రెండోసారి పెళ్లి కూడా వేదన మిగిల్చింది. | Bollywood Actress Vidya Sinha Special Story | Sakshi
Sakshi News home page

రజనీగంధ ఫూల్‌ తుమ్హారే...

Published Sat, Aug 17 2019 7:08 AM | Last Updated on Sat, Aug 17 2019 1:24 PM

Bollywood Actress Vidya Sinha Special Story - Sakshi

అమోల్‌ పాలేకర్‌తో...

మన ‘ప్రేమ్‌నగర్‌’ హిందీలో విడుదలైన 1974లోనే ‘రజనీగంధ’ కూడా విడుదలైంది. ప్రేమ్‌నగర్‌ భారీ చిత్రం. రాజేష్‌ఖన్నా హీరో. హేమమాలిని హీరోయిన్‌. కథ ప్రకారం హీరో కుబేరుడు. హీరోయిన్‌ ప్రతి సీన్‌లోనూ నాటకీయత ప్రదర్శించగల ఆత్మాభిమాన స్వభావి. ‘నా దేవి లేని ఈ కోవెల తునాతునకలై పోనీ’ అని హిందీలో రాజేష్‌ ఖన్నా మందుగ్లాసు పట్టుకొని పాడుతూ ఉంటే హీరోయిన్‌ దుఃఖంతో పెదవి కొరుక్కుంటుంది. సినిమా అంటే అదే అని జనం హర్షధ్వానాలు చేశారు. కాని సినిమా అంటే ఇది కూడా అని ‘రజనీగంధ’ వల్ల వాళ్లకు మెల్లగా తెలిసి వచ్చింది.

రజనీగంధలో పైవన్నీ లేవు. కాని ఉన్నది జనానికి నచ్చింది. అదేమిటి?
1970లలో అందరూ చూసే అందరికీ కనపడేటటువంటి అమ్మాయి అబ్బాయి ఈ సినిమాలో నాయకనాయికలు. అమోల్‌ పాలేకర్‌ ఒక సాదాసీదా గుమాస్తా. విద్యా సిన్హా డిగ్రీ పూర్తి చేసి ఆ రోజుల్లో ఆడవాళ్లు కూడా ఉద్యోగం చేస్తే బాగుండు అనుకునే ఆర్థిక పరిస్థితి ఉన్న కుటుంబపు అమ్మాయి. వీళ్లద్దరికీ స్నేహం. అమోల్‌ పాలేకర్‌ సరదా కుర్రవాడు. చిటుక్కుమని వేరుశనగకాయను పగులగొట్టి గింజను పంటికింద వేయడంలో కూడా ఆనందం వెతుక్కోగలవాడు. తాను ఇష్టపడే అమ్మాయికి మోకాలి మీద వొంగి కూచుని డైమండ్‌ రింగ్‌ ఇవ్వక్కర్లేదు... కలిసిన ప్రతిసారి గుప్పిళ్లనిండా కాసిని రజనీగంధ పూలు బహూకరిస్తే చాలు అనుకుంటాడు. ఢిల్లీ వీధుల్లో సాయంత్రపు గాలి పీల్చడం, ఎప్పుడైనా సినిమాకెళ్లడం, పక్కవాడి పోటీ బరువు నెత్తిన పడకుండా తేలిగ్గా గడపటం... ముఖ్యంగా హాయిగా నవ్వడం తెలిసినవాడు.

విద్యాసిన్హా ఇతణ్ణి ప్రేమిస్తుంది. ఆ కాలంలో ఒక పక్కింటి అమ్మాయి... పెంకుటింట్లో ఉండే అమ్మాయిలాంటి అమ్మాయి... బట్టల షాపులో అందరూ కొనుక్కునేటటువంటి వృత్తాలు వృత్తాల కనకాంబరపు రంగు చీరలు, బాబీ బ్లూ కలర్‌ చీరలు కట్టుకుని, పూలు తురుముకున్న ఒంటిపేట జడతో, మడిచిన రుమాలు అరచేతిలో ఉండేంత స్థోమతకు ఎదిగిన అమ్మాయి అమోల్‌ పాలేకర్‌ని ఇష్టపడటం చాలా సహజం. కాని ఆ అమ్మాయి ఉద్యోగం వెతుక్కుంటూ బొంబాయి వెళ్లినప్పుడు అక్కడ పరిచయమైన ఒక యువకుడు ఈ ప్రేమను మరిపిస్తాడు. జీవితం పట్ల గాంభీర్యం, కెరీర్‌ పట్ల ఆలోచన, భవిష్యత్తు పట్ల  ప్రణాళిక, నగర నాగరికతకు అనువుగా మార్చుకున్న వ్యవహార శైలి... ఢిల్లీలో చూసిన అల్లరి చిల్లరి కుర్రవాడి స్థానే ఈ సంస్కారవంతుడైన పురుషుడు విద్యాసిన్హా మనసు నిండా నిండిపోతాడు.

విద్యా సిన్హా
ఆమె ఒకనాడు ఢిల్లీకి తిరిగివచ్చి, అమోల్‌ పాలేకర్‌తో నీకూ నీ ప్రేమకూ రామ్‌రామ్‌ చెప్పాలనుకుని, ఆ బొంబాయి పురుషుణ్ణి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాక ఇదేమీ తెలియని అమోల్‌ పాలేకర్‌ స్నేహితురాలు వచ్చింది కదా అని ఎప్పటిలాగే వస్తాడు. చేతుల్లో సువాసనలు యీనే, స్వచ్ఛంగా పరిమళించే, సహజంగా వికసించే, తేట మనసులకు స్పందించే రజనీగంధ పూలను తెచ్చి నవ్వుతూ అతడు ఎదురుగా నిలబడినప్పుడు ఆ ‘సాధారణం’లోని ‘అలవిగాని ప్రత్యేకం’ కృత్రిమమైన అదుపాజ్ఞల బొంబాయి పురుషుడిలో ఏమాత్రం లేవు అని విద్యా సిన్హాకు హటాత్తుగా అనిపిస్తుంది. అవును. ఇతని సమక్షంలోనే హాయి ఉంది. అసలుతనం ఉంది. ఉబికే ప్రేమ ఉంది. గుండెలు కోరే సాంత్వనం ఉంది.  పరిగెత్తుకుని వెళ్లి ఆమె అమోల్‌ పాలేకర్‌ను కావలించుకుంటుంది. ‘ఇక నన్ను ఎక్కడికీ పంపకు’ అని అంటుకుపోతుంది. అమోల్‌ చేతుల్లోని పూలు వారిద్దరితో పాటు తామూ ఆలింగనంలో భాగమవుతాయి.

ఈ సినిమా చూసినవారు ఇప్పటికీ మరోసారి ఇంకోసారి చూస్తూనే ఉంటారు. వారెవరూ విద్యా సిన్హాను మర్చిపోలేదు. పోరు కూడా. డెబ్బయిలనాటి స్త్రీల సహజ ప్రాతినిధ్యం కె.బాలచందర్‌ వల్ల దక్షిణాదిలో కనిపిస్తే బాసూ చటర్జీ  వల్ల ఉత్తరాదిన కనిపించింది. ‘రజనీగంధ’లో మధ్యతరగతి అమ్మాయిల టిపికల్‌ ప్రెజెన్స్‌ని వెండితెర మీద విద్యా సిన్హా అనువాదం చేయగలిగింది. ఆమె మీద చిత్రీకరించిన ‘రజనీగంధ ఫూల్‌ తుమ్హారే’... పాట అతి సుందరమైన హిందీ పాటలలో ఒకటి. బొంబాయి రోడ్లలో ఆమె మీదా ఆమెతో పాటు ఉండే దినేష్‌ ఠాకూర్‌ మీద చిత్రీకరించిన ‘కహీ బార్‌ యూ భి దేఖా హై’ పాటకు ముఖేష్‌కు జాతీయ అవార్డు వచ్చింది.

రజనీగంధలోనే కాదు ఆ తర్వాత వచ్చిన ‘ఛోటీసి బాత్‌’లో కూడా విద్యా సిన్హా ఆనాటి మధ్యతరగతి ఆడపిల్లల స్వభావ స్వరూపాలను అందంగా చూపించగలిగింది. ‘ఛోటీసి బాత్‌’లో ఆత్మవిశ్వాసం లేని అమోల్‌ పాలేకర్‌ విద్యా సిన్హా వంటి అందమైన ఆడపిల్ల ఎక్కడ చేజారిపోతుందోనని ఆమెతో కలయిక జరిగిపోతే ఇక చచ్చినట్టు పెళ్లి చేసుకుంటుందని అందుకు పథకం వేస్తాడు. అది విఫలం అవుతుంది. ఆ పథకం గురించి తెలుసుకున్న విద్యా సిన్హా ‘ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద పథకం ఎందుకు?’ అని అతణ్ణి దగ్గరకు తీసుకుంటుంది. అంటే మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయికి అబ్బాయి మనసులోని ప్రేమ ఎలాగూ తెలిసిపోతుంది అనీ... ఇరువురూ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాక ఈ ‘కలయిక’లు చాలా చిన్న విషయాలు అని. విద్యా సిన్హా అదృష్టమో ఏమో ఈ సినిమాలో కూడా ఆమె పై చిత్రించిన ‘నా జానే క్యూ హోతా హై ఏ జిందగీకే సాథ్‌’ పాట అపురూపమైనది.

కొందరి రూపాలు కృత్రిమ అద్దకాలకు పనికిరావు. విద్యా సిన్హా రూపం విగ్గులూ వానపాటలూ డిస్కో దరువులకు అనువైనది కాదు. అవి విజృంభించిన ఎనభైల కాలంలో ఆమెకు తగిన పాత్రలు రాలేదు. మొదటి భర్త 1996లో మరణించాడు. దత్తత తీసుకున్న అమ్మాయి పెంపకం ఆమెను సినిమాలకు దూరం అయ్యేలా చేసింది. రెండోసారి పెళ్లి కూడా వేదన మిగిల్చింది.సాధారణంగా ఇలాంటివి కొంతమంది అందరికీ చెప్పుకుంటారు. విద్యా సిన్హా ఏనాడూ నోరు మెదపలేదు. పరిమళించి రాలిపోవాలి అన్నట్టు రాలిపోయింది.  మొన్న ఆగస్టు 15న ఆమె మరణవార్త విని డెబ్బయిల్లో హిప్పీలు పెంచిన చాలామంది కుర్రవాళ్లు బాల్కనీలోకి వెళ్లి గట్టిగా ఒక దమ్ములాగి ఆకాశం వైపు చూసి ఉంటారు. కొద్దిపాటి ద్రావకాన్ని గొంతున జార విడిచి ‘రజనీగంధ ఫూల్‌ తుమ్హారే’... అని హమ్‌ చేసి ఉంటారు.సినీ అభిమానుల లలితమైన జ్ఞాపకం విద్యా సిన్హా.– ఖదీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement