నారా చంద్రబాబునాయుడు రాయని డైరీ | Sakshi
Sakshi News home page

నారా చంద్రబాబునాయుడు రాయని డైరీ

Published Sun, Apr 19 2015 1:40 AM

నారా చంద్రబాబునాయుడు  రాయని డైరీ

 కాళ్ల వాపు తగ్గలేదు. ఏజింగ్ ప్రాబ్లమా అని అడిగితే, కాదు బీజింగ్ ప్రాబ్లం అన్నాడు డాక్టర్. బహుశా చైనాలో రోడ్లన్నీ... గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మాదిరిగా... బాగా లాంగ్ అయి ఉండాలి. ఉపప్రధాని వాంగ్ యాంగ్ కూడా! మనిషి చూడ్డానికి పట్టిసీమలా ఉన్నా, ముందుచూపులో పోలవరంలా ఉన్నాడు. ‘అమరావతిలో ఇన్వెస్ట్ చెయ్యండి సార్’ అంటే, ‘కష్టం నాయుడుగారూ’ అన్నాడు! ‘అదేంట్సార్’ అని అడిగితే ‘సింగపూర్‌కి ఇచ్చిన కాంట్రాక్టేదో మావాళ్లకే ఇవ్వొచ్చు కదా’ అన్నాడు. ‘అలాక్కాద్సార్... వాళ్లు కట్టిపెడతారు. మీరు కొట్లు పెడతారు’ అన్నాడు పరకాల.. వాంగ్ యాంగ్‌తో. ‘మీరు కొట్లు పెట్టమన్నట్టు లేదు. కోట్లు పెట్టమన్నట్టు ఉంది’’ అన్నాడు వాంగ్ యాంగ్. ‘లేద్సార్, ఇటుక, సున్నం, సిమెంట్, తారూ కంకర సప్లయ్ అంతా మీదే. జస్ట్ ప్లానింగ్ ఒక్కటే సింగపూర్ వాళ్లది’ అని చెప్పాడు యనమల. వాంగ్ యాంగ్ కన్విన్స్ అవలేదు. ‘సార్, అమరావతికీ, బుద్ధుడికీ చాలా పెద్ద లింకులున్నాయి సార్. మా దేశపు మాంక్ నాగార్జున మీ దేశానికొచ్చి ప్రచారం కూడా చేశాడ్సార్’ అన్నాడు అచ్చెన్నాయుడు. ఆ ఎమోషన్‌కి  వాంగ్ యాంగ్ షేక్ అయ్యాడు. హ్యాండ్‌షేక్ ఇచ్చాడు.
 చైనాలో ఉన్నన్ని డ్యాములు ఇంకెక్కడా లేవని చివరి రోజు మేము చైనాలో ఉన్నప్పుడు లోకేశ్‌బాబు ఫోన్ చేసి చెప్పాడు. ప్రపంచంలో పెద్ద డ్యామ్ ‘త్రీ గోర్జెస్’.. చైనాలోనే ఉందట. ‘వచ్చేటప్పుడు దాన్ని చూసి రండి డాడ్’ అన్నాడు లోకేశ్‌బాబు. డ్యాముని కట్టిన వాళ్లని చూడాలి గానీ, డ్యాముని ఏం చూస్తాం?

 గూగుల్‌లో కొట్టి చూస్తే డ్యామ్‌ని కట్టిన కంపెనీ పేరు కనబడింది. ఆ కంపెనీ మనకెలా వర్కవుట్ అవుతుందా అని ఆలోచిస్తుంటే లోకేశ్‌బాబు నుంచి మళ్లీ ఫోన్. ‘డ్యామ్‌ని ఇంకా చూళ్లేదు బాబూ’ అన్నాను. ‘డ్యామ్ ఇట్ డాడ్... మీరక్కడ అమరావతి అమరావతి అంటూ చైనా వాళ్ల వెంటపడి తిరుగుతున్నారు. జగన్ ఇక్కడ పట్టిసీమ, పోలవరం అంటూ రైతుల్ని వెంటేసుకుని తిరుగుతున్నాడు. కొంపలు ముంపుకు గురయ్యేలా ఉన్నాయి డాడ్’ అన్నాడు.

 ఇండియా వచ్చేశాం. జగన్ ఆగట్లేదు. ఆపడం ఎలా? నీటిని అదుపు చేసేందుకు డ్యామ్‌లు ఉంటాయి కానీ, ప్రతిపక్షం నోటికి అడ్డుకట్టవేసే డ్యామ్‌లు ఉంటాయా? ఇంకా నయం... వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాల్లా... వేసవికాల సమావేశాలు లేవు. ‘వాపును చూసి ఇంకేదో అనుకోవద్దని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్షా’ అని అసెంబ్లీ హాల్లో నా వాపుపై కామెంట్ చేసినా చేస్తాడు జగన్.

- మాధవ్ శింగరాజు

Advertisement
Advertisement