నిర్లక్ష్యమే..! | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యమే..!

Published Wed, Jun 28 2017 5:22 AM

నిర్లక్ష్యమే..! - Sakshi

అటకెక్కిన వాల్టా చట్టం

చేవెళ్ల మండలంలో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందిన దుర్ఘటన వాల్టా చట్టం అమలులో జరిగిన నిర్లక్ష్యాన్ని నిలదీస్తోంది. యథేచ్ఛగా బోరుబావుల తవ్వకాలు, అధికార యంత్రాంగం తీరు, రైతుల పాత్రపై పలు ప్రశ్నలు సంధిస్తోంది. ఇంకెందరు పసిబిడ్డలకు నూరేళ్లు నిండితే.. ఈ సమాజం మారుతుందని సూటిగా ప్రశ్నిస్తోంది. ‘తిలా పాపం.. తలా పిడికెడు’ చందంగా చిన్నారి విషాదాంత ఘటనలో అందరి నిర్లిప్తత, బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు స్పష్టం చేస్తోంది.ఎవరి స్థాయిలో వారు చట్టానికి అనుగుణంగా నడుచుకుంటే..ప్రాణాపాయానికి ఆస్కారం ఉండేది కాదు.

ఏడాది దాటినా ఊసేలేని అమలు కమిటీలు
బోరువెల్స్‌ రిగ్గులపై కొరవడిన నియంత్రణ
అనధికారికంగా విచ్చలవిడి తవ్వకాలు
పనికిరాని బారుబావుల పూడ్చివేతపై చైతన్యం శూన్యం
పసిపిల్లలను చిదిమేస్తున్న బోరు గుంతలు
మేల్కొంటేనే చిన్నారులకు ముప్పు తప్పేది..

సాక్షి, రంగారెడ్డి జిల్లా:
ఇష్టారీతిన సాగుతున్న బోరుబావుల తవ్వకాలపై అధికార యంత్రాంగం నియంత్రణ లేకపోవడం, ఎటువంటి రిజిస్ట్రేషన్‌ లేకుండా బోర్‌వెల్‌ రిగ్స్‌ తవ్వకాలు జరపడం, బోరు వేసేందుకు అధికారుల నుచి రైతు అనుమతి పొందకపోవడం వంటి మానవ తప్పిదాలు.. అభం శుభం తెలియని చిన్నారుల పాలిట శాపాలుగా మారుతున్నాయి.

తరచూ బోరుబావుల్లో చిన్నారులు చిక్కుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నా.. చలనం రావడం లేదు. ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయడమే తప్ప.. చిత్తశుద్ధితో మూలాలను వెతికి ప్రమాదాలను నివారిస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. గతంలో మంచాల మండలంలో జరిగిన ఘటన నేపథ్యంలోనైనా యంత్రాంగం మేల్కొని ఉంటే.. అందరిలాగే చిన్నారి ఆడుతూ పాడుతూ ఉండేది. ఆ తల్లిదండ్రులకు గర్భశోకం తప్పేది.

కొరవడిన నియంత్రణ
జిల్లాలో 90 శాతం రైతులు బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఉపరితల నీటి లభ్యత లేకపోవడంతో.. బోరుబావులే ప్రత్యామ్నాయంగా మారాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా 3.50 లక్షల వ్యవసాయ బోరుబావులు ఉన్నట్లు తెలుస్తోంది. అనధికారికంగా ఇంతకుమించి ఉండొచ్చని అంచనా. ఇవిగాక నీరు లేని బోరుబావులు నోళ్లు తెరిచి ఉన్నాయి. ఇటువంటివి మరో 20వేల వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడివే మృత్యుకుహరాలుగా మారుతున్నాయి.

బోరుబావుల తవ్వకాలపై నియంత్రణ లేకపోవడం కారణంగానే.. వీటిని పూడ్చివేయడం లేదు. వాస్తవంగా బోరుబావిలో నీళ్లు లేకుంటే తక్షణమే దాన్ని మట్టి, రాళ్లతో పూడ్చివేసే బాధ్యత ఆ రైతులదే. అయితే ఆ మేరకు వారికి అవగాహన కల్పించాల్సింది మాత్రం అధికారులే. రైతు బోరు వేయాలనుకుంటే.. ముందుగా ఆ మండల తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ సమయంలో డీడీ చెల్లించడంతోపాటు, భూమికి సంబంధించిన వివరాలన్నింటినీ నమోదు చేయాలి. వాల్టా చట్టం ప్రకారం రెండు బోరుబావుల మధ్య కనీసం 200 మీటర్ల దూరం పాటించాలి.

