చేసంచిని కవర్ చేయొద్దు..! | Sakshi
Sakshi News home page

చేసంచిని కవర్ చేయొద్దు..!

Published Fri, Apr 3 2015 1:44 AM

చేసంచిని కవర్ చేయొద్దు..!

మా పక్కింటావిడ రోజూ పూజకు పువ్వులు కొంటుంది. నిజానికి ఆ పూలు హోమ్ డెలివరీలో ఇంటికే వస్తాయి. రోజూ పూలబ్బాయి అరుపు వినపడగానే ఆవిడ బాల్కనీ నుంచి ఆ రోజుకు కావాల్సిన పువ్వులు ఆర్డర్ ఇస్తుంది. టకటకా పూలను తూకం వేసి కవర్లో కట్టి గుమ్మం వరకు వెళ్లి అందిస్తాడు ఆ అబ్బాయి. ఇది ప్రతి రోజూ మారని రొటీన్. కొన్నేళ్లుగా సాగుతోంది.
 
రోజూ పువ్వులొస్తాయి.. రోజూ వాటిని మోసుకొస్తూ ఓ ప్లాస్టిక్ కవరొస్తుంది. కింద నుంచి పై వరకూ వచ్చే భాగ్యానికి మళ్లీ ప్లాస్టిక్ సంచీ ఎందుకు అని ఆవిడకు తట్టదు. నాలుగణాలు ఎక్కువైనా బేరం పోవద్దని ఆ పూలబ్బి తిప్పలు. ఈ మధ్యలో నాలాంటి థర్డ్ పార్టీ ఎవరైనా కల్పించుకుంటే ఇద్దరికీ గిట్టదు. ఏడాదికి 365 కవర్లతో నేను చూసిన ఐదేళ్లలో ఆవిడ కవర్ల సంపద 1,825. ఇలాంటి ఇళ్లు మన హైదరాబాద్‌లో ఎన్ని ఉన్నాయ్, అన్ని కవర్లూ ఎక్కడికి చేరుతున్నాయ్.. ఆలోచించండి. కేవలం ఈ ఒక్క సందర్భంలోనే కాదు అనాలోచితంగా, అప్రయత్నంగా మనం కవర్ల ఉచ్చులో చిక్కుకుపోయాం. చిన్నపాటి అవసరాలకు చేతి సంచినో, బుట్టనో వాడటం అనే సంస్కృతిని  మర్చిపోయాం.

మానస సంచిరరే..

మార్కెట్‌కి వెళ్తూ తప్పనిసరిగా సంచి పట్టుకెళ్లే రోజుల నుంచి డబ్బులు కూడా అక్కర్లేకుండా వట్టి చేతులతో.. జేబులో కార్డుతో వెళ్తున్నాం.. కవర్లతో తిరిగొస్తున్నాం. అయితే ప్రభుత్వం 40 మైక్రాన్ల మందం పాలిథిన్ కవర్లు వాడాలని రెగ్యులేషన్ పెట్టాక, కవర్లకు దుకాణదారులు చార్జి చేయడం మొదలుపెట్టాక.. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు తిరిగి చేతి సంచి వైపు చూస్తున్నారు. ఎంత మనం సంచి పట్టుకెళ్లినా గ్రాసరీ షాపులో ఉప్పులు, పప్పులన్నీ ప్లాస్టిక్ ప్యాకింగుల్లోనే కొలువుదీరుతున్నాయి. ఎంత వద్దన్నా.. మన వెంట పాలిథిన్ వస్తూనే ఉంది. అందుకని మనవంతు కొంత తగ్గించే అవకాశం ఎందుకు వదులుకోవాలి. ప్యాకింగ్‌కు వాడే మెటీరియల్ కొంత వరకూ రీసైక్లింగ్‌కి వీలు పడుతుంది. కానీ చిన్నని, పల్చని పాలిథిన్ సంచుల్లో పది శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. అక్కడ కనుక మన వంతు బాధ్యతగా మనం వాడకం తగ్గిస్తే చాలా పెద్ద మార్పు తేవచ్చు.

రీసైక్లింగ్‌కు ప్యాక్‌అప్

చిన్నప్పుడు కిరాణాకొట్లో పచారీలు కొంటే న్యూస్‌పేపర్లో పొట్లం కట్టి దారంతో చుట్టి మన బుట్టలో పెట్టేవారు. ఆ ప్యాకింగ్ అంటే ఎంత అబ్బురంగా అనిపించేదో. ఎంత ప్రయత్నించినా.. అలా ప్యాకింగ్ చేయడం కుదిరేది కాదు. ఇప్పుడు ఆ కిరాణం తగ్గింది. సూపర్ షాపింగ్ సంప్రదాయం వచ్చేసింది. అన్ని వస్తువులు కనబడేలా పారదర్శక పాలిథిన్‌లలో ప్యాకింగ్ చేస్తున్నారు. టైమ్, కన్వీనియన్స్ రెండూ కలిసొస్తాయి సరే, కానీ ఈ మధ్యలో పర్యావరణ స్పృహ తప్పిపోతోంది. పాల బాటి ళ్ల రోజులు పోయి.. ప్యాకెట్లు వచ్చిన కొత్తల్లో ఆ పాల ప్యాకెట్లను దాచి పాతపేపర్లు కొనేవారికి అమ్మి డబ్బులు తీసుకునే అలవాటు ఉండేది. దానిపై వచ్చే ఆదాయం చులకనగా అనిపించి మెల్లగా ఆ సంప్రదాయాన్నీ మానేశాం. అది డబ్బులతో కొలవలేని గొప్ప కల్చర్. మనకు రీసైక్లింగ్ గురించి తెలియని రోజుల్లోనే మన బాధ్యతను చక్కగా నిర్వర్తించాం. మన ప్లాస్టిక్‌ని, పేపర్‌ని, ఇనుమును, గాజును వేరు చేసి మనమే స్వయంగా స్క్రాప్‌కి పంపించే వాళ్లం. ఇప్పుడు పర్యావరణం గురించి అవగాహన ఉంది కానీ, కార్యాచరణ మాత్రం మారిపోయింది. పాల ప్యాకెట్లు పోగేసి రీసైకిల్ చేసే ఇళ్లేవి..? పోనీ అమ్ముకోకపోయినా.. కనీసం మన వంతు బాధ్యతగా రీసైకిల్ చేద్దాం అన్న కల్చర్ మనం నేర్చుకోవాలి.
 
బ్యాగుబాగు..

ప్రతి దానికీ ప్యాకింగ్ అలవాటు చేసుకున్నాం. ఒకప్పుడు బిగ్‌షాపర్ బ్యాగులైనా ఉండేవి. ఇప్పుడు అవి ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయాయట. పోనీ మారిన ఫ్యాషన్‌కు తగ్గట్టు కొత్త సంచులను డిజైన్ చేసుకోవచ్చుగా..! అసలు ఆలోచన అటు వెళ్తేగా, వాటి అవసరం గుర్తిస్తేనే కదా కొత్త డిజైన్లు వచ్చేవి. కొత్త వింత కావొచ్చు.. కొన్ని పాత పద్ధతులను కొత్తగా నేర్చుకుందాం. బజారుకు వెళ్లినప్పుడు చేతి సంచితోనే వెళ్దాం. మనవల్ల తయారైన చెత్తకు రీసైకిల్ దారి చూపిద్దాం.  ఐ లవ్ హైదరాబాద్.
 

Advertisement
Advertisement