కళబోత | Vidhya iyer will come to hyderabad in this week | Sakshi
Sakshi News home page

కళబోత

Published Mon, Nov 13 2017 12:15 AM | Last Updated on Mon, Nov 13 2017 2:54 AM

Vidhya iyer will come to hyderabad in this week - Sakshi

ఈ ఈస్ట్‌కి ఆ వెస్ట్‌కి రాగాల దారాలల్లింది. ఇక్కడి రెహమాన్‌కి... అక్కడి చియారాకి బంధం కలిపింది. స్వర సంకరం అన్నారామె నాన్న. అపస్వరం రానివ్వనన్నది విద్య. ఇవేం రాగాలు అన్నారు విన్నవాళ్లు. మాషప్‌ రాగాలు అందా పాతికేళ్లమ్మాయి. విద్యా వోక్స్‌... ఈ వారం హైదరాబాద్‌కొస్తోంది.. రాగాల హరివిల్లును ఆవిష్కరించడానికి! ఇది ఈ మాషప్‌ క్వీన్‌ అల్లిన సంగీత కళబోత!

వజ్రాలు, బంగారం.. గోరింటాకు, గాజులు.. సో బ్యూటిఫుల్‌! ఒక ఏంజెల్‌లా ఉంది ఆ అమ్మాయి. చుట్టూ బలహీనమైన పురుష హృదయాలు ఉంటాయేమోనన్న కనికరం లేకుండా.. కేర్‌లెస్‌గా డ్యాన్స్‌ చేస్తోంది. (బై ది వే.. ఇవాళ వరల్డ్‌ కైండ్‌నెస్‌ డే). ఏలే ఏలే.. లేలేలే ఓ వో! ఆమె పాదాల కింద సూర్యోదయం పసుపు రంగులో దుమ్ము దుమారం అవుతోంది. అమ్మాయి ఆగట్లేదు. ‘ఆకాశం వైపు చూడు. చుక్కలెప్పుడూ ఒంటరిగా మినుకు మినుకు మనవు.

ఇది నీ రాత్రి... గట్టిగా ఒంట్లోకి ఊపిరి పీల్చుకుని జరగాల్సిన దాన్ని జరగనివ్వు’. పాడుతున్న పచ్చి పారాణి పడీపడీ నవ్వింది. న్యూ బ్రైడ్‌. పెళ్లికుమారుడు దఢేల్‌మని పడిపోయాడు. ‘ఇటీజ్‌ ద వే దట్‌ యు స్మైల్‌. బేబీ, ఐ యామ్‌ లూసింగ్‌ మై మైండ్‌..’ వీడియో కంప్లీట్‌ అయింది. హేయ్‌ గైస్‌ అంటూ.. విద్య వచ్చేసింది. ‘పాట ఎలా ఉంది?’ అని అడిగింది. పాటలోని ‘సో.. బ్యూటిఫుల్‌ ఏంజెల్‌’ ఆమే. ఈ సాంగ్‌ను, ఈ అమ్మాయినీ త్వరలోనే మనం లైవ్‌లో చూడొచ్చు. విద్య ఈవారం హైదరాబాద్‌ వస్తోంది. హూ ఈజ్‌ దిస్‌ ఎలక్ట్రానిక?!

ఇంట్లో.. కర్ణాటక కృతులు, భజన్స్, ఎ.ఆర్‌.రెహమాన్‌. స్కూల్‌కి వెళుతున్నప్పుడు దారిలో.. రేడియోలోంచి కోల్డ్‌ప్లే, డెస్టినీస్‌ చైల్డ్, చియారా! భూగోళాన్ని ఉత్తరార్థం, దక్షిణార్థం అని.. భూమధ్య రేఖతో కాకుండా, ‘భూనిలువు రేఖ’తో రెండుగా కట్‌ చేస్తే ఈస్టు వెస్టు అవుతాయి కదా. ఆ రెండు చెక్కల సంగీతాన్ని పిండుకుని షర్బత్‌లా తాగేస్తుండేది విద్య. సడన్‌గా ఆమె బుర్రలో మాషప్‌ అయిపోయే వాళ్లు రెహమాన్, చియారా! కోల్డ్‌ప్లే.. బ్రిటిష్‌ రాక్‌ బ్యాండ్‌. ఇద్దరుండేవాళ్లు అందులో. క్రిస్‌మార్టిన్, జానీ బక్లాండ్‌. డెస్టినీస్‌ చైల్డ్‌.. అమెరికన్‌ అమ్మాయిల గ్రూప్‌.

ముగ్గురుండేవాళ్లు అందులో. బియాన్సే నోల్స్, కెల్లీ రోలాండ్, మిషెల్‌ విలియమ్స్‌. ఇక చియారా ఇండివిడ్యువల్‌. అమెరికన్‌ ఫిమేల్‌ సింగర్‌.   బుద్ధి వికసించే వయసులో వర్జీనియాలో తొలిసారి విద్యను వెస్ట్రర్న్‌ పడవల్లో తెడ్డేసి తిప్పింది షికారుకు తీసుకెళ్లింది ఈ ఐదుగురే. క్రిస్‌ మార్టిన్‌ గొంతులోని నరాలు తెంపి, తన గిటార్‌కు తీగలుగా చుట్టుకుని జానీ బక్లాండ్‌ ప్రకంపనల్ని క్రియేట్‌ చూస్తున్నాడా ఏంటి అనుకునేది విద్య ‘కోల్డ్‌ప్లే’ సాంగ్స్‌ ప్లే అవుతున్నంతసేపూ.

ఇంటికొచ్చాక మళ్లీ.. యే హై మేరా హిందూస్థానీ! ఓసారి రెండు తీగల్నీ కలిపింది విద్య. భగ్గుమని ఓ బ్రైట్‌నెస్‌. ‘‘ఏమిటమ్మా.. ఆ స్వర సంకరం’’ అన్నారు నాన్నగారు. ఇంచుమించు ఆయన శంకరశాస్త్రి గారు. ‘‘అపస్వరం మాత్రం కానివ్వను నాన్నా’’ అంది విద్య. ‘‘మరేంటి నువ్వు చేస్తున్న పని’’ అన్నారు ఆయన. ‘‘మాషప్‌’’ అంది విద్య. మాషప్‌ అంటే రుబ్బేయడం. ఎలా పడితే అలా రుబ్బేయడం కాదు. కొత్త రిథమ్‌ని అవుట్‌పుట్‌గా తేవడం. కొత్త లిరిక్‌తో ప్రపంచాన్ని వెలిగించడం. ఆ విద్య తెలుసుకుంది చిన్నప్పుడే విద్య.

సే మై నేమ్‌
‘డెస్టినీస్‌ చైల్డ్‌’ బ్యాండ్‌కు మొదట ఉన్న పేరు ‘గర్ల్‌ టైమ్‌’. విద్య పుట్టిన ఏడాదే ఆ ‘గర్ల్‌ టైమ్‌’ పాప్‌ బ్యాండ్‌ పుట్టింది. తర్వాత ఏడేళ్లకు అది ‘డెస్టినీస్‌ చైల్డ్‌’ అయింది. ఆ బ్యాండ్‌లోని ‘సే మై నేమ్‌’ అనే పాట అంటే విద్యకు ఇప్పటికీ ఇష్టం. రెస్పెక్ట్‌ని డిమాండ్‌ చేసే పాట అది. ‘ఊరికే ఐలవ్యూ అని చెప్పేస్తే కాదురా అబ్బాయ్‌.. కాస్త ముందూ వెనుకా చూసుకుని చెప్పు’ అనేది థీమ్‌. ఇండియన్‌ గర్ల్స్‌ మనసుకు దగ్గరగా ఉంది కదా! విద్య సెమీ ఇండియన్‌లా కనిపిస్తుంది. అయితే లోపల ఉన్నదంతా ఆమె భారతీయ ఆత్మే.

విద్య చెన్నైలో పుట్టింది. విద్య అమ్మమ్మ వాళ్లది పాలక్కాడ్‌. కేరళ. విద్య అమ్మ, విద్య అమ్మమ్మ కూడా పాలక్కాడ్‌లోనే పుట్టి పెరిగారు. వాళ్ల నుంచి విద్యకు మలయాళం వచ్చింది. చెన్నై నుంచి యు.ఎస్‌. వెళ్లిపోయినా, ఇప్పటికీ ఇంట్లో ఎక్కువగా మలయాళమే. పుంజితంజి కొంజిక్కో.. ముంతురి ముత్తొలి చిందిక్కో.. వంజని వర్న చుందరివానే. వాళ్ల మాటలన్నీ పాటల కంపోజిషన్‌లోనే!

బాగా చిన్నప్పుడు విద్య.. అమ్మమ్మవాళ్లింట్లో కొన్నాళ్లు ఉంది. అప్పటి కోవెలలు, అక్కడి ఈత కొలనులు, తను ఇష్టంగా తినే ‘అవియల్‌’... ఇవేవీ విద్యను ఒంటరిగా యు.ఎస్‌. పంపించలేదు. మ్యూజికల్‌ మెమరీస్‌గా ఆమెకంటే ముందెళ్లి ఫ్లయిట్‌లో ఆమె పక్కన కూర్చున్నాయి. విద్యకు మలయాళీ మ్యూజిక్‌ అంటే ఇష్టం. జేసుదాస్‌ అంటే మహా ఇష్టం. ఆమధ్య విద్య విడుదల చేసిన మాషప్‌ ట్రాక్‌ ‘కుట్టనాదన్‌ పుంజయిలే’ మలయాళమే. ఆన్‌లైన్‌ సెన్సేషన్‌ అయింది. కేరళ బోట్‌ సాంగ్‌ అది. సరస్సులు, కొబ్బరి చెట్లు,  కేరళ మహిళలు; తెలుపు, బంగారు బార్డర్ల మెరుపు చీరల్లో వారి సంప్రదాయ నృత్యం, ఆ నృత్యానికి  విద్య వెస్ట్రన్‌ బీట్‌. ‘విద్యావోక్స్‌’ అల్లాడింది. అది ఆమె యూట్యూబ్‌ చానల్‌.

బాయ్‌ నీడ్స్‌ గర్ల్‌
స్కూల్‌ నుంచి కాలేజ్‌కి వచ్చింది విద్య. స్కూల్‌ నుంచి ఆమెను ఫాలో అవుతున్న మ్యూజికల్‌ గ్యాంగే కాలేజ్‌కీ ఆమెను ఫాలో అయింది. విద్యకు అర్థమైంది.. తన డెస్టినీ మ్యూజిక్‌ అని! సైకాలజీలో డిగ్రీ కంప్లీట్‌ చేసుకుని వెళుతుంటే.. ‘హాయ్‌’ అనే పిలుపు వినిపించింది.
తిరిగి చూసింది.

‘‘ఐ యామ్‌ శంకర్‌ టకర్‌’’. శంకర్‌ ఇంగ్లీష్‌లో పాటలు బాగా రాస్తాడు. క్లారియనిస్ట్‌. మ్యూజిక్‌ కంపోజర్‌. వీడియో డైరెక్టర్‌.  భారతీయ సంప్రదాయ సంగీతాన్ని, జాజ్‌నీ మిక్స్‌ చేసి శ్రోతల్ని అలౌకిక స్థితిలోకి తీసుకెళ్లడంలో శంకర్‌ ఎక్స్‌పర్ట్‌. విద్య కన్నా వయసులో నాలుగేళ్లు పెద్ద. విద్యలాగే అతడూ ఈస్టు వెస్ట్‌లను కలిపి చిలుకుతాడు. ఇండియాలో అతడికీ చుట్టాలు ఉన్నారు. ‘‘ఇద్దరం కలిసి ఏదైనా చేద్దాం’’ అన్నాడు శంకర్‌. ‘‘నా గురించి ఎలా తెలుసు?’’ అంది విద్య. ‘‘మీ గురించి తెలియదు.

మీలోని మ్యూజిక్‌ లవర్‌ గురించి తెలుసు. ఏదో ఫంక్షన్లో హమ్‌ చేస్తుంటే విన్నాను. ఇండియాను, అమెరికాను తగుపాళ్లలో మిక్స్‌ చెయ్యగలరు మీరు’’ అన్నాడు నవ్వుతూ. విద్య ఎగ్జయిట్‌ అయింది. శంకర్, తను ఒకే రూట్‌లో ఉన్నారని ఆమెకు అనిపించింది. మీరు షూట్‌ చేస్తానంటే నేను మాషప్‌ చేస్తాను అంది. మాషప్‌ ఎవరైనా చేస్తారు. విద్య ఫస్ట్‌ టైమ్‌ మాషప్‌ చేసినప్పుడు మాత్రం ‘ఎవరా!’ అని చూశారు. దాన్ని షూట్‌ చేసింది శంకరే. ఇప్పుడున్న విద్య మ్యూజిక్‌ వీడియోల డైరక్టర్‌ కూడా అతడే. ‘‘లవ్‌లో ఉన్నారా.. మీ ఇద్దరూ..’’ అడిగారెవరో విద్యను. విద్య పెద్దగా నవ్వింది. ‘‘ఇద్దరు మ్యూజిక్‌ లవర్స్‌ మధ్య స్నేహం మాది’’ అంది.

చిటికెలు, చిందులు
లీన్‌ ఆన్‌–జింద్‌ మహీ (2015), క్లోజర్‌–కబీరా (2016) మాషప్‌లతో విద్య టాలెంట్‌ గురించి ప్రపంచానికి ఫస్ట్‌ టైమ్‌ తెలిసింది. ఆమె డిస్కోగ్రఫీ మొదలైంది కూడా ఆ రెండేళ్లలోనే. ‘లీన్‌ ఆన్‌’ అనే వీడియో సాంగ్‌ ‘మేజర్‌ లేజర్‌’ అనే అమెరికన్‌ ఎలక్ట్రానిక్‌ బ్యాండ్‌ది. ‘జింద్‌ మహీ’ పంజాబీ సాంగ్‌. మాషప్‌లో ఒరిజినల్‌ని అంతర్లయగా సాగిస్తూ, రెంటినీ చక్కగా రుబ్బి, బాణలిలో ‘సుయ్‌’మని మెదుపు వడ వేసింది విద్య. ఇప్పటి వరకు ఈ మాషప్‌ని రెండు కోట్ల డెబ్బై లక్షల మంది నెట్‌లో ఆస్వాదించారు.