అలా ఉందా? లేదా? అన్నది నిర్ధరణ చేసుకున్నాక తహసీల్దార్‌.. క్షేత్రస్థాయి పరిశీలన కోసం జిల్లా భూగర్భజల శాఖకు రిఫర్‌ చేయాలి. ఆ తర్వాత జియో హైడ్రాలజిస్ట్‌.. సదరు భూమిలో నీటి లభ్యతను సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా తెలుసుకుంటాడు. నీటి లభ్యత ఉంటే.. బోరుబావి తవ్వకానికి అనుమతి ఇస్తాడు. కానీ జిల్లాలో ఈ ప్రక్రియ ఎక్కడా అమలు కాకపోవడం కారణంగానే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనుమతి కోసం జిల్లా భూగర్భజల శాఖకు వస్తున్న దరఖాస్తులను వేళ్లపైన లెక్కపెట్టవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో నిశితంగా గమనిస్తే.. నిత్యం బోరుబావుల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

రిగ్‌లపై చర్యలేవి..?
జిల్లాలో దాదాపు 600 బోర్‌వెల్‌ రిగ్గులు ఉన్నట్లు అధికారుల అంచనా. వీటిలో 120 మాత్రమే భూగర్భజల శాఖ వద్ద రిస్టర్‌ అయ్యాయి. మిగిలినవన్నీ అనధికారికంగా తిరుగుతూ.. ఇష్టారీతిన బోరుబావులు తవ్వుతున్నాయి. వాస్తవంగా ప్రతి రిగ్‌ రూ.రెండు వేలు చెల్లించి రెండేళ్ల కాలానికి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇలా చేస్తేనే.. తవ్వకానికి అర్హత ఉన్నట్లు. బోరుబావి కోసం అధికారుల నుంచి రైతు అనుమతి పత్రం తెచ్చుకుంటేనే.. రిజిస్టరైన రిగ్‌ తవ్వకాలు జరపాలి. లేకుంటే రిగ్‌ యజమానులు నేరానికి పాల్పడినట్లే. ఇటువంటి వాటిపై ఆకస్మిక దాడులు చేసి రిగ్‌లను సీజ్‌ చేయాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అనధికారికంగా డ్రిల్‌ చేస్తే రూ. 5 వేల నుంచి రూ.50వేల వరకు జరిమానా విధించవచ్చు. అయితే, అధికార యంత్రాంగం అనధికారికంగా బోరుబావులు తవ్విన రిగ్‌ యజమానుల నుంచి జరిమానా రాబట్టిన దాఖలాలు ఒక్కటీ లేకపోవడం గమనార్హం.

వాల్టా కమిటీలు ఎక్కడ!
వాల్టా చట్టం అమలు పట్ల ఎనలేని నిర్లక్ష్యాన్ని కనబర్చడం యంత్రాంగం మొదటి తప్పన్న విమర్శలు అందరి నుంచి వెల్లువెత్తుతున్నాయి. నీటి సంరక్షణ, విస్తారంగా మొక్కల పెంపకానికి తీసుకొచ్చిందే వాల్టా చట్టం. ఈ చట్టంలో పేర్కొన్న ప్రకారం.. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో వాల్టా కమిటీలు ఏర్పాటు చేసి బోర్ల తవ్వకాలపై నియంత్రణ చేపట్టాలి. గతేడాది మార్చి నెలలో ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

ఆదేశాలు వచ్చి దాదాపు 15 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కమిటీల ఊసేలేదు. ఈ కమిటీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు చోటు కల్పించి.. క్షేత్రస్థాయిలో వాల్టా చట్టం పకడ్బందీగా అమలు జరిగేలా చూడాలి. అయితే, అసలు కమిటీలే లేకపోవడంతో వాల్టా చట్టం సత్తుబండగా మారింది. అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ లోపించడంతో.. బోర్ల తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.

కళ్లముందు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నా, బోరుబావులను పూడ్చకున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నెలకొంది. ఈ కారణంగానే తరచూ ఎక్కడో ఒకచోట పసిబిడ్డలు బలవుతూనే ఉన్నారు. నీళ్లులేని బోరుబావుల పూడ్చివేతపై రెవెన్యూ శాఖ ప్రజల్లో చైతన్యం తీసుకరావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని పనికి రాని బోరుబావులను ఉద్యమరీతిలో పూడ్చివేయాలని ప్రజలు కోరుతున్నారు. రైతులు కూడా స్వచ్ఛంధంగా ముందుకు వస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement