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది మెదడులోని హైపోథలామస్‌ అనే భాగంపై ప్రభావం చూపి, దాని నుంచి వచ్చే జీఎన్‌ఆర్‌హెచ్‌ హార్మోన్‌ విడుదలని మెల్లగా ఆపేస్తుంది. దానివల్ల పిట్యుటరీ గ్లాండ్, అండాశయాలు విడుదలయ్యే ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరోన్‌ వంటి హార్మోన్ల విడుదల మెల్లగా తగ్గిపోయి, పీరియడ్స్‌ క్రమం తప్పుతూ వచ్చి, అసలుకే రాకుండా ఆగిపోతాయి. అలా హైపోథలామస్‌ వంటి హార్మోన్లు తగ్గిపోవడం వల్ల పీరియడ్స్‌ ఆగిపోవడాన్ని hypothalamic amenorrhea అంటారు. విపరీతమైన డైటింగ్, బరువు ఉన్నట్లుండి బాగా తగ్గిపోవడం, తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడి, మెదడులో కంతులు, జన్యుపరమైన కారణాలు వంటి అనేక ఇతర కారణాల వల్ల కూడా హైపోథలామస్‌ సరిగా పనిచెయ్యకపోవడం వల్ల hypothalamic amenorrhea వస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement