రద్దీలో ఒక పేజీ | Sakshi
Sakshi News home page

రద్దీలో ఒక పేజీ

Published Wed, Dec 2 2015 12:12 AM

రద్దీలో ఒక పేజీ

రద్దీలో ఎన్ని కథలో! ఎన్ని వ్యథలో! ఎన్ని గాథలో!
కొన్ని ప్రాంతాల్లో రద్దీ అంటే చిత్తు కాగితాలు.
బాగా కిక్కిరిసిన జన సమూహాన్ని కూడా రద్దీ అంటారు.
ఒక జీవితాన్ని ఒక పేజీలో రాసి, తర్వాత పారేస్తే...
కాగితం రద్దీ అవుతుంది... కథ కనుమరుగవుతుంది.
అందుకే కరిష్మా మెహతా రద్దీ ప్రదేశాల నుంచి
ఒక మనిషి కథను ఎంచుకొని... ఫేస్ బుక్‌లో కూర్చుతోంది.
ప్రతి పేజీనీ ఒక ఫేస్‌గా మారుస్తోంది.
‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ నిండా అలాంటి కథల రద్దీయే.
మనం చదవాలనుకునే సామాన్యుల అసామాన్య పేజీలే.

 
జారియా (29)  

మా కుటుంబం, వాళ్ల కుటుంబం ఒకే కాంప్లెక్స్‌లో ఉండే వాళ్లం. ఆయన చాలా తక్కువగా కనిపించేవారు. ఎక్కువగా దుబాయ్‌లో ఉండేవారు.  కానీ ముంబైలో ఉన్నన్ని రోజులూ నన్నే గమనించేవారు. అలా ఒకరోజు నా కాలేజ్ అడ్రస్ కనుక్కొని అక్కడికి వచ్చారు. పరిచయం చేసుకొని ‘నాతో రెస్టారెంట్‌కి వస్తావా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి’ అన్నారు. అప్పుడు నాకు పందొమ్మిదేళ్లు. మొదటి చూపులోనే అతనికి అట్రాక్ట్ అయ్యాను. రెస్టారెంట్‌లో కూర్చున్నాక.. నేనంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటాననీ చెప్పాడు. మా పెద్దవాళ్లూ అడ్డుచెప్పలేదు. పైగా వాళ్ల వాళ్లు మా పెళ్లికి చాలా తొందర పెట్టారు కూడా. గ్రాండ్‌గా మా పెళ్లయింది. అయితే నా ఆనందం ఆ రోజుకే ఆఖరు అయింది!

మర్నాటి నుంచి నరకం అంటే ఏంటో తెలియడం మొదలైంది. నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ప్రతిదీ ఆయనకు నచ్చినట్టే ఉండాలి. ఏ కొంచెం తేడా వచ్చినా కొట్టేవాడు. కొన్నాళ్లకు దుబాయ్‌లో కాపురం పెట్టాం. అక్కడికెళ్లాక మరీ దారుణంగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు.

ఆ యాతనలోనే పెళ్లయిన ఆర్నెల్లకే నెల తప్పాను. ఓ రోజు బయటకు తీసుకెళ్లి అయిదు గంటలు ఎండలో నిలబెట్టాడు. ఒంట్లోని నీరు, మినరల్స్ అన్నీ పోయి స్పృహతప్పి పడిపోయాను. రెండు రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చింది. ఇంటికొచ్చాక మళ్లీ విపరీతంగా కొట్టాడు. అదే సమయంలో మా పేరెంట్స్ హజ్‌యాత్రలో ఉన్నారు. అలా దుబాయ్ వచ్చారు. వాళ్లు రావడం వల్ల నేను బతికిపోయాను. కడుపులో పిండంతో సహా సురక్షితంగా దుబాయ్ నుంచి బయటపడగలిగాను. ముంబై వచ్చాక అమ్మ ఒళ్లో తలపెట్టి తనివి తీరా ఏడ్చాను. మూడు నెలలకు ఆయన దగ్గర్నుంచి కోర్టు నోటీస్ వచ్చింది.. విడాకులతోపాటు.. పుట్టబోయే బిడ్డ కస్టడీ కోరుతూ! షాక్ అయ్యాను. విడాకుల నోటీస్‌ని చూసి కాదు... అందులో ఇంకా భూమ్మీదకే రాని బిడ్డ మీద ఆయనకున్న పగను చూసి. కుమిలి కుమిలి ఏడ్చాను. కొడుకు పుట్టాడు. వాడు నా ఒళ్లో కన్నా కోర్టు ప్రాంగణంలోనే ఎక్కువసార్లు గడిపాడు. పదేళ్లు కోర్టు చుట్టూ తిరిగాక.. ఫైనల్‌గా... నేను గెలిచాను. అయితే ఓడి గెలిచాను. నా కొడుకుని దక్కించుకుని గెలిచాను.. కాని వాడిని కోర్టు చుట్టూ తిప్పుతూ వాడి బాల్యానికి చేదు జ్ఞాపకాలనిచ్చి ఓడిపోయాను.
 
శశి నటరాజన్ (58)

పెళ్లయిన చాలా ఏళ్ల వరకు మాకు పిల్లల్లేరు. చివరికి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పటి నుంచి నాకు పుట్టబోయేది ఆడబిడ్డా, మగ బిడ్డా అని నా కన్నా ఎక్కువగా అందరూ కలవరపడ్డం మొదలుపెట్టారు. మా అత్తగారింట్లోనైతే కొడుకే పుడతాడనే నిశ్చయానికి వచ్చేశారు. నాకు మాత్రం ఎప్పుడూ ఒకటే చింత.. పుట్టబోయేది కూతురైనా.. కొడుకైనా ఆరోగ్యంగా పుడితే చాలు అని. ఆ రోజు రానే వచ్చింది. అమ్మాయి పుట్టింది.‘ పండంటి బిడ్డ’ అని డాక్టర్ అన్న మాట చెవిలో గుడిగంటలా వినిపించింది. ‘అయ్యో... అమ్మాయి పుట్టిందా?’ అని అంటున్న అత్తగారి నీరసమూ చెవిలో పడింది. నా పక్కన పొత్తిళ్లల్లో ఆదమరచి నిద్రపోయిన ఆ బిడ్డకు ఇప్పుడు 22 ఏళ్లు. దూకే జలపాతానికి మారుపేరులా ఉంటుంది.
 
సైరా (20)
నాన్న స్నాక్స్ వ్యాపారం చేసేవాడు. ఇంటికి కాణి ఇచ్చేవాడు కాదు. దాంతో అమ్మ నన్ను తీసుకుని ముంబై వచ్చేసింది. బతకడానికి సెక్స్ వర్కర్‌గా మారింది. అందరూ అమ్మను మురికి మనిషి అని అనడం విన్నాను. నాకూ రండీకి బేటీ అనే పేరే స్థిరపడిపోయింది. అమ్మ వృత్తిని, ఆమె పరిస్థితినీ అలుసుగా, ఆసరాగా తీసుకొని నా మీదా చాలాసార్లు అఘాయిత్యం చేశారు. సెక్స్ వర్కర్స్ రైట్స్ మీద పనిచేస్తున్న ఎన్‌జీవో పరిచయం కానంత వరకూ నేనూ మురికిదాన్ననే ఫీలింగ్ వెంటాడింది నన్ను. ఎప్పుడైతే ఆ ఎన్‌జీవోలో చేరానో అప్పుడు అర్థమైంది.. మురికివాళ్లం మేం కాదు.. మమ్మల్ని ఈ వృత్తిలోకి, ఈ స్థితిలోకి నెట్టిన మగవాళ్లు అని.

ఇలాంటివే ఎన్నో  కన్నీటి గాథలు, వాటితో పాటు విజయపథాలు, ఆశలు, ఆకాంక్షలు కనిపిస్తాయి ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఫేస్‌బుక్ పేజ్‌లో. దీన్ని ప్రారంభించిన కరిష్మా మెహతా (23)... యూకేలో ఎకనిమిక్స్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు బ్రాండన్ స్టాన్‌టన్ అనే న్యూయార్క్ కుర్రాడు నడుపుతున్న ‘హ్యుమన్స్ ఆఫ్ న్యూయార్క్’ అనే ఫేస్‌బుక్ పేజ్‌ని బాగా ఫాలో అయ్యేది. అందులో షేర్ అవుతున్న రియల్‌స్టోరీస్‌ని చదివి కదిలిపోయేది.  తనూ అలాంటి ఒక పేజ్‌ని క్రియేట్ చేయాలి అనుకుంది. ముంబై వచ్చాక ఉద్యోగం దొరికిన వెంటనే ఓ కెమెరా కొనుక్కొంది. ఇద్దరు అసిస్టెంట్లను పెట్టుకుంది. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పేరుతో ఎఫ్‌బీలో పేజ్ ఓపెన్ చేసింది.
 2014లో క్రియేట్ అయిన ఈ పేజ్ వయసు ఇంకా యేడాది కూడా కాలేదు... కాని నాలుగు లక్షల మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. ‘ఇది మొదలుపెట్టేటప్పుడు కొంచెం భయంగానే ఉండింది. బ్రాండన్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నప్పటికీ న్యూయార్క్ వేరు.. అక్కడి మనుషులు వేరు. ముంబై వేరు.. ఇక్కడి మనుషులు వేరు. ఏమాత్రం తేడా వచ్చిన అంతే సంగతులు అన్న విషయం తెలుసు. అందుకే కొంచెం భయం, కొంచెం డౌట్‌గానే స్టార్ట్ చేశా. ఫస్ట్ స్టోరీకి బెదిరింపులు రాగానే పట్టుదల ఎక్కువైంది. ఈ పేజ్ లక్ష్యం ఒక్కటే.. ముంబై జీవితాన్ని ప్రతిబింబింపచేయాలని. దాని పోరాటాన్ని వినిపించాలి, చూపించాలని. ఇందులో ఏ ఒక్క కథైనా.. ఏ ఒక్కరిని ఇన్‌స్పైర్ చేసినా చాలు’ అంటుంది కరిష్మా మెహతా.   

Advertisement

తప్పక చదవండి

Advertisement