దళితులకు అండగా ఉంటాం | Sakshi
Sakshi News home page

దళితులకు అండగా ఉంటాం

Published Wed, Jun 28 2017 3:39 AM

దళితులకు అండగా ఉంటాం - Sakshi

 నిందితులను  అరెస్టు చేయకుంటే ఉద్యమం
 గరగపర్రు దళితులకు వైఎస్సార్‌ సీపీ బృందం భరోసా
 30న గ్రామానికి వై.ఎస్‌.జగన్‌ రాక


ఆపన్నులకు వైఎస్సార్‌ సీపీ అండగా నిలిచింది. గరగపర్రు బాధితులకు భరోసా ఇచ్చింది. ప్రజలంతా కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలని
హితవు పలికింది. నిందితులెవరైనా తక్షణం అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. ప్రతిక్షణం.. ప్రజాహితమే తమ నినాదమని మరోసారి నిరూపించింది.

భీమవరం : దళితులకు అండగా నిలబడతామని, వారి ఆత్మగౌరవానికి ఎలాంటి భంగం కలిగినా సహించేది లేదని వైఎస్సార్‌ సీపీ బృందం స్పష్టం చేసింది. గరగపర్రు గ్రామంలో మంగళవారం పర్యటించిన బృందం సభ్యులు బాధిత దళితులతో స్థానిక చర్చిలో సమావేశమయ్యారు.  సాంఘిక బహిష్కరణకు గురైన దళితుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ప్రజా సంక్షేమం పట్టని బాబు : ధర్మాన
మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..  తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మూడేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, దీనివల్ల అనేక ప్రాంతాల్లో అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో తలెత్తిన చిన్నపాటి వివాదాలనూ పరిష్కరించకుండా రాజకీయ లబ్ధికోసం ఉద్రిక్తతలను పెంచి పోషిస్తోందని దుయ్యబట్టారు. నిందితులను ముందే అరెస్ట్‌ చేసుంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ తక్షణం స్పందించి  నిందితులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలోని పరిస్థితులను తమ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల కాళీకృష్ణశ్రీనివాస్‌(నాని) మాట్లాడుతూ  గ్రామ వివాదం పార్టీ దృష్టికి వచ్చినా సమస్యను రాజకీయం చేయకూడదనే ఉద్దేశంతో వేచిచూశామని, అయితే  తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం దళితులను అణగదొక్కేందుకు యత్నించడంతో వారికి బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 30న గ్రామానికి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారని వెల్లడించారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ  గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనడానికి  ప్రజలందరూ సహకరించాలని హితవుపలికారు. పార్టీ ఎస్సీ, ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ..  దళితుల సాంఘిక  బహిష్కరణ  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

  కార్యక్రమంలో  పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు  పాతపాటి సర్రాజు, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు,  కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, నియోజకవర్గ కన్వీనర్లు తలారి వెంకటరావు, కవురు శ్రీనివాస్, దయాల నవీన్‌బాబు, అనీల్‌కుమార్, పార్టీ నేతలు వందనపు సాయిబాల పద్మ,  కారుమంచి రమేష్, మంతెన యోగీంద్రకుమార్‌వర్మ, మానుకొండ ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement