ఏసీ సోఫా | Sakshi
Sakshi News home page

ఏసీ సోఫా

Published Sun, Nov 29 2015 1:01 AM

దశరథ్ పటేల్

భలే బుర్ర
ఏసీ రూమ్‌లో సోఫాలు వేసుకుని, వాటిలో కూర్చుని సేదదీరడంలో ఏమంత వెరైటీ లేదు. రూమ్‌కు బదులు నేరుగా సోఫాకే ఏసీని ఏర్పాటు చేసుకుంటే..? అదే వైరైటీ. గుజరాత్‌కు చెందిన మెకానిక్ దశరథ్ పటేల్ ఏదైనా వెరైటీగానే ఆలోచిస్తాడు. ఆలోచించినదేదైనా ఆలస్యం లేకుండా ఆచరణలో పెట్టేస్తాడు. ఇతగాడి వెరైటీ ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఫొటోలో కనిపిస్తున్న ఏసీ సోఫా. సాధారణంగా ఎక్కడైనా ఏసీ ఇన్‌డోర్ ఏర్పాటు మాత్రమే. ఔట్‌డోర్‌కు వర్కవుట్ కాదు.

అయితే, ఔట్‌డోర్‌లోనూ ఏసీ వర్కవుటవు తుందని నిరూపించాడు దశరథ్ పటేల్. మండు వేసవిలో సైతం ఆరుబయట ఎంచక్కా ఈ సోఫాలో కూర్చుంటే, చల్లచల్లని కూల్ కూల్ ఏసీ సౌఖ్యాన్ని హాయిగా ఆస్వాదించ వచ్చు. ఈ ఏసీ సోఫా కేవలం నిమిషం వ్యవధిలోనే చల్లదనాన్ని సృష్టించగలదు. పదో తరగతితో చదువు మానేసిన దశరథ్, 2007 వేసవిలో గాంధీ నగర్‌లో జరిగిన బంధువుల పెళ్లి వేడుకకు వెళ్లాడు.

ఆరు బయట టెంటు కింద వేసిన కుర్చీలు, సోఫాల్లో కూర్చున్న అతిథులంతా ఉక్కపోతతో అల్లాడిపోవడం చూశాడు. అప్పుడే అతడి మదిలో మెదిలింది ఏసీ సోఫా ఆలోచన. ఏసీలు బాగుచేయడంలో తనకున్న ఇరవయ్యేళ్ల అనుభవాన్ని రంగరించి, ఏసీ సోఫాకు రూపకల్పన చేశాడు. దీని తయారీకి కలప బదులు పీవీసీ పైపులను, ఫైబర్‌ను ఉపయోగించాడు. దానికి చిన్నసైజు ఏసీని అమర్చాడు. అందుకే ఇది ఎంతో తేలికగా ఉంటుంది. ఎటు కావా లంటే అటు ఈజీగా లాక్కెళ్లిపోవచ్చు. పైగా ఇది కేవలం 250 వాట్ల విద్యుత్తుతో పని చేస్తుంది. అంటే మామూలు ఏసీకీ ఖర్చయ్యే కరెంటులో పదిశాతమే!      

Advertisement
Advertisement