పెళ్లయి నాలుగేళ్లు అవుతోంది...గర్భం వస్తుందా? | Sakshi
Sakshi News home page

పెళ్లయి నాలుగేళ్లు అవుతోంది...గర్భం వస్తుందా?

Published Thu, May 19 2016 11:17 PM

పెళ్లయి నాలుగేళ్లు అవుతోంది...గర్భం వస్తుందా?

టర్నర్స్ సిండ్రోమ్ అంటున్నారు.. గర్భం వస్తుందా?

 

 హోమియో కౌన్సెలింగ్


నా మిత్రుడి వయసు 30 ఏళ్లు. తరచూ కండరాల నొప్పులు. దాంతో పాటు ఎముకలు సన్నబడి ఎక్కువ దూరం నడవలేక బాధపడుతున్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే క్యాల్షియం లోపం వల్ల ఎముకల్లో బలహీనత ఏర్పడింది అన్నారు. దీనికి హోమియోలో శాశ్వత చికిత్స ఉందా?  - మోహన్, కొత్తగూడెం
సగటున ప్రతి మానవుడికి రోజుకు 1200 నుంచి 1500 మి.గ్రా. క్యాల్షియం అవసరం. శరీరంలోని గుండె కండరాలు, నరాలు సరిగా పని చేయడానికి, ఎముకల పెరుగుదలకు ఈ క్యాల్షియం ఆవశ్యకత ఎంతో ఉంటుంది.ఎముకలలో పాతకణాలు అంతరించి కొత్త కణాలు అంకురించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది. ఏ కారణంగానైనా తరిగిపోతున్న ఎముకకు సమానంగా కొత్త ఎముక ఏర్పడకపోతే ఎముకలు బలహీనమై, పెళుసుబారి విరిగిపోతాయి. ఇలా జరగడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఎముకల ఎదుగుదలకు క్యాల్షియం ముఖ్య భూమిక పోషిస్తుంది.

 
క్యాల్షియం లోపాలకు కారణాలు:  శరీరంలో హార్మోన్ల అవసమతౌల్యత వల్ల క్యాల్షియం లోపిస్తుంది  మనం తీసుకునే ఆహారంలో క్యాల్షియం తక్కువగా ఉండటం  నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్లో క్యాల్షియం లోపాలు అధికంగా ఉంటాయి   శరీరంలో విటమిన్-డి తక్కువగా ఉండటం  తీసుకున్న ఆహారంలోని క్యాల్షియం పోషకాన్ని గ్రహించే తత్వం శరీరానికి తక్కువగా ఉండటం.

 
లక్షణాలు: క్యాల్షియం లోపం వల్ల... ఎముకలు సన్నబడి, పెళుసుగా మారడం  పెళుసుగా మారి సులువుగా విరిగిపోవడం. ఈ లక్షణాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ వ్యాధి లక్షణాలు తొలి దశలో కనిపించవు. కానీ ఎముకలు లోలోపలే క్షీణిస్తూ ఉంటాయి. ఎప్పుడో సమస్య మరీ తీవ్రమై ఎముకలు విరిగిపోయినప్పుడు గానీ ఆ విషయం తెలిసిరాదు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఉన్నట్లుండి కండరాల నొప్పులు రావడం, ఎముకలు సన్నగా ఉండి పెళుసుగా మారి సులువుగా విరిగిపోయే తత్వం పెరుగుతుంది. అంతేకాకుండా ఎముకల ఆకృతి మారిపోతుంది. చిన్నపిల్లల్లోనే కాకుండా పురుషులు, స్త్రీలలోనూ ఈ సమస్య కనిపించినా, నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వృద్ధులలో కండరాల బలహీనత ఏర్పడి సరిగా నడవలేకపోతారు.

 
జాగ్రత్తలు-నివారణ
:  క్యాల్షియం ఎక్కువగా లభించే పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, వేరుశనగలు, రాగులు వంటి పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి క్యాల్షియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం ఉండే పండ్లు, కూరగాయలు కూడా తరచూ తీసుకోవాలి  క్యాల్షియం పొందడానికి విటమిన్-డి కూడా ముఖ్యమైనది. విటమిన్-డి లోపాన్ని నివారించడం కోసం ఉదయం వేళ రోజూ కొద్దిసేపు ఎండలో ఉండాలి.

 
చికిత్స
: హోమియో వైద్య విధానంలో ఎలాంటి సమస్యలకైనా రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకునే కాన్‌స్టిట్యూషనల్ చికిత్స ద్వారా చికిత్స అందించవచ్చు.

 

డాక్టర్ ఎ.ఎం. రెడ్డి 
సీనియర్ డాక్టర్  పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్

 

ఫెర్టిలిటీ కౌన్సెలింగ్

నా వయసు 25 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లు అవుతోంది. మేం గర్భనిరోధక సాధనాలు ఏవీ వాడటం లేదు. కానీ నేనింకా గర్భం ధరించలేదు. నాకు రుతుక్రమం సరిగా రావడం లేదు. మందులు తీసుకున్న తర్వాతే పీరియడ్స్ వస్తున్నాయి. నేను ఇటీవలే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాను. ఆమె కొన్ని పరీక్షలు చేయించి నాకు టర్నర్స్ సిండ్రోమ్ ఉందని చెప్పారు. అంటే ఏమిటి? నాకు గర్భం వచ్చే అవకాశం ఉందా? తగిన సలహా ఇవ్వండి. - సోదరి, హైదరాబాద్


టర్నర్స్ సిండ్రోమ్ అనేది మీ క్రోమోజోములకు సంబంధించిన సమస్య. సాధారణంగా  మహిళల్లో రెండు ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. అయితే టర్నర్స్ సిండ్రోమ్ ఉన్న మహిళల్లో మాత్రం ఒక ఎక్స్ క్రోమోజోము పూర్తిగా లేకపోవడమో లేదా పాక్షికంగా ఉండటమో జరుగుతుంది. ఫలితంగా ఈ సమస్య ఉన్న మహిళలకు రుతుక్రమం సరిగా రాదు. ఈ సమస్య ఉన్న చాలామంది మహిళలకు సాధారణంగానే గర్భం రాకపోవచ్చు. టర్నర్స్ సిండ్రోమ్ ఉన్న కొంతమంది మహిళలకు గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలే లేదా శరీర నిర్మాణపరమైన లోపాలు కూడా ఉండే అవకాశం ఉంది.


మీలా టర్నర్స్ సిండ్రోమ్ ఉన్న మహిళలు చాలామందికి దాత నుంచి అండం స్వీకరించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే మీ విషయంలోనూ ఎవరైనా దాత నుంచి స్వీకరించిన అండంలోకి మీ భర్త వీర్యకణాన్ని ఫలదీకరణం చేయించి, దాన్ని మీ గర్భంలోకి ప్రవేశపెట్టాల్సి రావచ్చు. అయితే మీరు గర్భధారణను ప్లాన్ చేసుకునే ముందర ఒకసారి మీకు ఎమ్మారై, ఎకోకార్డియోగ్రఫీ, గర్భధారణకు అవసరమైన ఫిట్‌నెస్ మీలో ఉందా లేదా అని తెలుసుకునేందుకు కొన్ని వైద్య పరీక్షలు చేయించాల్సి వస్తుంది. ఎందుకంటే మీ లాంటి మహిళల్లో గర్భధారణ సమయంలోనూ, ప్రసవం కాగానే కూడా గుండెకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అలాంటప్పుడు కార్డియాలజిస్ట్, అబ్సెట్రీషియన్ ఆధ్వర్యంలో మీకు తక్షణ చికిత్స చేయించాల్సి రావచ్చు. థైరాయిడ్, డయాబెటిస్ వంటి సమస్యలూ రావచ్చు. అవి ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం కొన్ని వైద్య పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఉంటే.... వాటిని వెంటనే నియంత్రించడం కోసం మందులు వాడాల్సి ఉంటుంది. ప్రసవం తర్వాత కూడా మీకు కొన్ని హార్మోన్లు ఇవ్వాల్సి రావచ్చు. కాబట్టి మీరు వైద్య నిపుణులను సంప్రదించి, అనేక విషయాలు చర్చించడం వల్ల మీకు సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

 

డాక్టర్ కె. సరోజ
సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్

 

న్యూరో కౌన్సెలింగ్

 

నా వయసు 30 ఏళ్లు. గృహిణిని. నాకు ఇద్దరు పిల్లలు. కొన్నాళ్ల నుంచి నేను తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాను. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, టీవీ ఎక్కువగా చూడటం వల్లనే అస్తమానం తలనొప్పి వస్తోందని భావించి, ఇంటి దగ్గర్లోని మెడికల్ షాపులో ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకుంటున్నారు. తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈమధ్య తలపోటుతో పాటు తలతిప్పడం, వాంతి అయ్యేలా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.  - మాధురి, హైదరాబాద్
తలనొప్పికి చాలారకాల కారణాలు ఉంటాయి. ఆహారం తినే వేళల్లో తేడా రావడం, ఆలస్యం కావడం లేదా ఆ పూటకు మానేయడం వల్ల తలనొప్పి వస్తుంది. ఇంట్లోగానీ ఆఫీసులో గానీ విపరీతమైన పని ఒత్తిడి ఉండటం కూడా తలనొప్పికి ఒక కారణమే. ‘మైగ్రేన్’ అని తలకు ఒకవైపు మాత్రమే వచ్చే నొప్పి కూడా దీనికి కారణమయ్యే అవకాశం ఉంది. ఇక మీ విషయానికి వస్తే తీవ్రమైన తలపోటు అంటున్నారు. అది సైనసైటిస్ కూడా కావచ్చు. అయితే మీకు తలనొప్పి చాలా రెగ్యులర్‌గా వస్తోందని అంటున్నారు. అంతేకాకుండా వికారం (వామిటింగ్ సెన్సేషన్) కూడా కలుగుతుందంటున్నారు. ఈ లక్షణాలతో పాటే మీకు తరచూ కళ్లు తిరగడం, ఒళ్లు తూలడం, నీరసం, శరీరం నిస్సత్తువకు లోనుకావడం లాంటి లక్షణాలకు గురవుతున్నారా అన్నది ఒక్కసారి సరిచూసుకోండి. ఒకవేళ ఈ లక్షణాలతో కూడా బాధపడుతున్నట్లయితే ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా తక్షణమే పరీక్షలు చేసి, అవసరమైతే ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. భరించలేనంత తలనొప్పి వస్తుంటే అది చాలా ప్రమాదకరమైన మెదడు సంబంధిత వ్యాధికి సూచనగా భావించాలి. బ్రెయిన్‌క్లాట్, బ్రెయిన్ ఎన్యుమరిజం, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ సిస్ట్... లాంటివి ఏవైనా కావచ్చు. కాబట్టి మీరు ఇబ్బంది పడుతున్న తలనొప్పి విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించకుండా మంచి నిపుణులైన వైద్యుడిని సంప్రదించండి. మీ సమస్యను వారికి వివరించండి. అలాగే తలనొప్పి వచ్చినప్పుడు మీలో కనపడుతున్న లక్షణాలను కూడా వివరించండి. వైద్యులు మిమ్మల్ని పరీక్షించి, మీ సమస్యను నిర్ధారణ చేసి, తగిన చికిత్స అందించగలరు.

 

డాక్టర్ ఆనంద్
బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్,
సికింద్రాబాద్

 

Advertisement
 
Advertisement
 
Advertisement