నేను, నాన్న, బిర్యానీ | Sakshi
Sakshi News home page

నేను, నాన్న, బిర్యానీ

Published Sun, Apr 13 2014 4:31 AM

నేను, నాన్న, బిర్యానీ

కథ

 బాగా ఆకలైనప్పుడు అన్నం తింటే ఏముంటుంది ఆనందం! బిర్యానీ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో చికెన్ బిర్యానీ అయితే చంపేసిద్ది. మిట్ట మధ్యాహ్నం ఒంగోలు ఇస్మాయేల్ బిర్యానీ హోటల్ ఏసీలో కూర్చుని, చొక్కా పైగుండీ విప్పదీసి, కాలర్ పెకైగరేసి, ఎడమ చేతిలో మూత తీసిన చల్లని పెప్సీ బాటిల్ పట్టుకుని, వేడి వేడి చికెన్ బిర్యానీలో కొంచెం సారువా పోసి, దాని మీద నిమ్మకాయ పిండుకొని, రెండు ఉల్లిపాయ ముక్కలని ముద్దలో గుచ్చి, మెత్తటి చికెన్ ముక్కని సుతిమెత్తగా తుంచి ముద్దతో పాటు నోట్లో పెట్టుకుంటే, అబ్బా! దీనెమ్మ జీవితం...
 ‘‘సార్ ఏంద్సార్ నవులుతున్నారు’’ ఒక్కసారిగా నా బిర్యానీ ప్లేటును లాగేసుకున్నట్లుగా అడిగాడు ముందు లైన్లో కూర్చున్న పొట్టెంకటేసుగోడు.
 పిల్లలందరూ పకపక నవ్వారు.
 
 ఇస్మాయేల్ హోటల్లో ఉండాల్సిన నేను కందులూరు నిర్మల్ విద్యానికేతన్ స్కూల్లోకొచ్చేశాను.
 ‘‘వోయ్ నవ్వింజాల్లే చదువుకోండి’’ అన్నాను బెత్తం తీసుకొని కుర్చీలోంచి పైకి లేస్తూ. పావురాలన్నీ ఒక్కసారిగా లేచినట్టు శబ్దం చేస్తూ చదవడం మొదలెట్టారు పిల్లలు.
 
 టైమ్ చూస్తే 12 గం॥15 ని॥స్కూల్ వదలడానికి ఇంకో పదిహేను నిమిషాలుంది. ‘ఈ రోజు ఎలాగైనా బిర్యానీ తినాలి’. ఇస్మాయేల్ హోటల్లో బిర్యానీ తిని ఇప్పటికే వారం రోజులయ్యింది.
 బాగా ఆకలైనప్పుడు ఎవ్వరికీ చెప్పకుండా ఇస్మాయేల్ హోటల్‌కెళ్లి బిర్యానీ తినడం నాకు అలవాటు. ‘కందులూరు నుంచి ఒంగోలు పోవడానికి బస్సులో అయితే ఇరవై అయిదు నిమిషాలు పడుతుంది. డిపో నుంచి హోటల్‌కి పోవడానికి నడుచుకుంటూ వెళ్తే పది నిమిషాలు, బిర్యానీ తింటానికి ఎంత లేదన్నా పది నిమిషాలు... మొత్తం కలిసి నలభై ఐదు నిమిషాలు. అంటే పోను, రాను గంటన్నర. మధ్యాన్నం పొస్టు బెల్లు ఒకటింబావుకి. అబ్బా టైం సరిపోదే!’
 
 బాగా ఆకలవుతోంది. ఎట్టాగబ్బా? పోనీ సోషల్ సార్‌ని బండి అడిగితే? గంటలో పోయి రావచ్చు. మెరుపు లాంటి ఐడియా మైండులోకొచ్చింది.
 
 ‘‘ఏంద్సార్! ఒక్కరే నవ్వుకుంటున్నారు’’ ఇంకోసారి నా ఆలోచనలకి బ్రేక్ వేశాడు పొట్టెంకటేసుగోడు. చిర్రెత్తుకొచ్చింది నాకు. పిర్రమీద ఒక్కటేసేసరికి రుద్దుకుంటూ వెళ్లి వాడి చోట్లో కూర్చున్నాడు. పిల్లలందరూ పకపక నవ్వారు.
 
 ‘‘రేయ్ చదవండ్ర’’ పెద్దగా అరిచాను. ఇంకోసారి పావురాలు ఎగిరాయ్.
 ‘‘రేయ్! ఎవురూ అరవకండ్రా. మర్యాదగా చదువుకోండి ఇప్పుడే వస్తా. రేయ్ పొట్టెంకటేసుగా, అరిసినోల్ల పేర్లు బోర్డుమీద రాయ్’’ అంటూ సోషల్ సార్ ఉన్న ఐదో క్లాసు రూమ్ వైపుకు కోడిలాగా ఎగురుకుంటూ పోయాను.
 
 సోషల్ సార్ పిల్లల వీపులు సాపు చేస్తున్నాడు. ఎందుకైనా మంచిదని ‘‘సోషల్ సార్ ఇటు రండి’’ అని కిటికీ గుండా పిలిచాను. పిల్లలందరూ నన్ను తొంగి తొంగి చూస్తున్నారు.
 ‘‘ఏంద్సార్’’ అంటూ కిటికీలోంచే అరిశాడు సోషల్ సార్.
 ‘‘ఒక్కసారి బయటకు రండి. మీతో పనుంది’’ అన్నాను.
 ‘‘సరే వస్తన్న ఆగండి. రేయ్ మీరు సదువుకుంటా ఉండండ్రా, ఇప్పుడే వస్తా. మాయ్ ఉషారాణి బోర్డుమీద అరిసినోల్ల పేర్లు రాయ్’’
 బయటకొస్తున్నాడు సోషల్ సార్. బండిస్తాడో ఇయ్యడో అనే భయం గుండెల్లో పీకుతోంది. దానికితోడు మొన్న ‘నేను లేటుగా వస్తాను, ఐదో క్లాసుని నాలుగో క్లాసుతో కంబైన్డ్ చేసుకో’మంటే ‘ఆయ్ కుదర్దు’ అన్నాను. ఇప్పుడేమంటాడో!
 ‘‘ఏంద్సార్ పిలిచారు’’
 ‘‘మీరు నాకొక చిన్న హెల్ప్ చెయ్యాల్సార్’’ అన్నాను నవ్వుతూ.
 ‘‘బండి తప్ప ఏ హెల్పయినా అడగండి సార్, చేసేద్దాం’’ అని ఆఫర్ ఇచ్చాడు.
 గుండెల్లో రెండు పింగాణీ ప్లేట్లు పగిలిన సౌండ్ వచ్చింది ఆయన మాటలకు.
 ‘‘అయ్యో నాక్కావల్సిందే బండి సార్’’ అన్నాను నవ్వుతూ తల్లో గీక్కుంటూ.
 ‘‘నా బండి మీరు నడపలేరు సార్. అది నాకే వల్ల కాదు’’ అన్నాడు నవ్వుతూ, నవ్వు నటిస్తూ.
 ‘అదేమన్నా ఇమానమా నడపలేకపోవటానికి’ అనుకున్నాను మనసులో.
 ‘‘ఎనగ్గేర్లే కదా నాకు నడపటం వచ్చు సార్. మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదని ఫోనొచ్చింది. అర్జెంటుగా ఒంగోలు పోయిరావాలి’’ అని అబద్ధం చెప్పాను ఆ టైమ్‌కు ఏది గుర్తురాక.
 ‘‘అయ్యయ్యో! అవునా? సరే పోయి రండి. బండి జాగ్రత్త సార్’’ అన్నాడు తాళాలిస్తూ.
 ఆనందంలో క్లాసు రూమ్‌కొస్తుంటే, మూడో క్లాసు దొడ్ల ప్రియాంక కనపడింది. అబద్ధం చెప్పినందుకు నేను కొట్టిన దెబ్బల తాలూకు వాతలు ఇంకా తగ్గలేదు ఆ పిల్ల చెంపల మీద.
 నా క్లాసు రూమ్‌లోకి పోయేసరికి పొట్టెంకటేసుగోడు అందరి పేర్లు బోర్డు మీద రాశాడు, వాడి పేరు తప్ప. ‘‘సార్, అందరూ తెగ మాట్లాడుకుంటున్నార్సార్’’ అని కంప్లయింట్ చేశాడు. అందరూ నిలబడండ్రా అని బెత్తం తీసుకునేలోపే అన్నం బెల్లు కొట్టారు. అందరి కంటే ముందు స్కూల్ గేటు దాటింది నేనే. ఛలో ఒంగోలు!
    
 మిట్ట మధ్యాహ్నం కూడా గాలి చల్లగా తగులుతోంది బండి ముందుకు పోతుంటే.
 ఛ బండి కోసం నాన్నకి బాగాలేదని అబద్ధం చెప్పానే! సడన్‌గా ఆలోచన మనసులో దూరింది. పాపం నాన్న పొద్దున్నే అడిగాడు ‘వంద రూపాయలుంటే ఇయ్యరా, ఒంగోలు బోవాలీ’ అని. ‘లేవు' అని పచ్చి అబద్ధం చెప్పాను, జేబులో ఐదువందల రూపాయలున్నా.
 ‘‘వొమేయ్, సుబ్బయ్యని ఒక రెండొందలడిగే. తర్వాతిద్దాం’’ అని అమ్మను పురమాయించాడు. బతికిపోయాన్రా దేవుడా అని బడికొచ్చాను.
 ఎండ విపరీతంగా కాస్తోంది. ఫోర్త్ గేర్లో పోతున్న నాకు మాత్రం కోడి ఈకలతో తయారుచేసిన వింజామరలతో విసురుతున్నంత హాయిగా ఉంది.
 న్యూట్రల్‌కొచ్చింది బండి ఇస్మాయేల్ బిర్యానీ హోటల్ ముందు. మా నాన్న గురించి ఆలోచించుకుంటూ వచ్చేసరికి టైమే తెలియలేదు. భలే టైమ్‌పాస్ అయింది అనుకున్నాను, బండి సెంటర్ స్టాండ్ వేస్తూ. అప్పుడే బిర్యానీ తిని బ్రేవ్‌మని తేపుకుంటూ బయటకొస్తున్న పెద్దమనిషి తలుపు తెరిచేసరికి బిర్యానీ వాసన విదిలించి కొట్టింది. ఆకలి రెట్టింపయ్యింది.
 సైడ్ లాకేసి, తాళం జేబులో పెట్టుకుంటుంటే ‘అబ్బాయ్' అని భుజం మీద చెయ్యి పడింది. వెనక్కి తిరిగి చూస్తే నాన్న! బిర్యానీ వాసన మాయమయ్యింది, షాక్‌లోనో తలుపు మూసుకోనో.
 ‘‘ఏందయ్యా ఇంతెండలో ఒంగోలొచ్చా?’’
 ‘నీకెందుకయ్యా' అనుకున్నాను మనసులో.
 ‘‘ఏంద్రా ఎందుకొచ్చావ్?’’ అన్నాడు నవ్వుతూ. అది ఏమాత్రం కల్మషం లేని నవ్వు.
 ‘‘పనుండొచ్చా'' నాది మాత్రం ప్లాస్టిక్ నవ్వు.
 ‘‘మరిక్కడాగావేంది?’’ అన్నాడు.
 బిర్యానీకని చెప్తే ‘పొద్దునడిగితే వంద రూపాయల్లేవన్నావ్. ఇప్పుడు నూట ఇరవై రూపాయలు పెట్టి బిర్యానీ తింటానికొచ్చావా?’ అంటాడేమోనని, ‘‘ఇక్కడ నాకేం పని లేదు. నిన్ను చూసే ఆగె’’ అని మరో అబద్ధం ఆడాను.
 ‘‘అన్నం తిన్నావా లేదా మొఖం పీక్కబోయి కనపడతంది’’ అన్నాడు.
 ‘‘నేను తింటాలే. నువ్వు నీ పనికిబో’’ అన్నాను. ఇంకొకడెవడో హోటల్ తలుపు తెరిచాడు. వాసన గప్పున ముక్కు కంటింది. నువ్వు తిన్నావా అని అడగాలనుకున్న మా నాన్నని, తినలేదు అంటే బిర్యానీ తినిపించాల్సిస్తుందేమోనని భయమేసి అడగలేదు.
 ‘‘నేనొచ్చిన పని అయిపోయింది. మరి నువ్వొచ్చిన పని అయిపోయిందా?’’ అన్నాడు.
 ‘‘అవ్వలేదు'' అన్నాను.
 ‘‘ఎంతసేపట్లో అయిపోద్ది’’ అన్నాడు. ‘నువ్వొదిలితే పది నిమిషాల్లో అయిపోద్ది. శనిలాగ దాపురించావు కద సామె’ అనుకున్న మనసులో. ‘‘నువ్వు ఇంటికి బో. నేను నా పని చూస్కొని వస్తా’’ అన్నాను బండి బయటకు తీస్తూ.
 ‘‘బండెవరిది?’’ అన్నాడు.
 ‘‘సోషల్ సార్‌దిలే’’ అన్నాను.
 ‘‘ఆయన బండెవరిని తాకనివ్వడు. అట్టాంటిది నీకెట్టిచ్చాడబ్బ’’ అన్నాడు ఆశ్చర్యంగా.
 సోషల్ సార్ బండిని బంగారంలాగా చూసుకుంటాడని ఊరందరికీ తెలుసు.
 ‘‘ఎట్టోకట్టిచ్చాడ్లే. నువ్వు బో. నాకు టైమ్ అవుతుంది’’ అన్నాను ఇసురుగా.
 ‘‘నన్ను కొంచెం బస్టాండ్ దాక వదిలిపెట్టకూడదా’’ అన్నాడు.
 చిర్రెత్తుకొచ్చింది. స్కూల్లో పిల్లాడైతే ఈపాటికి పిర్ర పగిలిపోయేది.
 ‘‘సరే రా కూర్చో’’ అన్నాను తొందరగా వదిలించుకోవాలని. బిర్యానీ వాసన దూరమయ్యింది.
 సరిగ్గా తులసీరాం హాల్ దగ్గరకు వచ్చేసరికి ‘‘ఇక్కడాపు ఇక్కడాపు’’ అని అరిచాడు నాన్న. ‘‘ఏందిక్కడ'' అన్నాను కోపంగా.
 ‘‘అన్నం తిన్లేదంటివి, రా... ఇక్కడ తిందాం. ఈ సాయిబు దగ్గర బిర్యానీ బలే వుండిద్ది’’ అని చెయ్యి పట్టుకున్నాడు. ఆ చేతి చల్లని స్పర్శలోని ప్రేమ నా కఠిన హృదయాన్ని కమ్మగా కౌగిలించుకుంది. ‘‘ఇంతసేపూ అన్నం తినకుండా ఉంటే ఎట్టా. ఎన్ని పన్లున్నా ముందు అన్నం తిన్నాకే చేస్కోవాలి. రా ఆ బండి పక్కన పెట్టు’’ అన్నాడు సాయిబుకి రెండు ప్లేటు బిర్యానీలు ఆర్డరిస్తూ.
 ‘నేను పోతాలే’ అందామనుకున్నాను కాని మాట బయటకు రాలేదు. గొంతుకు ఏదో అడ్డం పడింది. బహుశా అది గిల్టీ ఫీలింగ్. నాన్న మొఖాన్ని చూడలేకపోయాను.
 ‘‘ఇదిగో తీస్కో’’ అన్నాడు ప్లేటు చేతికిస్తూ. ‘‘సాయిబు దగ్గర బిర్యానీ బలే ఉంటుంది, ఈ ముక్కలు చూడు ఎంత మెత్తగా ఉడికినియ్యో. నాకు కోడి కాలొచ్చింది. నువ్వేసుకో, నాకు పల్లు గట్టిగా లెవ్వులే. ఆ సారువా ఏసుకొని నిమ్మకాయ పిండుకోని ఉల్లిపాయ నంజుకో. బలే ఉండిద్ది’’ అన్నాడు తన ప్లేటులో చికెన్ ముక్కలు నాకేస్తూ.
 ఏడుపు తన్నుకొచ్చింది. చేతిలో అన్నం ప్లేటు కనిపించలేదు, కళ్లకు నీళ్లు అడ్డంపడి.
 అది చూసి, ‘‘ఈ సాయిబు దగ్గర బిర్యానీ కొంచెం మంటగా ఉండిద్ది. మసాలెక్కువేస్తాడు’’ అన్నాడు మంచినీళ్లు చేతికిస్తూ. ఆ నీళ్లు తాగుతుంటే, కొన్ని వేల ఏసీల చల్లదనమంత ప్రేమ గొంతులోంచి జారి గుండెల్లో చేరింది.
 ‘‘సాయిబూ ఖాతా రాసుకో. రేపిస్తా’’ అని నావైపు తిరిగి, ‘‘అబ్బాయ్! ఇక నువ్వు నీ పనికి బో. నేను ఇంటికి బస్సులో పోతాలే. బిర్యానీ తిన్నామని అమ్మకు చెప్పబాక. ఆశపోద్ది ఏడ్చిద్ది’’ అన్నాడు డిపో వైపుకు నడుస్తూ మా నాన్న. ఆరడుగుల ప్రేమ నడుస్తూ పోతున్నట్లనిపించింది. ఇస్మాయేల్ బిర్యానీ కంటే సాయిబు బిర్యానే అద్భుతంగా అనిపించిందా రోజు, ఎందుకనో -

Advertisement

తప్పక చదవండి

Advertisement