‘క్లోజర్‌’ సాంగ్‌ అమెరికన్‌ డీజేలు ఆండ్రూ, అలెక్స్‌ల పాప్‌ బ్యాండ్‌ ‘చెయిన్‌ స్మోకర్స్‌’ ఆల్బమ్‌ లోనిది. దానికి విద్య ‘ఏ జవానీ హై దివానీ’ చిత్రంలోని ‘కబీరా’ సాంగ్‌ను కలిపి కొత్త బీట్‌తో బయటికి తెచ్చింది. మాషప్‌లు ఏం గొప్ప అనేవారెవరైనా ఉంటే వీటికి విద్య అందించిన లిరిక్స్‌ని వినొచ్చు. సైకాలజీని జోడించి మరీ సాహిత్యాన్ని ట్యూన్‌ చేసు కుంటుంది ఈ అమ్మాయి. విద్య ఒరిజినల్‌ కంపోజిషన్స్‌ లేటెస్టుగా ‘డైమండ్స్‌’, ‘కుతు ఫైర్‌’ చిటికెలు, చిందులు వేయిస్తున్నాయి.

ఆ ‘వజ్రాలు, బంగారం, గోరింటాకు, గాజులు..’ కవిత్వం డైమండ్స్‌లోనిదే. విద్య అసలు పేరు విద్యా అయ్యర్‌. ‘విద్యా వోక్స్‌’ అనేది ఆమె స్టేజ్‌ నేమ్‌. ప్రపంచంలోని చాలా ప్రదేశాల్లో ఈ ఇరవై ఆరేళ్ల వయసుకే స్టేజ్‌ షోలు ఇచ్చింది విద్య. వైట్‌ హౌస్, వెబ్‌స్టర్‌ హాల్‌ (అమెరికా), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ది పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ (ఇండియా), రీయూనియన్‌ ఐలాండ్, సురినామ్, దుబాయ్‌ నెదర్లాండ్‌ దేశాలలో పెర్‌ఫార్మ్‌ చేసింది విద్య.   

ది కుతు ఫైర్‌ టూర్‌
ఈ నెల 17న పుణెలోని అమనోరా గ్రౌడ్‌లో విద్య ‘లైవ్‌ షో’ ఉంది. ‘ది కుతు ఫైర్‌ టూర్‌’ అనే పేరుతో ఇండియాలో పుణెతో విద్య మ్యూజిక్‌ కాన్సర్ట్‌ మొదలవుతోంది. 18న కోల్‌కతాలో, 19న హైదరాబాద్‌లో, 24న బెంగళూరులో, 25న ఢిల్లీలో, 26న అహ్మదాబాద్‌లో విద్య షో టిక్కెట్‌లకు ఇప్పటినుండే తొందర ఎక్కువైంది. ఈ మొత్తం టూర్‌ పేరు ‘విద్య వోక్స్‌: ది కుతు ఫైర్‌ టూర్‌’. వోక్స్‌ అంటే లాటిన్‌లో వాయిస్‌ అని. ఈ పేరును సజెస్ట్‌ చేసింది ఆమె ఫ్రెండ్‌ శంకరే.

తన చానల్‌కు కూడా విద్య ఇదే పేరు పెట్టుకున్నారు. ‘కుతు’ అనేది తమిళ జానపద సంగీతంలోని ‘దబన్‌కుతు’ అనే సంప్రదాయానికి షార్ట్‌ నేమ్‌. దానికి ‘ఫైర్‌’ను కలిపి విద్య భగ్గుమనిపించారు. ఆ మ్యూజిక్‌ వీడియోనే ‘కుతు ఫైర్‌’. విద్యకు ఇదొక డ్రీమ్‌ జర్నీ. మునుపొకసారి విద్య ముంబై వచ్చివెళ్లింది కానీ, ఎప్పటికప్పుడు ఇండియా తనకు కొత్తగా, లవ్‌లీగా ఉంటుందట! నెట్‌లో ప్రస్తుతం విద్యవి 40 పాటల వరకు ఉన్నాయి. కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. విద్య చానల్‌కు దాదాపు నాలుగు లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. ఆమె ఫేస్‌బుక్‌ని పది లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌ని 6 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.
 

- విద్యా అయ్యర్‌ (గాయని, గేయ రచయిత్రి, యూట్యూబ్‌ స్టార్, డ్యాన్సర్‌).

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement